Take a fresh look at your lifestyle.

ఆయువు పెంచే ఔషధం లాంటి వాడు నిజాయితీ పరుడు

“వ్యవస్థీకృతమైన అవినీతిని అంగీకరించే మానసిక వైకల్యం మధ్యతరగతి లో బాగా పెరిగింది.తత్ఫలితంగా సమాజంలో ప్రశ్నించే తత్వం నశించి న్యాయానికి గోతులు తీయబడుతున్నను నాకెందుకులే అనే ఉదాసీనత మానవ మస్తిష్కం లో గూడు కట్టుకుంది. విలాసాలకు అలవాటు పడ్డ మనిషి వికృత పోకడలకు దన్నుగా అవినీతి తన ఆకృతిని మార్చుకుంటున్నది. .కనీస అవసరాలు తీరక కష్టజీవులు వెతల పాలౌతుంటే పిడికెడు మంది గుప్పెట్లో కేంద్రీకృతమై సంపదను చూపి దేశం ఎదుగుతుందనే భ్రమల్లో ముంచి పబ్బం గడుపుకుంటున్న పాలకుల దుర్నీతి కి ప్రస్తతమున్న స్థితి అద్దం పడుతున్నది.”

ఈ మధ్య సామాజిక మాధ్యమం వాట్సాప్‌ ‌లో ఒక సూక్తి విస్తృత ప్రచారంలో ఉండి,విశేషంగా ఆకర్షిస్తున్నది.కలుపు మొక్క పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరుగదు.అలాగే అవినీతి చేసేవాడు ఎదిగినంత తొందరగా నిజాయితీ పరుడు ఎదగడు. అన్న సూక్తిని చాలామంది మిత్రులు షేర్‌ ‌చేయడం ,బాగుందని మిత్రులంతా స్పందించినప్పడు నేను కొంచెం ఆలోచనలో పడ్డాను. ఎందుకంటే సూక్తిలోని పదాలు సుందరంగా అర్థవంతంగా ఉన్నప్పుడు మరో ఆలోచన లేకుండా నలుగురికి పంచాలనే ఉబలాటం ఉరకలేస్తుంది. నిజమే పంట చేనును కబళించే కలుపు మొక్క ఎంత తొందరగా పెరుగుతుందో అంతే వేగంగా వేర్లతో సహా పెకలించబడుతుందనే స్పృహ కూడా మనలో ఖచ్చితంగా ఉండాలి. అలాగే అవినీతి పరుడు సమాజానికి కలుపు మొక్కలాంటి వాడే కదా! పంటచేను ఎదగకుండా కలుపు మొక్కలు ఎలా నిరోధిస్తాయో దేశం అభివృద్ధి చెందకుండా అవినీతిపరులు అడ్డుగోడలుగా నిలుస్తున్నారు. మరి అలాంటి వారు ఎదగడం ఏంటి అనే ప్రశ్న మనలో ఉత్పన్నం కావాలి కదా! దేశాన్ని ఎదగకుండా చేసే అభివృద్ధి నిరోధకుల ఎదుగుదలకు మన భాగస్వామ్య మెంతుందనే ఆలోచన రావాలి కదా! దేశభక్తి నర నరాన జీర్ణించుకున్న పాలకులకు,వారిని గద్దెనెక్కించిన కోట్లాది ప్రజలకు ఇలాంటి కలుపు మొక్కలను ఏరివేయాలనే స్పృహా కల్గియున్నట్లైతే ఇప్పటికీ తిండికి బట్టకు నోచుకో అగచాట్లు పడుతున్న అధోజగతి బతుకుల ఆకాంక్షలు కొంతమేరకైనా తీరేవి కదా!పేద ధనిక భేదం లేకుండా విద్యా వైద్యం ప్రజలందరికి సమానంగా అందిస్తే ఈ పాప ప్రక్షాళన కనీసంగానైనా జరిగేది కదా!దానికి భిన్నంగా ఈ రెండు రంగాలు కార్పోరేటీకరణ చెంది సామాన్యునికి మరింతగా దూరమవు తున్నాయి.

మనిషి స్వార్థానికి జనించిన అవినీతి వికృత శిశువు ‘‘ఇంతింతై వటుడింతై అన్నట్లుగా’ అడ్డు అదుపు లేకుండా ఆకాశమే హద్దుగా విస్తరిస్తున్నది. అయితే కాస్త లోతుగా ఆలోచిస్తే ఎదుగుదల అనేది పరిమాణాత్మకంగా కాకుండా గుణాత్మకంగా ఉండాలి. అది సిరి సంపదలతో ముడి పడియున్న అంశం కానే కాదు.అక్రమార్జనతో ఆడంబరాలను ప్రదర్శించే వాని ప్రవర్తనను ఎదుగుదల గా భ్రమించడం అవినీతికి యోగ్యతా పత్రమిచ్చినట్లేననీ భావించక తప్పదు. సాటి మనిషి కష్ట సుఖాల్లో సహానుభూతిని పొంది తన కర్తవ్యాన్ని నిజాయితీ గా నిర్వర్తించే వ్యక్తి నిరాడంబరంగా జీవించడం అతని ఎదుగుదల లోపంగా భావించడమే ఓ పెద్ద వైపరిత్యం. ‘‘ఎదుగుల’’ పదాన్ని ఇంత సంకుచితార్థం లో ఉపయోగించడం కూడా సరియైనది కాదు. అందులోను అవినీతి సొమ్ము తో ఆస్తులు కూడబెట్టి విలువలు రాహిత్యంతో బతికే వాని జీవితాన్ని ఎదుగుదల గా ఎట్లా భావిస్తాము. అలా చూస్తే దేశం కోసం సర్వస్వం త్యాగం చేసి ప్రజా హృదయాలల్లో చిరస్థాయిగా నిలిచిన శిఖర సమానులైన వ్యక్తుల ఎదుగుదలను ఏ పరికరాలతో కొలవగలము? నిరంకుశ పాలకుల నుండి విముక్తి పొందడానికి పోరు బాటలో నడిచి ప్రాణ త్యాగం చేసిన వీరుల ఎదుగుదల ఏండ్లు గడచిన మన ఎదల్లో ఇంకా పదిలంగానే ఉంది కదా! శ్రమ జీవుల స్వేదం తో కోట్లను కొల్లగొట్టి కుబేరులు గా వెలుగుతున్న బడా కార్పొరేట్లు కన్నుమూసినంతనే వారి చరిత కాల గర్భంలో కలుస్తున్నది కదా!’’ నీతి తప్పిన వాని చిరునామా నీటి బుడగేనన్న సత్యాన్ని మరిచిపోతే ఎలా? సొంత లాభం కొంత మానుక పొరుగు వారికి తోడ్పడవోయ్‌’’ అన్నా గురజాడ అడుగు జాడల్లో సమాజ గమనానికి సరి కొత్త బాటలు వేసి వెలుగులు విరజిమ్మిన వారి వ్యక్తిత్వాన్ని ఏ సిరుల ఎదుగుదల తో పోల్చగలము. కంచే చేను మేసినట్లు అందిన కాడికి దండకునే ఆర్థిక అరాచక వాదుల అవినీతి కృత్యాలను ఎదుగుదల గా భావించడం ఇప్పటికే కొడిగట్టుతున్న నిజాయితీ ని నిలువెల్లా పాతరవేయడమే అవుతుంది.

తెల్లవాడి బానిసత్వం నుండి విముక్తి పొంది 70 సంవత్సరాలు గడిచినను ఇంకా నల్ల జలగల నయవంచన తో అల్లాడుతున్న అన్నార్తుల భర తావనికి పట్టిన అవినీతి చెదలు ను ఎదగనిచ్చిన ఏమరుపాటు తనం వల్ల ఎంత మూల్యం చెల్లించుకుంటున్నామో అర్థమైతే కారుణ్యం లేని ఈ కర్కషత్వాన్ని దగ్దం చేసే యజ్ఞానికి ఎప్పుడో పూను కోవాల్సింది. చాప క్రింద నీరులా సర్వ రంగాల్లో విస్తరించిన అవినీతి చీడను అంతమొందించే ఆలోచనలు అణగారిన సమాజం చేయకుంటే విభజించు పాలించు పన్నా గాలను అమలు చేసి మరింత అధఃపాతాళంలోకి తొక్కడానికి పాలక వర్గాలు ప్రయత్నిస్తూనే ఉంటాయి.వ్యవస్థీకృతమైన అవినీతిని అంగీకరించే మానసిక వైకల్యం మధ్యతరగతి లో బాగా పెరిగింది.తత్ఫలితంగా సమాజంలో ప్రశ్నించే తత్వం నశించి న్యాయానికి గోతులు తీయబడుతున్నను నాకెందుకులే అనే ఉదాసీనత మానవ మస్తిష్కం లో గూడు కట్టుకుంది. విలాసాలకు అలవాటు పడ్డ మనిషి వికృత పోకడలకు దన్నుగా అవినీతి తన ఆకృతిని మార్చుకుంటున్నది. .కనీస అవసరాలు తీరక కష్టజీవులు వెతల పాలౌతుంటే పిడికెడు మంది గుప్పెట్లో కేంద్రీకృతమై సంపదను చూపి దేశం ఎదుగుతుందనే భ్రమల్లో ముంచి పబ్బం గడుపుకుంటున్న పాలకుల దుర్నీతి కి ప్రస్తతమున్న స్థితి అద్దం పడుతున్నది.బ్యాంకులను కొల్లగొట్టిన బడా మోసగాళ్ళ పట్ల ప్రదర్శిస్తున ఉదాసీనత దేశంలో అవినీతి మరింత పెరగడానికి ఊతమిచ్చినట్లుగానే.

కనబడుతుంది.అనేక కుంభకోణాలకు కారణమైన వారు నిర్దోషులుగా బయట పడి దర్జాగా జీవితాలను కొనసాగిస్తున్న తీరు పట్ల జనంలో వ్యతిరేకత లేకపోవడంతో క్రింది స్థాయి లో బరితెగింపు తనం పెరిగింది.బినామి పేర్లలో ఆస్తులను పోగేసుకొని వ్యవస్థలను శాసిస్తున్న వ్యక్తుల హీరోయిజం సామాన్యుని కళ్ళకు గొప్ప ఎదుగుదల గా కనబడుతుంది.కాని సమాజానికి తప్పుడు సంకేతాలందిస్తూ అవినీతి కీ మరింత ఆజ్యం పోస్తుంది.అందుకే నిజాయితీ పరుడు ఎదగడు అనే తప్పుడు ఆలోచనా ధోరణి జనసామాన్యం లో స్థిరపడింది.కాని మనిషిని మనిషిగా చూసే మానవీయ దృక్పథం ,సేవాతత్పరత, నైతిక విలువలు భావితరాలకు వారసత్వంగా సంక్రమించిన జేయడం లో నిజాయితీ పరుని ఎదుగుదల అవినీతి పరుని కి అందనంత ఎత్తులో ఉంటుందని చెప్పడానికి సందేహం అవసరం లేదు.గంజాయి వనం లో తులసి మొక్కలా సమాజం ఆయువు పెంచే ఔషధంలా వర్దిల్లుతూనే ఉంటాడు.

– గన్‌ ‌రెడ్డి ఆదిరెడ్డి, 949789731

Leave a Reply