Take a fresh look at your lifestyle.

కింగ్‌ ఆఫ్‌ ‌స్పిన్‌ ఇక లేరు

‘‘52 ఏళ్ల క్రికెట్‌ ‌దిగ్గజం, బంతికే సకల నాట్య కలలు నేర్పిన స్పిన్‌ ‌మాంత్రికుడు, లెగ్‌ ‌స్పిన్‌ ‌బౌలింగ్‌కే నిఘంటువైన ఆస్ట్రేలియన్‌ ‌క్రికెటర్‌ ‌షేన్‌ ‌వార్న్ ‌థాయిలాండ్‌, ‘‌కో సముయ్‌’‌లోని విల్లాలో 04 మార్చి 2022న అనుమానస్పద గుండె పోటు(సస్పెక్టెడ్‌ ‌హార్ట్ అటాక్‌)‌తో మరణించారనే వార్తతో ప్రపంచ క్రికెట్‌ ‌మైదానాలన్ని మూగబోయి, క్రికెట్‌ ‌క్రీడాకారులు/అభిమానులు నివ్వెరపోయి నమ్మలేక పోతున్నారు.’’

ప్రపంచ ప్రఖ్యాత ఆస్ట్రేలియన్‌ ‌క్రికెటర్‌ ‌షేన్‌ ‌వార్న్ అకాల మరణానికి అక్షర నివాళి

52 ఏళ్ల క్రికెట్‌ ‌దిగ్గజం, బంతికే సకల నాట్య కలలు నేర్పిన స్పిన్‌ ‌మాంత్రికుడు, లెగ్‌ ‌స్పిన్‌ ‌బౌలింగ్‌కే నిఘంటువైన ఆస్ట్రేలియన్‌ ‌క్రికెటర్‌ ‌షేన్‌ ‌వార్న్ ‌థాయిలాండ్‌, ‘‌కో సముయ్‌’‌లోని విల్లాలో 04 మార్చి 2022న అనుమానస్పద గుండె పోటు(సస్పెక్టెడ్‌ ‌హార్ట్ అటాక్‌)‌తో మరణించారనే వార్తతో ప్రపంచ క్రికెట్‌ ‌మైదానాలన్ని మూగబోయి, క్రికెట్‌ ‌క్రీడాకారులు/అభిమానులు నివ్వెరపోయి నమ్మలేక పోతున్నారు. 74-ఏండ్ల ఆస్ట్రేలియన్‌ ‌మాజీ క్రికెటర్‌ ‌రాడ్‌ ‌మార్ష్ ‌మరణానికి శ్రద్దాంజలి ఘటించిన షేన్‌ ‌వార్న్ ‌మరి కొన్ని గంటల్లోనే కన్ను మూయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకుండా విచార మదనాలతో బాధను దిగమింగుకుంటూ నిచ్ఛేష్టులవుతున్నారు. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్‌గా షేన్‌ ‌వార్న్ 708 ‌వికెట్లు తీసి స్పిన్‌ ‌బౌలింగ్‌కే వన్నెతెచ్చిక పర్యాయపదంగా నిలిచారు. అత్యధికంగా 800 వికెట్లతో తొలి స్థానంలో శ్రీలంకన్‌ ‌క్రికెటర్‌ ‌ముత్తయ్య మురళీధరణ్‌ ఉన్నారని మనకు తెలుసు.

1994లో ‘విజ్డెన్‌ ‌క్రికెటర్‌ ఆఫ్‌ ‌ది ఇయర్‌’, 2000‌లో ‘శతాబ్దపు విజ్డెన్‌ ‌క్రికెటర్‌ (‌విజ్డన్‌ ‌క్రికెటర్స్ ఆఫ్‌ ‌ది సెంచరీ)’, 2013లో ‘ఐసిసి క్రికెట్‌ ‌హాల్‌ ఆఫ్‌ ‌ఫేమ్‌’‌గా పురస్కారం పొందిన ఐదుగురిలో ఒక్కడిగా, 1997, 2004ల్లో ‘ప్రపంచ విజ్డెన్‌ ‌లీడింగ్‌ ‌క్రికెటర్‌’‌గా పలు ప్రతిష్ఠాత్మక గుర్తింపులు పొందిన షేన్‌ ‌వార్న్ ‌కౌమార దశ వరకు ఫూట్‌బాల్‌ ‌క్రీడలో కూడా నైపుణ్యం సాధించారు. టెస్టులు(708), వన్‌ ‌డే(293) మ్యాచ్‌ల్లో కలిపి 1001 వికెట్లు తీసిన వార్న్ ‌ప్రతిభను ప్రపంచ క్రికెట్‌ ‌మదిలో పదిలంగా దాచుకుంటుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి పలికిన వార్న్ 2008 – 13‌ల మధ్య రాజస్థాన్‌ ‌రాయల్స్ ‌జట్టు కెప్టెన్‌గా తొలి సీజన్‌ ఐపియల్‌ (ఇం‌డియన్‌ ‌ప్రీమియర్‌ ‌లీగ్‌) ఆడి గెలిపించారు. 1990-91, 2006-07లలో విక్టోరియా జట్టులో, 2000-07 మధ్య హాప్‌షేర్‌ ‌జట్టులో, 2008-11 మధ్య రాజస్థాన్‌ ‌రాయల్స్ ‌జట్టులో, 2011-12, 2012-13లలో మెల్బార్న్ ‌స్టార్స్ ‌జట్టులో సభ్యుడిగా తన ప్రతిభను చాటారు. షేన్‌ ‌వార్న్ ‌క్రికెట్‌ ‌మైదానంలో బౌలర్‌గా తన రాకతో అప్పటి వరకు ఫాస్ట్ ‌బౌలర్లు పొందిన ఆధిపత్యానికి గండి పడుతూ స్పిన్‌ ‌బౌలర్లకు ప్రాధాన్యం పెరగడం ప్రారంభమైంది.

ఆస్ట్రేలియన్‌ ‌క్రికెటర్‌గా మైదానంలో: 13 సెప్టెంబర్‌ 1969‌న ఆస్ట్రేలియాలోని విక్టోరియా ‘అప్పర్‌ ‌ఫెన్‌‌ట్రీ గుల్లీ’లో బ్రిగిట్‌, ‌కేత్‌ ‌వార్న్ ‌దంపతులకు జన్మించిన ‘షేన్‌ ‌కీత్‌ ‌వార్న్’ ‌విద్యాభ్యాసం హామ్టన్‌ ‌హైస్కూల్‌, ‌మెంటన్‌ ‌గ్రామర్‌లో జరిగి 12వ తరగతి వరకు పూర్తి చేశారు. 1983 – 84లో యూనివర్సిటీ ఆఫ్‌ ‌మెల్బర్న్ ‌క్రికెట్‌ ‌క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ అండర్‌-16 ‘‌డవ్లింగ్‌ ‌షీల్డ్ ‌కాంపిటీషన్లో’ లెగ్‌-‌స్పిన్‌, ఆఫ్‌-‌స్పిన్‌ ‌బౌలర్‌గా, లోయర్‌ ఆర్డర్‌ ‌బ్యాట్స్‌మెన్‌గా రాణించారు. సెయింట్‌ ‌కిల్డా క్రికెట్‌ ‌క్లబ్‌, అ‌క్రింగ్టన్‌ ‌క్రికెట్‌ ‌క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించిన షేన్‌ ‌వార్న్ 1990‌లో ఆస్ట్రేలియన్‌ ‌క్రికెట్‌ ‌క్లబ్‌ ‌సహకారంతో అడలైడ్‌లో శిక్షణ పొందారు. 15 ఫిబ్రవరి 1991న ఫస్ట్ ‌క్లాస్‌ ‌క్రికెట్లో విక్టోరియా టీమ్‌ ‌సభ్యుడిగా అడుగిడిన షేన్‌ ‌వార్న్ ‌ప్రతిభను గుర్తించి ఆస్ట్రేలియా-బి జట్టుకు ఎంపికై జింబాబ్వేతో తొలి అంతర్జాతీయ క్రికెట్‌ ‌టూర్‌ ‌చేశారు. ఆస్ట్రేలియా-ఏ జట్టు సభ్యుడిగా వెస్టిండీస్‌ ‌పర్యటించారు. ఏడు ఫస్ట్ ‌క్లాస్‌ ‌మ్యాచ్‌ల అనంతరం 02 జనవరి 1992న సిడ్నీలో జరిగిన ఇండియా, ఆస్ట్రేలియా టెస్ట్ ‌మ్యాచ్‌లో స్పిన్నర్‌గా క్రికెట్‌ ‌జైత్రయాత్ర ప్రారంభించారు.

ఆరడుగుల అద్భుత క్రికెటర్‌గా షేన్‌ ‌వార్న్ 02 ‌జనవరి 1992 నుంచి 02 జనవరి 2007 వరకు 145 టెస్ట్ ‌మ్యాచ్‌ల్లో ఆడి 25.41 సగటు పరుగులచ్చి 708 వికెట్లు పడగొట్టడమే కాకుండా లోయర్‌ ‌మిడిల్‌ ఆర్డర్‌ ‌బ్యాట్స్‌మెన్‌గా 17.32 సగటు పరపగులతో మ్నెత్తం 3,154 పరుగులు చేశారు. టెస్ట్ ‌క్రికెట్లో 10 మ్యాచ్‌లలో 10కి పైగా వికెట్లు, 37 మ్యాచ్‌ల్లో 5కు పైగా వికెట్లు తీసుకొని తన సత్తా చాటుకున్నారు. తన క్రికెట్‌ ‌చరిత్రలో 194 వన్‌ ‌డే మ్యాచ్‌లు ఆడిన షేన్‌ ‌వార్న్ 293 ‌వికెట్లు (25.73 సగటు పరుగులిచ్చి) పడగొట్టి, బ్యాటింగ్‌లో 1,081 పరుగులు (13.05 సగటుతో) చేశారు. టెస్ట్ ‌మ్యాచ్‌ ‌బౌలర్‌గా 8/71 అత్యుత్తమ ప్రతిభగల బౌలింగ్‌, ‌వన్‌ ‌డే మ్యాచ్‌లో 5/33 బెస్ట్ ‌బౌలింగ్‌ ‌ఫిగర్స్ ‌చేశారు. టెస్టుల్లో 125, వన్‌ ‌డేల్లో 264 క్యాచ్‌లు పట్టారు. 1999-2000లో ఆస్ట్రేలియా జట్టుకు వైస్‌ ‌కెప్టెన్‌గా సేవలు అందిస్తూ 11 మ్యాచ్‌ల్లో 10 మ్యాచ్‌ల్లో గెలుపు 01 ఓటమిని అందించారు. టెస్టుల్లో 12 సార్లు అర్థశతకాలు, వన్‌ ‌డేల్లో ఒక సారి అర్థ శతకం చేసి బ్యాట్స్‌మెన్‌గా కూడా తన సత్తా నిరూపించుకున్నారు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన షేన్‌ ‌వార్న్ ‌క్రికెట్‌ ‌కామెంటేటర్‌గా స్కైలైట్‌ ‌స్పోర్టస్, ‌ఫాక్స్ ‌క్రికెట్‌, ‌నైన్‌ ‌నెట్‌వర్క్‌లలో పని చేశారు. 1993 ఆషెస్‌ ‌సీరీస్‌లో మైక్‌ ‌గాటింగ్‌కు అత్యద్భుతమైన ‘బాల్‌ ఆఫ్‌ ‌ది సెంచరీ’ బంతిని వేసి ఔట్‌ ‌చేసి తన ప్రత్యేకతను ప్రపంచ క్రికెట్‌కు పరిచయం చేశారు.

వార్న్‌ను చుట్టుముట్టిన వివాదాలు : ఫిబ్రవరి 2003లో నిషేదిత డయురెటిక్‌ ‌మాదకద్రవ్యాలు వాడారని రుజువు కావడంతో ఆస్ట్రేలియన్‌ ‌క్రికెట్‌ ‌బోర్డ్ ‌చేత ఒక ఏడాది క్రికెట్‌ ‌క్రీడ నుంచి నిషేధ శిక్షను అనుభవించారు. నిషేధ సమయంలో నైన్‌ ‌నెట్‌వర్క్ ‌టీవీ వ్యాఖ్యాతగా అభ్యంతరకర అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో వ్యాఖ్యాతగా కూడా రెన్యువల్‌ ‌పొందలేక పోయారు. 1995లో ‘సైమన్‌ ‌కాలహాన్‌’‌ను వివాహం చేసుకొని ముగ్గులు పిల్లలకు తండ్రి అయిన వార్న్ 2005‌లో భార్యకు విడాకులు ఇచ్చారు. 2000లో బ్రిటీష్‌ ‌నర్సుకు అభ్యంతరకర మెసేజ్‌ ‌పంపించారనే అపవాదుమోస్తూ వైస్‌ ‌కెప్టెన్‌ ‌బాధ్యతలను కోల్పోయారు. సిగరెట్‌ ‌తాగుతున్న వార్న్ ‌ఫోటోలను తీశారనే కోపంతో కొందరు యువకులతో వాగ్వాదంలో చిక్కుకున్నారు. భార్య నుండి విడాకుల తరువాత బ్రిటీష్‌ ‌నటి ఎలిజబెత్‌ ‌హార్లీతో సహజీవనం చేస్తూ పెళ్లి చేసుకోవడానికి సిద్దపడ్డారు. మెల్బోర్న్ ‌వ్యాపార మహిళకు అసభ్య మెసేజ్‌ ‌పంపించి విమర్షలు ఎదుర్కొన్న షేన్‌ ‌వార్న్ ‌తన ప్రియురాలు హార్లీతో వివాహ ఆలోచన నుంచి విరమించుకున్నారు. ప్రముఖ డిజె మోడెల్‌ ‘ఎమిలీ స్కాట్‌’‌తో కూడా డేటింగ్‌ ‌చేశారనే అపవాదును కూడా మోశారు. ‘కిమ్‌ ‌గ్రాత్‌‘ అనే సింగిల్‌ ‌మదర్‌ ‌మహిళతోనే కాకుండా కాత్రీన్‌ ‌లాంగ్‌, ‌సైమన్‌ ‌టూమ్‌, ఎమిలీ సియర్స్ ‌లాంటి పలువురు మహిళలతో పరిచయం పెంచుకున్నారని వార్తలు తరుచుగా గుప్పుమన్నాయి.

హెటరోక్రోమియా లోపంతో ఒక కన్ను ఆకుపచ్చగా, మరో కన్ను నీలం రంగును కలిగిన షేన్‌ ‌వార్న్ ‌రిటైర్‌మెంట్‌ ‌తరువాత ‘షేన్‌ ‌వార్న్ ‌ఫౌండేషన్‌’ అనే స్వచ్ఛంధ సంస్థను స్థాపించి అభాగ్య అనారోగ్య బాలలకు అవసర సేవలు అందించారు. తన స్వీయ చరిత్రను ‘నో స్పిన్‌’ ‌పేరుతో వ్రాసారు. ప్రపంచ క్రికెట్‌ ‌చరిత్రలో అద్వితీయ క్రీడాకారులైన సర్‌ ‌డొనాల్డ్ ‌బ్రాడ్‌మెన్‌, ‌సర్‌ ‌గ్యారీ సోబర్స్, ‌సర్‌ ‌జాక్‌ ‌హబ్స్, ‌సర్‌ ‌వివియన్‌ ‌రిచర్డస్‌ల సరసన ఐదవ వాడిగా నిలిచిన షేన్‌ ‌వార్న్ ‘‌విజ్డెన్‌ ‌క్రికెటర్స్ ఆఫ్‌ ‌ది సెంచరీ’గా అత్యుత్తమ ప్రతిభ ప్రదర్ళించారు. ‘కింగ్‌ ఆఫ్‌ ‌స్పిన్‌’‌గా కీర్తించబడిన షేన్‌ ‌వార్న్ ఆట తీరు అనన్య సామాన్యం, అద్వితీయం, అనుసరణీయం, సదా స్మరణీయం.

Leave a Reply