Take a fresh look at your lifestyle.

నిజాం పాలన అకృత్యాలు ప్రజాపోరాట ఘట్టాలు

“సాయుధులైన తెలంగాణ ప్రజలు నిజాం రాజుపై పోరాడుతూ పైచెయ్యి సాధించే క్రమంలో రహస్య ఒప్పందం మేరకు నిజాం రాజు సెప్టెంబర్‌ 17, 1948‌న భారత సైన్యం ముందు లొంగిపోయాడు. నిజాం సంస్థానం భారత్‌లో విలీనమైంది. 1952 అక్టోబర్‌ 21‌న కమ్యూనిస్టులు సాయుధపోరాటాన్ని అర్ధాంతరంగా విరమించికున్నారు. నిజాం పాలనలో జరుగుతున్న అకృత్యాలను, అన్యాయాలను ప్రతిఘటిస్తూ తెలంగాణ ప్రజలు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో చేసిన అనేక పోరాటాలు, రక్తతర్పణాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.”

(74వ, తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు, సెప్టెంబర్‌ 17 ‌సందర్భంగా)

నిజాం నిరంకుశ పాలనలో జాగీర్ధారులు, జమీందారులు, దేశముఖ్‌ ‌లు, భూస్వాములు, రజాకారులు, నిజాం పోలీసులు, నిజాం సైన్యాలు, యూనియన్‌ ‌సైన్యాలు, తెలంగాణలో ప్రజలను చిత్ర హింసలకు గురిచేయడం, సామూహిక హత్యలు, హత్యాచారాలు చేయడం, వెట్టిచాకిరి చేయించుకోవడం, పేదల భూములను, పండించిన పంటలను దౌర్జన్యంగా గుంజుకోవడం, ఊర్లకుర్లు తగలబెట్టడం తదితర రాక్షస క్రీడలు తెలంగాణ పల్లెల్లో నిత్యకృత్యమైనాయి. రోజు రోజుకు నైజాం పాలనా ప్రజల మెడమీద వేలాడే కత్తిలా తయారైంది. ఈ దోపిడీ పీడన భరించలేని తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలనపై సామూహిక సాయుధ తిరుగుబాటును ప్రకటించారు . జనగామ తాలూకా, కడివెండి గ్రామంలో 1946 జులై 4న విసునూరు రాంచంద్రారెడ్డి దేశముఖ్‌ ‌గుండాలు గ్రామంపై దాడులకు, దౌర్జన్యాలకు దిగి ఇండ్లపై రాళ్ళు రువ్వారు. గ్రామ సంఘ నాయకులు దొడ్డి కొమురయ్య నాయకత్యంలో ప్రజలు కర్రలు, ఒడిసేలలతో ప్రదర్శన నిర్వహిస్తుండగా దొర గుండాలు అకస్మాత్తుగా ప్రదర్శనాకారులైన ప్రజలపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో దొడ్డి కొమురయ్య అక్కడిక్కడే మృతి చెందగా దొడ్డి మల్లయ్య ,మంగళి కొండయ్య, మంగళి నర్సయ్యలతో సహా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనితో ఆగ్రహించిన ప్రజలు విసునూరు దొర గాడిని కూల్చి తిరుగుబాటు జెండా ఎత్తారు. అప్పటి వరకు బాంచెన్‌ ‌దొర కాల్మొక్కుతా అన్న బతుకులు బంధుకులెత్తి సాయుధ పోరాటానికి సిద్ధపడ్డారు. భూమి, భుక్తి, విముక్తి కోసం తెలంగాణ ప్రజలు నిజాం పాలక, దోపిడీ వర్గాలతో విరోచితంగా పోరాడారు.

అప్పటి మానుకోట తాలూకాలో జన్నారెడ్డి ప్రతాపరెడ్డి, గూడూరు రంగారెడ్డి, పిండిప్రోలు జగన్నాదరెడ్డితో సహా మరికొందరి భూస్వాముల దోపిడీ, దౌర్జన్యలకు అడ్డు, అదుపు లేకుండా పోయింది. దీనికి తోడు నిజాం పోలీసులు, నిజాం సైన్యం, రజాకారులు గ్రామాలలో మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు, బాలింతలు, గర్భిణీలు అని చూడకుండా చెరచడం, బూటుకాళ్ళతో తన్నడం, పట్కర్లతో చనురొమ్ములను వత్తడం, ఎదురు తిరిగినవాళ్లను చెట్లకు కట్టేసి చిత్రహింసలు పెట్టి కాల్చి చంపడం నిరంతరం జరుగుతుండేది. నేరడ గ్రామ ప్రత్యేక పాలనాధికారి వెల్లోడి 70 మంది మహిళలను చింతబరిగెలతో చితకబాది, బలవంతంగా పైజామాలు తొడిగించి కాళ్ళ మడిమెల దెగ్గర తాళ్లతో బిగించి కట్టి పైజామాల్లో తొండలను వదిలారు. ఆ తొండలు మహిళల శరీర భాగాలను గోళ్లతోరాక్కిన తర్వాత రక్తం కారుతున్న గాయాలపై ఎర్రటి కారం చల్లి చిత్ర హింసలు పెట్టాడు. రజాకారులు, పోలీసులు, సైనికులు మహిళలను చెరచడం నిరాటంకంగా కొనసాగించారు. పసిబిడ్డలకు సైతం పాలివ్వకుండా తల్లులను, పిల్లలను హింసించారు. గార్ల జాగీర్దారు ప్రాంతంలో 300 ఎకరాలు కలిగిన భూస్వామి వడ్డీ వ్యాపారం చేస్తూ ప్రజలను పీడిస్తుండేవాడు. ఆయనకు వ్యాతిరేఖంగా అయన మేనల్లుడు వెంకటేశ్వరరావు సాయుధపోరాటంలో పాల్గొంటున్న క్రమంలో బుచ్చిమట్లలో నిజాం పోలీసులు ఆయనను కాల్చి చంపారు.

మానుకోట తాలూకాలో 400 మందితో 20 ప్రజా సాయుధ దళాలు దేశముఖ్‌ ‌దొరల గడీలపై దాడులు సాగించాయి. ఈ దళాలు 12 వేల బస్తాల ఆహార ధాన్యాలను పంచిపెట్టాయి. పిండిప్రోలు, సంకీస, గార్ల మేతరాజుపల్లి, నెల్లికుదురు, కేసముద్రం, చెట్లముప్పారం, శ్రీరామగిరి, జానాలపాడు, పెద్దముప్పారం, ములకలపల్లి, మరిపెడ, చిన్నగూడురు, పురుషోత్తయగూడెం తదితర గ్రామాలను కేంద్రాలుగా చేసుకొని ప్రజలు సాయుధులై గెరిల్లా పోరాటాలు నడిపారు. 30 గ్రామాల్లో భూస్వాములకు చెందిన వేలాది ఎకరాల భూములను గుంజుకొని ప్రజలకు పంచిపెట్టారు. నైజాం పోలీసులు, రజాకార్లపై నిరంతర దాడులు చేస్తూ కమ్యూనిస్టు సాయుధ దళాల నాయకత్వంలో ప్రజలు పై చేయి సాధించారు. అబ్బాయిపాలెం – మానుకోట రోడ్డును, ఒక కిలోమీటరు రైల్వే మార్గాన్ని ఉద్యమకారులు ప్రజలతో కలసి ధ్వంసం చేశారు. నేల్లికుదురు గ్రామంలో రజాకార్ల క్యాంపు పై మూడు వేల మంది స్థానిక ప్రజలతో కలిసి కమ్యూనిస్టు దళాలు దాడి చేసాయి. ఇద్దరు రజాకార్లను కాల్చి చంపారు . రజాకార్ల ఆయుధాలను ప్రజలు స్వాధీనం చేసుకున్న తరువాత రజాకార్లను శిక్షించేందుకు సిద్ధపడుతుండగా యూనియన్‌ ‌సైన్యాలు అడ్డగించి రజాకార్లను కాపాడాయి. కుమ్మరికుంట్లలో జెన్నారెడ్డి కుటుంబానికి చెందిన భవనం పై దాడిచేసి నాలుగు వేల బస్తాల ధాన్యాన్ని ప్రజలకు పంచిపెట్టారు. మరిపెడ దేశముఖ్‌ ‌రామసహాయం దామోదర్‌ ‌రెడ్డి భావనని కూల్చివేసి ఆస్థలం గుండా రోడ్‌ ‌నిర్మించారు. అక్కడ దాచిన రెండు వేల బస్తాల వారి ధాన్యం పంచుకున్నారు.

పురుషోత్తయగూడెం గడీలో నిల్వచేసిన వందలాది బస్తాల ధాన్యాన్ని ప్రజలు పంచుకొని గడీని మంటల్లో కాల్చేశారు. చిలుకోడు గడీని గడ్డపారలతో నేలమట్టం చేసి అక్కడి ధాన్యాన్ని పంచుకున్నారు. కాకరవాయి గ్రామంలో వున్నసూర్యాపేట దేశముఖ్‌ ‌గడీని నేల కూల్చి ఐదు వందల బస్తాల ధాన్యాన్ని పంచుకున్నారు. అదే గ్రామానికి చెందిన రాఘవరావు అనే భూస్వామి రైస్‌ ‌మిల్లు భవనాన్ని కూలగొట్టారు. అక్కడ వున్న ధాన్యం, బియ్యం, నూకలు ప్రజలకు పంచిపెట్టారు. మానుకోట పట్టణంలో రజాకారులు, దేశముఖ్‌ ‌లపై పది వేల మంది ప్రజలు మూకుమ్మడి దాడి జరిపి ఆయుధాలు గుంజుకున్నారు. భారత యూనియన్‌ ‌సైన్యాలు ప్రజలపై కాల్పులు జరిపి రజాకారులను, దేశముఖ్‌ ‌లను కాపాడారు. 1947 సెప్టెంబర్‌ 15‌వ, తారీఖున వేలాది మంది ప్రజలు డోర్నకల్‌, ‌పాపటపల్లి రైల్వే స్టేషన్లపై దాడి చేసి పదివేల రెండు వందల బస్తాల వడ్లు మూడు వందల బస్తాల బియ్యాన్ని ప్రజలు స్వాధీనం చేసుకున్నారు. జిన్నారెడ్డి ప్రతాపరెడ్డి, గూడూరు రంగారెడ్డి, పిండిప్రోలు జగన్నాధరెడ్డి గడీలకు యూనియన్‌ ‌సైన్యాలు రక్షణగా నిలిచి ప్రజాదాడులను నిరోదించాయి. తోర్రుర్‌ ‌పరిసర గ్రామాల్లో ప్రజలను తాళ్లతో కట్టి గిలకమీద పైకిలాగి ఎత్తునుండి కిందపడిసేవారు. కొంతమంది ప్రజలను గోనె సంచుల్లో దింపి మూటగట్టి నీళ్ల బావి మీద ఇటు నుండి అటు , అటు నుండి ఇటు విసిరేస్తూ భయభ్రాంతులకు గురిచేసేవారు. మన్నెగూడెం, జయ్యారం, ఉల్లెపల్లి గ్రామాలలో ప్రజలను నేలమీద పడుకోబెట్టి వాళ్ళ మీదుగా గుర్రాలతో స్వారీ చేయించేవారు. బలపాలలో 20 మంది స్త్రీలపై సైనికులు సామూహిక హత్యాచారం చేశారు. కుమ్మరికుంట్లకు చెందిన బక్కయ్య తలపై రాళ్లతో కొట్టి చంపారు.

చెట్లముప్పారంలో నలభై మంది సాయుధులైన గెరిల్లా దళం విశ్రాంతి తీసుకుంటుండగా వంద మంది పోలీసులు చుట్టిముట్టి దాడి చేశారు. దళనాయకుడు అప్రమత్తమై జరిపిన ప్రతి దాడుల్లో పది మంది పోలీసులు మరణించగా, చాలామంది గాయపడ్డారు. పిండిప్రోలు జగన్నాధరెడ్డికి వ్యతిరేకంగా పోరాడిన ఆ గ్రామ నాయకుడు రాయల జగ్గయ్యను మరో ముప్పైమూడు మంది దళ సభ్యులను చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారు. గార్ల జాగీరులోని కట్టుగూడెం పై సైన్యం దాడికి దిగింది. ఆదాడిని అక్కడి ప్రజలు తిప్పికొట్టి ఒక సుబేదారును ఆయనకు చెందిన మరో ముగ్గురిని చంపేశారు. వారి వద్దనుండి ఆయుధాలను ప్రజలు స్వాధీనం చేసుకున్నారు. దీనికి ప్రతీకారంగా యూనియన్‌ ‌సైన్యం పెద్ద ఎత్తున ప్రజలపై దాడికి దిగింది. ఆ దాడిలో దొగ్గల పండయ్య, మూసి పుల్లయ్య మరో ఇద్దరు ప్రాణాలర్పించారు. రజాకారులు తీగల సత్యనారాయణ దళాన్ని తీవ్రంగా నష్టపరిచిన తర్వాత దోండేటి పుల్లయ్య ఆ దళ నాయకత్వాన్ని చేపట్టారు. మిలట్రీ సైన్యం పిండిప్రోలు దోండేటి పుల్లయ్య, పెద్దముప్పారం గాండ్ర చంద్రయ్య మరో సభ్యున్ని సింగారంలో పట్టుకొని గోళ్ళక్రింద, వృషణాలలోని బీర్జ్యాలలో సుదులు గుచ్చి రహస్యాలు చెప్పమని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారు. జిన్నారెడ్డి ప్రతాపరెడ్డి దౌర్జన్యానికి పూసలపల్లి గ్రామం బంజర తండాకు చెందిన రాము, భళ్ళు సోదరుల కుటుంబం మొత్తం బలైంది. వీరు దళంలో చేరి చాలాకాలం పోరాటం చేశారు. చివరకి వీరిద్దరిని కోమటిపల్లిలో మిలట్రీ సైన్యం పట్టుకొని కాల్చి చంపింది.

సాయుధులైన తెలంగాణ ప్రజలు నిజాం రాజుపై పోరాడుతూ పైచెయ్యి సాధించే క్రమంలో రహస్య ఒప్పందం మేరకు నిజాం రాజు సెప్టెంబర్‌ 17, 1948‌న భారత సైన్యం ముందు లొంగిపోయాడు. నిజాం సంస్థానం భారత్‌ ‌లో విలీనమైంది. 1952 అక్టోబర్‌ 21‌న కమ్యూనిస్టులు సాయుధపోరాటాన్ని అర్ధాంతరంగా విరమించికున్నారు. నిజాం పాలనలో జరుగుతున్న అకృత్యాలను, అన్యాయాలను ప్రతిఘటిస్తూ తెలంగాణ ప్రజలు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో చేసిన అనేక పోరాటాలు, రక్తతర్పణాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
పోరాటాల పురిటిగడ్డగా పేరొందిన గార్లకు తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ప్రత్యేక స్థానం వుంది. రజాకార్లను నైజాం పోలీసులను ఎదిరించి పోరాడి 50 మంది కమ్యూనిస్టు దళసభ్యులు ప్రాణత్యాగం చేసి అమరులైన ఘన చరిత్ర గార్లకుంది. ఇందులోఇద్దరు ఆర్గనైజర్లు బయటి ప్రాంతం వారు, 38 మంది గార్లకు చెందినవారు కాగా, మిగతా వారు గార్ల చుట్టూ ప్రక్కగ్రామాలవారు కావడం విశేషం. తరతరాల బూజు మానిజాం రాజు, నాతెలంగాణా కోటిరాతణాల వీణ అంటూ నిజాం ప్రభుత్వాన్ని గడగడలాడించిన దాశరధి కృషామాచార్యులు, రంగాచార్య్లుల పోరాట ప్రస్థానం గార్ల నుండి మొదలైంది. స్వాతంత్య్రం తర్వాత ప్రజాయుద్ధ పంధాలో భారతదేశ పాలక వర్గాలపై జరిగిన తొలిదాడి గార్ల మండలం మద్దివంచ రైల్వే ట్రాక్‌ ‌పై 1972 లో జరిగింది. అప్పటి పీపుల్స్ ‌వార్‌ ‌పార్టీ ఆదేశాల మేరకు కె.జి. సత్యమూర్తి, కొండపల్లి సీతారామయ్యల నాయకత్వంలో పచ్చిపాల వెంకన్న, బర్ల యాదగిరి రాజు, రవూఫ్‌, ‌భీముడు తదితర సాయుధ నక్సల్స్ ‌బృదం నగదుతో వస్తున్నరైల్వే ట్రాలీపై మెరుపు దాడి చేసి, అడ్డువచ్చిన సెక్యూరిటీ గార్డును హతమార్చి నగదును, ఆయుధాలను ఎత్తుకెళ్ళడం జరిగింది. దేశంలో సంచలనం రేపిన ఈ దాడి అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల తరుపున హెచ్చరిక చేస్తూ పెనుసవాలుగా నిలిచింది. ఈ దాడిలో పాల్గొన్న పచ్చిపాల వెంకన్నమద్దివంచ గ్రామానికి చెందిన వాడు. ఈ దాడిని ఉదహరిస్తూ శ్రీరాములయ్య సినిమాలో ‘‘ గార్ల రైలు దారిలోన గుంజుకున్న భల్‌ ‌రైఫిల్‌ ‌ఛల్‌ ‌నీకిస్త తమ్ముడా నీకిస్తా ‘‘ అంటూ పాడిన పాట తెలుగు ప్రజలను ఉర్రుతలూగించింది. పోరాట వీరులను పొత్తిళ్ళలో దాచుకున్నప్రాంతం గార్ల కావడం విశేషం.

తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి, భుక్తి, పేద ప్రజల విముక్తి కోసం ప్రాణాలరించిన దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, షేక్‌ ‌బందగి, బండి యాదగిరి, షోయబుల్లాఖాన్‌, ‌దోండేటి పుల్లయ్య, గాండ్ర చంద్రయ్యలతో పాటు మరెందరో అమరవీరుల త్యాగాల స్పూర్తితో అరవై ఏండ్ల సుదీర్ఘ కాలం పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. భౌగోళికంగా తెలంగాణా రాష్ట్రం సాధించుకున్నప్పటికీ సీమాంధ్ర దోపిడీ ఆధిపత్య మూలాలు తెలంగాణలోఇంకా నేటికీ కొనసాగుతున్నాయి. మరోప్రక్క ప్రస్తుత తెలంగాణ పాలకులు ప్రజాస్వామిక వ్యవస్థలను ధ్వంసం చేస్తూ నయా రాచరిక పాలనను తలపిస్తున్నారు. సీమాంధ్ర దోపిడీ ఆధిపత్య మూలాలతో పెనవేసుకున్నతెలంగాణ నయా రాచరిక పాలనను అంతం చేయడం తెలంగాణ ప్రజల మొదటి ప్రధాన కర్తవ్యం. తెలంగాణ సాయుధ పోరాట వీరులు కలలుగన్న వివక్షత దోపిడీ అణచివేత లేని సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ లక్ష్యంగా ఉద్యమిస్తూ ముందుకు సాగడం రెండవ ప్రధాన కర్తవ్యం. వందల ఏండ్ల పోరాట చరిత్ర కలిగిన తెలంగాణ పౌర సమాజానికి ఈ రెండు కర్తవ్యాలను నెరవేర్చడం పెద్ద కష్టమేమికాక పోవచ్చనేది చరిత్ర చెబుతున్న సత్యం.
జంపాల విశ్వ న్యాయవాది, రాష్ట్ర ఉపాధ్యక్షులు,
తెలంగాణ విద్యావంతుల వేదిక,
సెల్‌ :7793968907.

Leave a Reply