- భాగ్యనగరానికి తాజాగా సరికొత్త గుర్తింపు
- ఇండియా స్కిల్స్ రిపోర్టు నివేదిక వెల్లడిి
భాగ్యనగరానికి తాజాగా సరికొత్త గుర్తింపు లభించింది. ఇండియా స్కిల్స్ రిపోర్టు నివేదిక ప్రకారం.. హైదరాబాద్ మహానగరం కొలువులకు అడ్డాగా మారిందన్న విషయాన్ని వెల్లడించింది. మినీ ఇండియాగా మారిన భాగ్యనగరంలో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు పెద్ద ఎత్తున ఉండటం గమనార్హం.
దేశంలో ఎక్కడెక్కడో చదువులు చదివిన యువతలో అత్యధికులు స్థిరపడేందుకు హైదరాబాద్ ను ఎంచుకున్నట్లుగా తాజాగా వెల్లడైంది. దేశంలోని ఉద్యోగార్థులు ఎక్కువగా ఇష్టపడే నగరంగా హైదరాబాద్ నిలిచినట్లుగా వీబాక్స్.. సీఐఐ.. టాగ్డ్ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్న నగరాల్లోనూ హైదరాబాద్ తొలిస్థానంలో నిలిచింది. హైదరాబాద్ తర్వాత బెంగళూరు.. ఫుణే.. ఢిల్లీ మహానగరాలు ఉద్యోగులకు అనువుగా ఉన్నట్లు తేలింది. భాగ్యనగర ఇమేజ్ అమాంతం పెరిగేలా ఉన్న ఈ నివేదికలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. దేశ వ్యాప్తంగా 65 వేల మంది విద్యార్థులతో పాటు.. పదిహేను పరిశ్రమలను.. నూటయాభై కార్పొరేట్ సంస్థల్ని సంప్రదించిన తర్వాత ఈ రిపోర్టును సిద్దం చేశారు. ఉద్యోగం చేసేందుకు ఎక్కువగా ఇష్టపడే నగరాల జాబితాను తాజాగా సిద్ధం చేశారు.
ప్రాధాన్యతల వరుస క్రమంలో టాప్ టెన్ నగరాల్ని తీసుకుంటే హైదరాబాద్ తొలిస్థానంలో ఉంటే.. చివరి స్థానంలో మంగళూరు నిలిచింది. మొత్తం పది నగరాలు.. పట్టణాల్లో ఆరు దక్షిణాది రాష్ట్రాలకు చెందినవి ఉన్నాయి. మొత్తం పదింటిలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రెండు ప్రాంతాలు ఉన్నాయి. ఇక.. దక్షిణాదిన చోటు దక్కించుకోని రాష్ట్రంగా కేరళను చెప్పాలి.