- వలస కార్మికుల సమాచారం సేకరణ
- హెల్త్ చెకప్, పిల్లలకు పౌష్టికాహారం
- పెద్దపల్లి కలెక్టర్ సిక్తా పట్నాయక్
జిల్లావ్యాప్తంగా కోవిడ్-19వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబం ధిత అధికారులను ఆదేశించారు. లాక్డౌన్ అమలు తీరు, కార్మికుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ మంగళవారం సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించా రు. జిల్లాలో ఉన్న పరిశ్రమలు, ఇటుక బట్టీలలో పనిచేస్తున్న కార్మికులు, వలస కార్మికుల పూర్తి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. లాక్డౌన్ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తప్పనిసరిగా పరిశ్రమలు ఇటుక బట్టీలు మూసివేయాలన్నారు. కార్మికులకు అవసరమైన వైద్య పరీక్షల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేయాలని డిఎంహెచ్ఓకు సూచించారు. బాల కార్మికుల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. వలస కార్మికులకు ప్రభుత్వం అందించే సహాయం చేరేవరకు అధికారులు చిత్తశుద్దితో పని చేయాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతలో కార్మికులకు 12కిలోల బియ్యం, రూ.500నగదు సహాయం అందిస్తుందన్నారు. వలస కార్మికులకు మొదటి విడతలో అందించిన సహాయం వివరాలను అధికారులు సమర్పించి, కార్మికుల ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్లతో వివరాలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. వలస కార్మికుల కొరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపులను సంబంధిత అధికారులు తరచుగా సందర్శించాలన్నారు. లాక్ డౌన్ అమలు తీరును తహశీల్దార్లు, పోలీస్ అధికారులు ఆయా మండలాల్లో ఆకస్మిక తనిఖీ చేస్తూ పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషినల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఇంఛార్జీ డిఆర్వో నరసింహమూర్తి, డిఎంహెచ్ఓ డాక్టర్ సుధాకర్, డిడబ్ల్యుఓ అక్కేశ్వర్ రావు, ఆర్డీఓ శంకర్ కుమార్, మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ మందల వాసుదేవరెడ్డి, తహశీల్దార్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.