Take a fresh look at your lifestyle.

మళ్ళీ లాక్‌డౌన్‌ ‌తప్పదా..?

రోజురోజుకు పెరుగుతున్న కోవిద్‌ ‌పాజిటివ్‌ ‌కేసులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదుపుచేయలేక పోతున్నాయి. ఇటీవల దేశంలో రోజుకు కనీసం పదిలక్షల పాజిటివ్‌ ‌కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా వేల సంఖ్యలో ఉంటున్నాయి. గడచిన వారం రోజుల పరిస్థితిని పరిశీలించినట్లయితే దేశవ్యాప్తంగా 26 లక్షల కొత్త కేసులు నమోదైనట్లు తెలుస్తున్నది. అలాగే మరణాలు కూడా 23 వేలు దాటడంతో ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు. గత సంవత్సరం తక్కువ కేసులున్నప్పుడే కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ‌విధించడంద్వారా అదుపుచేయగలిగింది. కాని, కొరోనా రెండవ వేవ్‌లో అంతకు నాలుగింతల కేసులు నమోదవుతున్నా, మనుష్యులు పిట్టల్లా రాలిపోతున్నా కేంద్రం మాత్రం లాక్‌డౌన్‌ ‌విధించేవిషయంలో ఉదాసీన వైఖరిని అవలంభిస్తున్నది.

గత లాక్‌డౌన్‌ ‌నేపథ్యంలో  ఎదురైన ఆర్థిక ఇబ్బందులు, ప్రజలుపడిన నానా కష్టాల కారణంగా  ఈసారి లాక్‌డౌన్‌ ‌లేకుండానే ప్రత్యేక చర్యలతో కొరోనాను కట్టడి చేయాలని కేంద ప్రభుత్వం ఆలోచించింది. లాక్‌డౌన్‌ అన్నది చివరి ప్రత్యమ్నాయంగా సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోదీ పేర్కొనడంతో లాక్‌డౌన్‌ ‌విధించే అవకాశాలు లేవని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పేర్కొన్నాయి. కాని, రోజురోజుకు మరణాల సంఖ్య పెరుగుతుండటం కనీసం ప్రాణవాయువును కూడా అందించలేని స్థితిలో హాస్పిటల్స్ , ‌బెడ్‌, ‌వెంటీలేటర్లకు అవకాశంలేకపోవడంతో రోగులు పిట్టల్లా ఎక్కడికక్కడ రాలిపోతున్నారు. స్మశానంలో కూడా మృతులకు చోటు లేకుండా పోతోంది. భారతదేశంలో ఏర్పడిన ఈ విపత్కర పరిస్థితులకు విదేశాలు తమ సానుభూతి వ్యక్తంచేయడంతోపాటు, సహకారాన్ని అందించేందుకు సిద్దమయ్యాయి. ఇప్పటికే వివిధ దేశాల ఆకాశ మార్గాన్ని ఆయా దేశాలు నిలుపుదల చేశాయంటే భారత్‌లో పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయవచ్చు. అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధి నిపుణుడు ఆంటోని ఫౌచి ఇక్కడి పరిస్థితిని పరిశీలించిన తర్వాత దీన్ని అరికట్టేందుకు కొంతకాలంపాటు లాక్‌డౌన్‌ ‌విధించడమే సరైందని సలహా ఇచ్చాడు.

ఆయనతో పాటు పలువురు ఈ మారణహోమాన్ని అరికట్టాలంటే మళ్ళీ లాక్‌డౌన్‌ ‌విధించడం ఒక్కటే మార్గమంటున్నారు. సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా అదే విషయాన్ని చెప్పింది. దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్‌ ‌విధించే విషయాన్ని పరిశీలించాల్సిందిగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నత న్యాయస్థానం సూచించింది. వాస్తవంగా లాక్‌డౌన్‌వల్ల ఎక్కువగా నష్టపోయేది వ్యాపారస్తులే. అయినా తామందుకు సిద్దమేనంటున్నాయి ఆ వర్గాలు. ఆర్థిక వ్యవస్థ కంటే ప్రాణాలను నిలుపుకోవడమే ముఖ్యమంటున్నారు.
దేశంలోని అతిపెద్ద పారిశ్రామిక ఛాంబర్‌ (‌సిఐఐ) ఈ విషయమై ప్రధాని మోదీకి లేఖ రాసాయి కూడా. అలాగే చిన్నవ్యాపారుల, చిల్లరవ్యాపారుల సంస్థ (సిఏఐటి)కూడా లాక్‌డౌన్‌కు తమ మద్దతు తెలిపింది.  అయితే నిత్యావసర వస్తువుల విషయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని ఆ సంఘాలు ఆ లేఖలో ప్రధానికి సూచించాయి.

కాగా, దేశ వ్యాప్తంగా సరుకుల కొరత లేకుండా ప్రజలకు అందించేందుకు తమ వ్యాపార వర్గాలు సిద్దంగా ఉన్నట్లు కూడా వారు పేర్కొన్నారు. కాన్ఫరడేషన్‌ ఆఫ్‌ ఆలిండియా ట్రేడర్స్ (‌క్యాట్‌) ‌నిర్వహించిన ఒక సర్వేలో నూటికి 67.5 శాతంమంది లాక్‌డౌన్‌కు అనుకూలమని చెప్పినట్లు రిపోర్టులో పేర్కొంది. ఇదిలా ఉంటే నిత్యం పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే పలు రాష్ట్రాలు కొన్ని చోట్ల లాక్‌డౌన్‌ను, మరికొన్ని చోట్ల నైట్‌ ‌కర్ఫ్యూను విధించాయి. పంజాబ్‌, ‌హర్యానా, చండీఘడ్‌ ‌రాష్ట్రాల్లో ఇప్పటికే అమలులో ఉన్న ఆంక్షలను మరింతగా పెంచాయి. బీహార్‌, ఒరిస్సా రాష్ట్రాల్లో ఈ నెల 5వ తేదీనుండి దాదాపు పదిహేను రోజులపాటు లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు ప్రకటించాయి. మన పక్కనే ఉన్న ఆంధప్రదేశ్‌లో కూడా ఇటీవల కేసుల సంఖ్య బాగా పెరుగుతూ వొస్తున్నాయి. తాజాగా ఒక్క రోజున్నే 24వేల పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయంటే ఇక్కడ పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. ఇదిలా ఉంటే అసలే కొరోనా రెండవ వేవ్‌ ఒణికిస్తున్నదంటే, ఇక్కడ మరో కొత్త వైరస్‌ ‌వెలుగులోకి వొచ్చిందంటున్నారు.

వైరస్‌ ఎన్‌ 440 ‌పేర ప్రభలుతున్న ఈ వైరస్‌ ఇప్పుడున్న వైరస్‌లకు పదిరెట్లు అధిక ప్రభావం చూపుతుందంటున్నారు. దీన్ని మొదటిసారిగా కర్నూల్‌లో గుర్తించారు. దీంతో అప్పటివరకు కేవలం నైట్‌ ‌కర్ఫ్యు అమలులో ఉన్న ఏపిలో పగటి కర్ఫ్యూను ఈ నెల 5నుండి మొదలు పెడుతున్నారు. ఉదయం ఆరునుండి మధ్యాహ్నం 12 గంటలవరకు మాత్రమే దుకాణాలు తీసి ఉంటాయి. ఆ తర్వాత కర్ఫ్యు అమలులో ఉంటుంది. ఇలా రెండు వారాలపాటు కొనసాగించనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక తెలంగాణలో పరిస్థితి చెప్పడానికి వీలులేదు. రోజు నాలుగు నుండి అయిదు వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆక్సిజన్‌లేక, హాస్పిటల్స్ల్లో  చేర్చుకోకపోవడంతో చాలామంది  మధ్య లోనే ప్రాణాలు వొదులుతున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ‌పెట్టేదిలేదని ఇటీవల ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారు. కాని, సుప్రీంకోర్టు నిర్దేశించిన ప్రకారం ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని వెంటనే దేశ వ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధిస్తే తప్ప కోవిద్‌ను అరికట్టే పరిస్థితిలేదు. మరో రెండు రోజుల్లో అలాంటి ప్రకటన వొస్తుండవచ్చుననుకుంటున్నారు ప్రజలు.

Leave a Reply