Take a fresh look at your lifestyle.

కనీస మద్దతు ధరలేక పడిగాపులు

  • కంది, పత్తి, మిర్చి, కూరగాయల రైతుల ఆందోళన
  • రోడ్లమీదికి వచ్చిన రైతులు
image.png

రాష్ట్ర వ్యాప్తంగా కంది, పత్తి, మిర్చి కూరగాయలను పండించిన రైతులు ఆందోళనపథంలో రోడ్లమీదికి వచ్చారు. రాష్ట్రంలోని  వందలాది మార్కెట్‌ ‌కేంద్రాల్లో రైతులు గిట్టుబాటు ధరకోసం అధికారులను నిలదీస్తున్నారు.వరంగల్‌, ‌ఖమ్మం, సూర్యాపేట, కామారెడ్డి, కరీంనగర్‌, ‌నిజామాబాద్‌ ‌వంటి మార్కెట్‌ ‌యార్డులలో రైతుల ఆందోళన తీవ్రరూపం దాల్చింది. వికాబాద్‌లో రైతులు అధికారులను చుట్టుముట్టారు. ఘోరావ్‌ ‌చేసేంతపని చేశారు.నకిరేకల్‌మార్కెట్‌ ‌యార్డు నుంచి  రెండు కిలీమీటర్ల వరకు పత్తిట్రాక్టర్‌లు నిండిపోయాయి. సూర్యాపేటలో  చిన్న వాహనాలు కూడా యార్డులోకి పోవడానికి సందు లేకుండా నిండిపోయాయి. జిన్నింగ్‌మిల్లులలో వాహనాలు  నిలిచిపోయాయి. తేమశాతం 8శాతం వరకు ఉంటే మాత్రమే పత్తి కొంటామని, అంతకన్నా ఎక్కువగా తేమ ఉంటే పత్తి కొనమని అధికారులు రైతులను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శలు వచ్చాయి. రైతులు అధికారులతో తమ గోడు చెప్పినా ఫలితాలు కనిపించలేదు. ఒక్క వికారాబాద్‌లోనే 49వేల ఎకరాల్లో పత్తిసాగు చేశారు. ఆరుతడి పంటలను పండించాలని, నీరు ఎక్కువగా అవసరమయ్యే వరి సాగు తగ్గించాలని వ్యవసాయ అధికారులు చెప్పి ప్రోత్సహించినందుననే పత్తిని పండించామని రైతులు తమ కష్టాలను వివరించారు. డిసెబర్‌, ‌జనవరి మాసాల్లో తేమ 12శాతం మేరకు ఉన్నప్పటికీ పత్తి కొన్నారని, ఇప్పుడేమో, 8శాతం తేమ ఉండాలని కొర్రీలు వేస్తున్నారని రైతు నాయకులు విమర్శిస్తున్నారు.  ఉష్ణాగ్రతలు ఇంత పెరిగిన తర్వాత
తేమ ఎందుకు ఉంటుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 60వేల ఎకరాల్లో పత్తిసాగు చేసినట్లు వ్యవసాయశాఖాధికారులు పేర్కొన్నారు.నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట, హుజూర్‌నగర్‌ ‌మార్కెట్‌యార్డులలోకి పత్తి ఎక్కువగా వచ్చిందని మార్కెట్‌ అధికారులు పేర్కొన్నారు. పత్తికి కనీస మద్ధతుధర క్వింటాలుకు రూ.5500లుగా నిర్ణయించారు.తేమశాతం 8శాతం కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే రూ.5300లుగా నిర్ణయించారు.  ఈ మద్దతుధర
రావాలంటే యార్డులలో కొన్ని రోజుల పాటు ఎదురుచూపులు చూడాల్సి వస్తున్నదని రైతులు తమ బాధలు తెలియచేస్తున్నారు. అన్నీ మార్కెట్‌ ‌యార్డులలో పత్తి కొనుగోలు  కేంద్రాలు పెంచాలని, వేగంగా డబ్బులు చెల్లించాలని రైతు సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ ఆలస్యాలను భరించలేక రైతులు ఆందోళనలు చేశారు. రోడ్లమీదికి వచ్చారు. అధికారులు టోకన్‌లు ఇచ్చే పత్తికోనగోలు చేసే ప్రయత్నాలు చేసినప్పటికీ ఆందోళనలు ఆపలేదు

image.png

తేమశాతం దగ్గర రాజీ ఉండదు : సీసీఐఅధికారులు
తేమశాతం 8శాతం కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే కాటన్‌ ‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా నిబంధనల ప్రకారం  క్వింటాలుకు రూ.5300లు ఉంటుందని సీసీఐ అధికారులు పేర్కొన్నారు.రైతులు సహనంతో ఉండాలని, పండించిన పంటను మొత్తం కొంటామని ఆందోళనలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.  అయితే అధికారుల నిర్ణయాలతో యార్డు నుంచి తీసుకపోలేక, రోజుల కొద్ది ఎదురుచూడలేక అనేక ఇబ్బందుల పాలవుతున్నారు.
కందిరైతుల కష్టాలు
తాండూర్‌, ‌కామారెడ్డి, భువనగిరి, సూర్యాపేట మార్కెట్‌యార్డులలో కంది రైతులు రోడ్లమీదికి వచ్చారు. తాండూర్‌లో ధర్నాలు చేశారు. మార్కెట్‌ ‌యార్డులలో కందిపండించిన రైతులను అధికారులు ప్రశ్నలతో ముంచెత్తుతున్నారు.కందిపండించినట్లు  ఆధారాలేమిటీ? ఆధార్‌కార్డు, పాస్‌బుక్‌, ‌వ్యవసాయాధికారుల సర్టిఫికేట్‌ ‌వంటి ప్రశ్నలతో రైతులను వేధిస్తున్నారు. క్వింటా ధర రూ.5800లు తమకు దక్కడం లేదని రైతులు వాపోయారు.  అన్నీ మార్కెట్‌ ‌యార్డులలో కేంద్రం అనుమతించనందున కందులు కొనలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. కేంద్రం 50వేల మెట్రిక్‌ ‌టన్నుల కందులు కొనుగోలు చేసేందుకు మాత్రమే అనుమతిని ఇచ్చినట్లు తెలిసింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా కంది సాగు గణనీయంగా పెరిగింది.ఈ ఏడాది 2.86లక్షల హెక్టార్లలో కంది సాగు  చేశారని రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే  2లక్షల  మెట్రిక్‌ ‌టన్నుల కందుల ఉత్పత్తి జరిగింది. దీనితో మార్కెట్‌ ‌యార్డులలోకి ఎక్కువగా కంది పంట వచ్చింది.చాలా చోట్ల రైతులు 4వేల చొప్పున క్వింటాలు ప్రైవేట్‌ ‌రైతులకు అమ్ముకున్నారు.ఈ పరిస్థితిని గమనించిన రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెంటనే కేంద్రం 50వేల మెట్రిక్‌టన్నుల కందుల కొనుగోలు అనుమతి నివ్వాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా మిర్చి రైతులు ఖమ్మం , వరంగల్‌ ‌మార్కెట్‌యార్డులలో ధర్నాలు చేశారు. మిర్చిధరలు డిసెంబర్‌, ‌జనవరిలో ఎంతు ఉన్నదో,అదేవిధంగా ఇప్పుడు కూడా చెల్లించాలని డిమాండ్‌ ‌చేశారు. డిసెంబర్‌ ‌జనవరిలో మిర్చిని రూ.23వేలు క్వింటాలు చొప్పున కొనుగోలు చేశారు. ఈ ధరను చెల్లించకుండా, క్వింటాలుకు రూ.19వేలు, 20వేలు చెల్లించేందుకు మాత్రమే అంగీకరిస్తున్నారు. యార్డులలోకి వచ్చిన మిర్చిని  గ్రేడింగ్‌పేరుతో తక్కువ ధరలను నిర్ణయిస్తున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇదేవరుసలో మొక్కజొన్న 5లక్షల హెక్టార్లలో సాగు చేశారు. 25.59 లక్షల టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి జరిగింది. దీనితో మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర లభించే పరిస్థితులు కనిపించడంలేదు. గతేడాదికంటే ఆహారధాన్యాల ఉత్పత్తి 40శాతం పెరిగిందని అధికారిక గణాంకాలు తెలియచేస్తున్నాయి.మరోవైపున కూరగాయల ధరలకు మద్దతు లభించక రైతులు విలవిలలాడుతున్నారు. డిసెంబర్‌వరకు క్వింటాలు రూ.5వేలు ఉన్న టమాటా, ఒక్కసారే తగ్గిపోయింది. క్వింటాలుకు రూ. 1000 కూడా లభించని పరిస్థితులు వచ్చాయని రైతులు తమ ఘోష చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని రైతు సంఘాలన్నీ రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని డిమాండ్‌ ‌చేసేందుకు సిద్ధమయ్యాయి.

  • కనీస మద్ధతు ధర నిర్ణయించే అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలి
  • 50వేల  టన్నుల కందులు అదనంగా కొనుగోలు చేయాలి
  • కేంద్ర వ్యవసాయ పరిశోధనాసంస్థ సమావేశంలో రాష్ట్ర మంత్రి నిరంజన్‌రెడ్డి 
image.png

 రైతులు పండించిన పంటలకు కనీసమద్ధతు ధర నిర్ణయించే అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రైతులు రాష్ట్రాలలోని శీతోష్ణపరిస్థితులకు అనుగుణంగా పంటలు పండిస్తారని, అందుకని శ్రమకోర్చి పండించే పంటలకు గిట్టుబాటు ధరను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండటం సమంజసమని ఆయన అన్నారుగురువారం న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ పరిశోధనాసంస్థ గవర్నింగ్‌ ‌బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశోధనా సంస్థకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   .ఉత్పత్తి వ్యయం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరుగా ఉంటుందని, రాష్ట్రాలకు ఉత్పత్తి వ్యయాన్ని పరిగణనలోకి తీసుకొని మద్దతు ధర నిర్ణయించేందుకు అవకాశాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నామని తెలిపారు.రైతులు ఎక్కువగా ఉద్యానపంటలను, ఆరుతడి పంటలను పండించాలని ప్రభుత్వం చెప్పే సూచనలను పరిగణనలోకి తీసుకొని  తక్కువ నీటి వినియోగంతో పండించే పంటలను రైతులు పండిస్తున్నారని పేర్కొన్నారు.కాళేవ్వరంతో తెలంగాణ వ్యవసాయ రంగంలో గొప్ప మార్పులు వచ్చాయని  సాగువిస్తీర్ణం పెరిగిందని మంత్రి చెప్పారు.మిషన్‌కాకతీయ పథకంలో  వేలాది చెరువులను బాగు చేసుకున్నామని, దీనితో చిన్ననీటివనరుల కింద సాగువిస్తీర్ణం పెరిగిందని చెప్పారు.వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జీవ ఎరువులు, బయెటెక్నాలజీ, సాక్ష్మీఇల్‌హెల్త్ , ‌సీడ్‌టెక్నాలజీ అత్యాధునిక సదుపాయాలతో ఆహారోత్పత్తులు వంటి అనేకాంశాలపైన పరిశోధనలు జరిగాయని, సత్ఫలితాలను సాధించామని వివరించారు.గత ఐదేళ్లలో ఆచార్య జయశంకర్‌ ‌విశ్వవిద్యాలయంలో అధికదిగుబడులను ఇచ్చే తెలంగాణ సోన, కేఎన్‌ఎం13, ‌పీఆర్జీ176 రకం కందులు,వంటి రకరకాల విత్తనాలను ఉత్పత్తి చేశామని వ్యవసాయ మంత్రి ఏర్కొన్నారు.ధరల నియంత్రణకోసం క్రాప్‌ ‌కాలనీల ఏర్పాటుపై కార్యాచరణ ప్రణాళికలను ఖరారు చేయనున్నామని సింగిరెడ్డి పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన భాండాగారం గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకున్నామని, ఈ దిశలోనే రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేశామని వివరించారు. వర్షాధారంగా పండించే పత్తికి  ప్రత్యామ్నాయంగా కందిపంటను సాగు చేసేవిధంగా కొత్త రకం కంది విత్తనాలను ప్రోత్సహించామని చెప్పారు. దీనితో కంది విస్తీర్ణం 2.86లోల హెక్టార్లకు పెరిగిందని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి 40.8 శాతం పెరిగిందని, 130లక్షల మెట్రిక్‌టన్నుల ఆహారధాన్యల ఉత్పత్తికి రాష్ట్రం చేరుకున్నదని చెప్పారు. అదనంగా 50వేల మెట్రిక్‌ ‌టన్నుల కందుల కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

Leave a Reply