Take a fresh look at your lifestyle.

ఉపాధి కోసం వెళ్తూ అనంత లోకాలకు

  • నలుగురు మృతి, 15 మందికి తీవ్ర గాయాలు
  • కూలీల ట్రాలీని ఢీ కొట్టిన లారీ
  • చెల్లా చెదురుగా మృతదేహాలు – రోడ్డుపై తెగిపడిన అవయవాలు
  • మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు

శాయంపేట, ఏప్రిల్‌ 08 (‌ప్రజాతంత్ర విలేఖరి) : మాందారిపేటలో శుక్రవారం ఉదయం 5:30 నిమిషాలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదం జరిగిన స్థలంలో మృతుల అవయవాలు చెల్లా చెదురుగా పడి ఉండటంతో భయానక వాతావరణం నెలకొంది. రోడ్డంతా రక్తంతో తడిసిపోయింది. ఆర్తనాదాలు, ఆహాకారాలతో దద్దరిల్లింది. ఎం జరిగిందని తెలుసుకునే లోపే ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పోలీసులు, స్థానికుల సహయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని తమ జీవితాలను రోడ్డు ప్రమాదం చిన్నా భిన్నం చేశాయంటూ మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

మండలంలోని  పత్తిపాక గ్రామానికి చెందిన 25 మంది మహిళా కూలీలు ఉదయమే బయలుదేరి యశంకర్‌  ‌భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని అంకుషాపూర్‌ ‌గ్రామంలో మిరప తోటలోకి పనికి వెళ్తుండగా మార్గ మధ్యలో వరంగల్‌-‌భూపాలపల్లి హైవే మందారిపేట కాస్తూరిభా ఆశ్రమ పాఠశాల ముందు కూలీలతో వెళ్తున్న అశోక్‌ ‌లె లాండ్‌ ‌ట్రాలీ వాహనాన్ని గుర్తు  తెలియని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాలీలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళా కూలీలు బాబు రేణుక(45), పూల మంజుల(45), దండెబోయిన విమల(40), అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న శాయంపేట ఎస్‌ఐ ‌వీరభద్రరావు, పరకాల ఏసీపీ ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడ్డ వారిని వరంగల్‌ ఎం‌జీఎం ఆసుపత్రికి అదే ట్రాలీలో తరలించారు. ఇందులో సూరబోయిన రేణుక, జక్కుల ఐలమ్మ, గుండెబోయిన ఓదెమ్మకి స్వల్పగాయాలు కాగా శాయంపేటలోని ఆర్‌ఎం‌పి వద్ద చికిత్స పొందుతున్నారు. ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చల్లా ఐలి కొమురమ్మ (55) మరణించగా మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఎంజిఎం హాస్పిటల్‌లో క్షతగాత్రులను గండ్ర దంపతుల పరామర్శ
విషయం తెలిసిన వెంటనే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్‌ ‌జిల్లా ప్రజా పరిషత్‌ ‌చైర్‌పర్సన్‌, ‌భూపాలపల్లి జిల్లా తెరాస పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి రెడ్డిలు ఎంజిఎంలోని క్షతగాత్రులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. తీవ్రంగా గాయపడ్డ చింతల రాధను సికెఎం హాస్పిటల్‌కు తరలించారు. మెరుగైన చికిత్స కొరకు హైదరాబాద్‌ ‌తరలించాలని వైద్యులకు సూచించారు. అనంతరం మృతి చెందిన వారి మృత దేహాలను సందర్శించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భగా వారు మాట్లాడుతూ వారి మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు  తమ ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. పంచాయితీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావుతో మాట్లాడగా వారు వెంటనే ప్రభుత్వం తరుపున తక్షణ సహాయం కింద మృతుల ఒక్కో కుటుంబానికి రూ.1,00,000/- ను మంజూరు చేశారు. వ్యక్తిగతంగా మా వంతు తక్షణ సహాయంగా రూ.25 వేలు ఆర్థిక సహాయం అందచేస్తామని, సిఎం దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సహాయం అందచేస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply