Take a fresh look at your lifestyle.

భూమి పాయే…రైతుబంధు రాకపాయే

  • పోయింది కొంత భూమి…మిగిలిన భూమీ బ్లాక్‌
  • ఆన్‌లైన్‌లో కనిపించని సర్వే నెంబర్లు
  • అధికారుల సమన్వయలోపంతో వందలాది మంది రైతులకు నష్టం
  • ఇదీ..కాల్వలకు భూములిచ్చిన అన్నదాతల గోస
  • మంత్రి హరీష్‌రావుపైనే అన్నదాతల  ఆశలు

ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టులలో భాగంగా కాల్వల నిర్మాణానికి భూములిచ్చిన నంగునూరు మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన పలువురు రైతులు రైతుబంధుకు దూరమయ్యారు. అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల కాలేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కాల్వల కోసం కొంత భూమిని కోల్పోయిన రైతులు మిగిలిన భూమికి వర్తించే రైతుబంధు పథకానికి వందలాది మంది రైతులు దూరమయ్యారు. దీనికి కారణం. కాల్వల కోసం పోయిన భూమి పోగా మిగిలిన భూమి ఆన్‌లైన్‌లో కనిపించకపోవడమే. కాల్వల నిర్మాణం కోసం భూమిని కోల్పోయామనీ, ఇప్పుడు పోగా మిగిలిని భూమి ఆన్‌లైన్‌లో లేకపోవడం వల్ల నంగునూరు మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు తీవ్ర ఇక్కట్లకు గురౌతున్నారు. కాల్వల నిర్మాణంలో పోగా మిగిలిన భూమి ఆన్‌లైన్‌లో నమోదైనట్లు లేకపోవడంతో తమకు మిగిలి ఉన్న భూమికి రైతు బంధు పథకం కింద డబ్బులు రావడం లేదనీ పలువురు రైతులు ‘ప్రజాతంత్ర’ప్రతినిధితో మాట్లాడుతూ… తన మనసులోని బాధను వ్యక్తం చేశారు. రైతుబంధు కింద డబ్బులు రాకపోవడంతో రైతులు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదిస్తున్నారు.

రైతు బంధు పథకం కింద వివరాలు నమోదు చేసేందుకు ఆన్‌లైన్‌లో రైతులకు సంబంధించిన వివరాలు లేనందున తామేమీ చేయలేమనీ సంబంధిత అధికారులు చేతులెత్తేస్తున్నారనీ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్లిన రైతులకు నిరాశ ఎదురవుతోంది. కాల్వల కింద భూమికి నష్ట పరిహారం పొందినప్పుడు నష్ట పరిహారానికి సమానమైన భూమిని ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్‌ ‌చేశారు. రిజిస్ట్రేషన్‌ ‌చేసిన భూమి విస్తీర్ణాన్ని తొలగించి, మిగిలిన విస్తీర్ణం ఆ రైతు ఖాతాలో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలి. ఇందుకు విరుద్ధంగా రైతు ఖాతాలోని మొత్తం భూమిని ఆన్‌లైన్‌లో లేకుండా ఆన్‌ ‌సైన్‌ ‌చేశారు. దీనివల్ల రైతు మిగత భూమి వివరాలు ఆన్‌లైన్‌లో క•నిపించడం లేదు. దీంతో రైతుబంధు పథకం కింద వారి వివరాలను నమోదు చేయడం సాధ్యం కావడం లేదు. కాల్వల కింద పోయిన భూమి పోగా, మిగిలిన భూమి వివరాలు ఆన్‌లైన్‌లో ఉండేటట్లు చర్యలు తీసుకోవల్సిన రెవెన్యూ అధికారులు కాల్వల కింద ఏ ఏ రైతు ఎంత భూమిని కోల్పోయిన వివరాలను నీటి పారుదల శాఖ అధికారుల నుంచి అందకపోవడంతో ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేయలేదని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. కాల్వల కింద భూమిని కోల్పోయిన రైతులకు చెక్కులను అందించిన వెంటనే ఏ ఏ రైతులు ఎంత భూమిని ఏయే సర్వేనెంబర్‌ ‌లలో ప్రభుత్వానికి ఇచ్చిన వివరాలను రెవెన్యూ అధికారులకు పంపామని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద అ శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల కాలేశ్వరం ప్రాజెక్టు లో భూములను కోల్పోయి త్యాగం చేసిన రైతులకు మిగిలిన భూమి ఆన్‌లైన్‌లో లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఆన్‌లైన్‌లో లేకపోవడం వల్లే తమకు రైతు బంధు పథకం కింద డబ్బులు జమ కావడం లేదని వారు వాపోతున్నారు. కాల్వల కింద భూమిని సేకరించేందుకు కృషి చేసిన ప్రజా ప్రతినిధులు ఆ తర్వాత పట్టించుకోవడంలేదని, ఫలితంగా తమకున్న భూమి కూడా ఆన్‌లైన్‌లో కనిపించకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నంగునూరు మండలంలోని ముండ్రాయి, వెంకటాపూర్‌ ‌నర్మెట, సిద్దన్నపేట, మగ్దూంపూర్‌, ‌తిమ్మాయిపల్లి, కోనాయిపల్లి తదితర గ్రామాలలో కాల్వల కింద భూమిని కోల్పోయిన సుమారు 500 మంది రైతులకు గత సంవత్సరం నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో నష్ట పరిహారం చెక్కులను అందించారు. చెక్కులను అందించిన వెంటనే కాల్వల కింద కోల్పోయిన భూమిని రైతుల ఖాతా నుంచి తొలగించి మిగిలిన భూమి వారి ఖాతాలో ఉండేవిధంగా రికార్డులను నవీకరించాలి.

అలా చేయకపోగా రైతుకు సంబంధించిన మొత్తం సర్వే నెంబర్లను బ్లాక్‌ ‌చేయడంతో ఆన్‌లైన్‌లో కనిపించడం లేదనీ నర్మెటకు చెందిన రైతు ఒకరు తెలిపారు. కాల్వల నిర్మాణానికి పోగా మిగిలిన భూమి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో గందరగోళం నెలకొంది. దీంతో వీరంతా వానకాలం-20202 సీజన్‌కు సంబంధించి రైతుబంధు పథకానికి నోచుకోకుండా పోయారు. గత నెల జూన్‌ 16‌వరకు నవీకరించబడిన రైతు ఖాతాలకు రైతు బంధు పథకం వర్తింపజేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కాల్వల కింద భూములు కోల్పోయిన రైతుల ఖాతాలు ఏడాది గడిచినా నవీకరించడం పోగా, మిగిలిన భూమి కూడా ఆన్‌లైన్‌లో కనిపించకుండా పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతు బంధు పథకం వర్తింప చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు పూర్తయినందున ఇప్పుడు నవీకరించినా రైతుబంధు పథకం కింద వివరాలు నమోదు చేసే అవకాశం లేదు. దీంతో వీరంతా రైతుబంధు పథకానికి దూరం అయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువల కింద భూములు కోల్పోయిన రైతుల భూముల ఖాతాలను నవీకరించి వారికి మిగిలిన భూమి అంతర్జాలంలో కనిపించేటట్లు చర్యలు తీసుకోవాలని, అలాగే రైతు బంధు పథకం కూడా వర్తించేలా స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావును కోరుతున్నారు. కాల్వల నిర్మాణానికి భూములు ఇవ్వాలని మంత్రి హరీష్‌రావు చెప్పడం…కాల్వలు వస్తే నీళ్లు వచ్చి తమ బతుకులు బాగుపడుతాయనీ తమకు ఉన్న భూమిలో కొంత భూమిని ఇచ్చామనీ, ఇప్పుడు తీరా…సర్వే నెంబరును బ్లాక్‌ ‌చేయడం వల్ల తాము రైతుబంధుకు నోచుకోవడం లేదనీ,ఈ విషయంలో మంత్రి హరీష్‌రావు తమ ఆవేదనను ఆలకించి తమకు న్యాయం చేయాలని పలువురు రైతులు కోరారు. రైతులందరూ మంత్రి హరీష్‌రావు తమకు న్యాయం చేస్తారనీ గంపెడు ఆశలు పెట్టుకున్నారు. చూడాలి మరి!

Leave a Reply