Take a fresh look at your lifestyle.

పార్లమెంట్‌ను అవమానించేలా విపక్షాల తీరు

సభా కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యం
బిజెపి పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధాని ఆగ్రహం
విపక్ష పార్టీల తీరు పార్లమెంట్‌ను అవమానించేలా ఉందని ప్రధాని మోదీ అన్నారు. సమావేశాల్లో ఆయా పార్టీల నేతలు అనుసరిస్తున్న వైఖరిపై ప్రధాని మండిపడ్డారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన తమ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాలను విపక్షాలు అడ్డుకోడమే వారి లక్ష్యంగా ఉందని ఆరోపించారు. వాయిదా తీర్మానాలను ఇస్తూ..నినాదాలతో సభ కార్యక్రమాలకు ప్రతిపక్షాలు ఆటంకం కలిగిస్తున్నాయని, ఇది పార్లమెంట్‌కు అవమానం అని, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, ప్రజలకు అవమానమని ప్రధాని అన్నారు. రెండు సభల్లోనూ ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరకర రీతిలో వ్యవహరిస్తున్నారని, ఓ ఎంపీ మంత్రి చేతుల్లో నుంచి పేపర్లు లాగేసి ..ఆ పేపర్‌ను ముక్కలు చేసి సభలో విసిరేసిన తీరును ప్రధాని ఖండించారు.

ఇటీవల పెగాసస్‌ ‌వ్యవహారంపై మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‌మాట్లాడుతున్న సమయంలో తృణమూల్‌ ఎం‌పీ శాంతను సేన్‌ ‌మంత్రి చేతుల్లోంచి పేపర్‌ ‌లాగేసి చింపిన విషయం తెలిసిందే. పార్లమెంట్‌లో బిల్లులు ఆమోదం పొందుతున్న తీరుపై తృణమూల్‌ ఎం‌పీ డెరిక్‌ ఒ‌బ్రెయిన్‌ ‌చేసిన కామెంట్‌ను కూడా మోదీ తప్పుపట్టారు. బిల్లులను ఆమోదిస్తున్నారా లేక పాపిడి చాట్‌ ‌చేస్తున్నారా అని ఒబ్రెయిన్‌ ‌వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు అభ్యంతరకంగా ఉన్నట్లు మోదీ తమ పార్టీ ఎంపీలతో జరిగిన భేటీలో తెలిపారు. ఈ భేటీలో అమిత్‌ ‌షా, రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌సహా కేంద్ర మంత్రులు, ఎంపిలు పాల్గొన్నారు.

Leave a Reply