Take a fresh look at your lifestyle.

ఉద్యోగుల విభజన పక్రియకు విధివిధానాలు ఖరారు

  • ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాల శాఖ
  • సీఎస్‌తో టీజీవో, టీఎన్జీవో నేతల భేటీ
  • 95 శాతం ఉద్యోగాల్లో స్థానికులే ఉండేలా చూడాలని విజ్ఞప్తి

రాష్ట్రంలో కొత్త జోనల్‌ ‌విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన కోసం తెలంగాణ ప్రభుత్వం విధివిధానాలను ఖరారు చేసింది. ఈమేరకు స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన కోసం సాధారణ పరిపాలన శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకపై ఉద్యోగుల విభజన 2018 రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి కొత్త జోనల్‌ ‌విధానం ప్రకారం జరుగనుంది. జిల్లా స్థాయి పోస్టులకు ఉమ్మడి జిల్లా కలెక్టర్‌నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆయా శాఖల జిల్లా అధిపతులను సభ్యులుగా నియమించింది. జోనల్‌, ‌మల్టీ జోనల్‌ ‌పోస్టుల విభజనకు జీఏడీ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఆయా శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, ఆర్థిక శాఖ నుంచి సీనియర్‌ ‌కన్సల్టెంట్‌ అధికారులు కమిటీలో సభ్యులుగా ఉంటారు.

ఉద్యోగుల నుంచి ఐచ్చికాలు తీసుకుని సీనియార్టీ ప్రాతిపదికన స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన చేపట్టనున్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు వారికి కేటాయించిన పోస్టులకు అనుగుణంగా విభజన ఉంటుంది. ప్రత్యేక కేటగిరీల్లో భాగంగా 70 శాతానికి పైగా సమస్య ఉన్న దివ్యాంగులకు పిల్లల్లో మానసిక దివ్యాంగులు ఉన్న ఉద్యోగులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఉద్యోగుల విభజన, కేటాయింపులలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత శాఖల కార్యదర్శులకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. కొత్తగా ఏర్పాటైన కొన్ని జిల్లాలు రెండు చొప్పున పాత జిల్లాల నుంచి ఏర్పాటయ్యాయి. జోనల్‌, ‌మల్లీ జోనల్‌కు సంబంధించి కూడా ఈ తరహా అంశాలు ఉన్నాయి. దీంతో జిల్లా, జోనల్‌, ‌మల్టీజోనల్‌ ‌కేటగిరీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇస్తూ విధివిధానాలను ప్రకటించింది.

సీఎస్‌తో టీజీవో, టీఎన్జీవో నేతల భేటీ
కాగా, రాష్ట్రంలోని ఉద్యోగుల విభజనపై సీఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ‌సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు హాజరయ్యారు. జోనల్‌ ‌వ్యవస్థపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు నేపథ్యంలో సీఎస్‌ ఈ ‌సమీక్ష నిర్వహించారు. మరోవైపు, జోనల్‌ ‌వ్యవస్థ, ఉద్యోగుల విభజన అంశంపై టీజీవో, టీఎన్జీవో నేతలు సీఎస్‌తో భేటీ అయ్యారు. అనంతరం టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్‌, ‌టీజీవో అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ కొత్త జిల్లాల ప్రకారమే ఉద్యోగుల విభజన ఉంటుందన్నారు. త్వరగా ఉద్యోగుల విభజన పక్రియను పూర్తి చేయాలనీ, లోకల్‌ ‌క్యాడర్‌ను అనుకూలంగా విభజన జరుగుతుందని చెప్పారు.ఉద్యోగ ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని సీఎం కేసీఆర్‌ ‌భావిస్తున్నారనీ, రాష్ట్రం ఏర్పడిన తరువాత పరిపాలనా సౌలభ్యం కోసం 33 జిల్లాలు ఏర్పాటు చేశారనీ, ఈ క్రమంలో ఏ జిల్లా ఉద్యోగిని ఆ జిల్లాలోనే సర్దుబాటు చేస్తే వారికి సౌకర్యంగా ఉంటుందని సీఎస్‌కు చెప్పామన్నారు. 95 శాతం ఉద్యోగాల్లో స్థానికులే ఉండేలా చూడాలని కోరమనీ, తమ సూచనపై సీఎస్‌ ‌సానుకూలంగా స్పందించారని చెప్పారు.

Leave a Reply