Take a fresh look at your lifestyle.

రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారం కోసం ప్రధాన పార్టీలు..

రానున్న శాసనసభ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాలో అధికారం చేపట్టేందుకు ప్రధాన పార్టీలు ఇప్పటినుండే వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలను ఢీ కొనడం అంతసులభమైన పనేమీకాదని తెలిసినప్పటికీ ఆయా ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలను ఆకట్టుకోవడం ద్వారా కనీసం ప్రతిపక్ష హాదాలోనైనా నిలిచేదిశగా అడుగులు వేస్తున్నాయి. ఏపిలో ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి, తెలంగాణలోని కాంగ్రెస్‌ ఈమేరకు విశ్వప్రయత్నాలు చేస్తుండగా ఈ రెండిటి హోదాను పక్కకునెట్టి రెండు చోట్ల తామే అనిపించుకునేందుకు బిజెపి ముందుకు దూసుకుపోతోంది. అటు ఏపిలోగాని, ఇటు తెలంగాణలోగాని ప్రతిపక్ష పార్టీకి చెందిన శాసనసభ్యులు పలువురు చెయ్యిజారిపోతుండగా, ఆపార్టీలో ఇముడలేకపోతున్నవారికిప్పుడు బిజెపి ఆశాకిరణంగా కనిపిస్తుండడం కూడా భారతీయ జనతాపార్టీలో ఉత్సాహాన్ని నింపుతోంది. తెలంగాణలో ఎన్నడూ ఊహించని రీతిలో గత లోకసభ ఎన్నికల్లో నాలుగు స్థానాలను కైవసం చేసుకున్నబిజెపిఅదేదూకుడుతోముందుకెళ్తున్నప్పటికీ, ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో మాత్రం ఆశించిన ఫలితాలను పొందలేకపోయిన విషయం తెలియందికాదు. అయితే ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ అనుకున్న స్థాయిలో ప్రధాన ప్రతిపక్షస్థాయిని నిలుపుకోలేక పోతుండడంతో బిజెపి దూకుడు పెంచింది. మొదటినుండి దక్షిణాది రాష్ట్రాల్లో కాషాయ జంఢాను ఎగురవేయాలన్న లక్ష్యంగా ఉన్న బిజెపి చకచక పావులను కదిపేందుకు తనవంతు ప్రయత్నాలు ప్రారంభించింది. ఏకంగా రెండు రాష్ట్రాల్లో కూడా పార్టీ నూతన సారథులను నియమించింది.

ఈ ఇద్దరు సారథులు కూడా ఫైర్‌ ‌బ్రాండ్‌గా పేరున్నవారే కావడం ఒకటి కాగా, ఈ నియామకాల వెనుక వారి మాతృసంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ ‌హస్తమున్నదన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఏది ఏమైనా వీరి లక్ష్యం మాత్రం  రెండు రాష్ట్రాల్లో కాషాయ జంఢా ఎగురవేయడం లేదా ప్రతిపక్ష హోదా వరకు ఎగబాకాలన్నదే ధ్యేయం. ఏపిలో ఇంకా కొత్త టీమ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉండగా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్‌ ‌తాజాగా ఇరవై రెండు మందితో తన కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. ఇందులోని వారంతా చాలా సీనియర్లు కావడంతో పార్టీని బలోపేతం చేసే అవకాశం ముందని సంజయ్‌ ‌భావించినట్లు తెలుస్తున్నది. తెలంగాణలో త్వరలో జిఎహెచ్‌ఎం‌సి, వరంగల్‌ ‌కార్పోరేషన్‌ ఎన్నికలు జరుగాల్సి ఉన్నాయి. వాటితో పాటుగా ఏ ఎన్నికలు వచ్చినా గతంలో మాదిరిగా కాకుండా సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలను కైవసం చేసుకునే విధంగా తమ టీమ్‌ ‌పనిచేస్తుందని బిజెపి నమ్మకంగా ఉంది. రాష్ట్ర రాజధానిలోని జిహెచ్‌ఎం‌సీలో పట్టుసాధించేందుకు పదిహేను అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న  నాలుగు  పార్టీ యూనిట్లకు తోడు మరికొన్ని నూతన యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు సన్నిహితులవుతారన్నది వ్యూహం. అలాగే 2023లో అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత జరుగనున్న పార్లమెంట్‌ ఎన్నికల నాటికి పార్టీని మరింత పటిష్టవంతం చేసేందుకు కూడా ఈ యూనిట్స్ ‌పనిచేస్తాయి. కాగా ఇప్పటి నుండి ఆ పార్టీ వర్గాలు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వ తప్పులను ఏకరువు పెట్టడమే కాకుండా ప్రజల ముందు నిలదీసే ప్రయత్నాలు ప్రారంభించింది.

ముఖ్యంగా కొరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ కేవలం రాష్ట్ర నాయకత్వమే కాకుండా పార్టీ జాతీయస్థాయి నాయకుడితో తీవ్రంగా విమర్శింపచేసింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను వెచ్చించడంలో అవకతవకలు జరిగాయని, ఆరోగ్యశ్రీలో కొరోనాను చేర్చాలన్న తదితర డిమాండ్లతో నిత్యం ప్రజల మధ్య ఉంటోంది. అలాగే తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టుల అవకతవకలు, నిర్మాణాల నిధుల పెంపు, ఏపి నీటి దోపిడి చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వ వైఖరిని ఉతికి ఆరేసే ముమ్మర ప్రయత్నాలను రాష్ట్ర బిజెపి చేస్తోంది. ఇదే క్రమంలో వివిధ రూపాల్లో కేంద్రం అందించే నిధులకు లెక్కలు చెప్పనంతవరకు కేంద్రం నుండి మరే సహాయం అందకుండా రాష్ట్ర నాయకత్వం అడ్డుతగులుతోందన్న ఆరోపణలు కూడా ఆ పార్టీపైన లేకపోలేదు. రెండు  తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి తగాదాను కేంద్రంలోని బిజెపి తన రాజకీయానికి వాడుకోవాలని ప్రయత్నిస్తున్నదన్న ఆరోపణలు కూడా ఆ పార్టీపైన ఉన్నాయి. కాగా కాంగ్రెస్‌ ‌కేంద్ర నాయకత్వం పటిష్టంగా లేక, రాష్ట్రంలో కనీసం రాష్ట్ర అధ్యక్షుడిని కూడా ఏర్పాటు చేసుకునే పరిస్థితి. ఏపిలోనైతే కాంగ్రెస్‌ ఎప్పుడో తుడిచిపెట్టుకుపోయింది. ప్రతిపక్షంగా ఉన్న టిడిపి పార్టీ స్థిరత్వాన్ని కోల్పోతోంది. ఈ పరిస్థితిలో రెండు రాష్ట్రాలో తమ పార్టీని పటిష్టపడేందుకు ఇదే మంచి సమయమంటూ బిజెపి అధికారం దిశగా పయనం ప్రారంభించింది.

Leave a Reply