Take a fresh look at your lifestyle.

కేంద్రాన్ని వెనుకేసుకొచ్చిన కెసిఆర్‌

కేంద్రంపై తరుచూ విమర్శలు చేసే రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌శనివారం అసెంబ్లీ సమావేశంలో కేంద్రాన్ని వెనుకేసుకురావడం కొంత ఆశ్చర్యం, విస్మయాన్ని కలిగించింది. రాష్ట్రంలో కరోనా బాదితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీలో ఆయన దానిపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా గతంలో వైరస్‌లకు సంబంధించిన వివరాలన్నిటినికూడా ఆయన సభికులకు తద్వారా ప్రజలకు సోధాహరణంగా తెలియజెప్పే ప్రయత్నం చేశాడు. అలాగే రాష్ట్రం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదన్న విషయాలను కూడా ఆయన వివరించారు. ఈ సందర్భంలోనే కాంగ్రెస్‌ ‌సభ్యులకు కెసిఆర్‌కు మధ్య మాటలయుద్ధం కొనసాగింది. సభలో కాంగ్రెస్‌పక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క చేసిన విమర్శను తిప్పికొట్టే ప్రయత్నంలో కాస్త ఘాటుగానే కెసిఆర్‌ ‌స్పందించారు.

ప్రపంచ మహమ్మారిగా దూసుకువస్తున్న కరోనా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవడంలేదన్న భట్టి ఆరోపణను కెసిఆర్‌ ‌చాలా సీరియస్‌గానే తీసుకున్నాడు. ఆ సందర్భంగా ఆయన రాష్ట్రంతో పాటు కేంద్రాన్ని కూడా ఏమాత్రం తప్పుపట్టాల్సిన అవసరంలేదంటూ కేంద్రాన్ని ఈ సందర్భంగా వెనుకేసుకు రావడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. కేంద్రం తాను చేయగలిగినంత చేస్తున్నా అనవసర ఆరోపణలు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. ప్రతిపక్షంలో ఉన్నాంకదాఅని ఏది మాట్లాడినా నడిచిపోతుందనుకోవడం సరైందికాదంటూ కాస్త ఆవేశపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చేపట్టిన పనులపై ఏమైనా సలహాలు సూచనలివ్వగలిగితే ఇవ్వాలేగాని విమర్శలుకాదన్నారు.

ప్రధానంగా కర్ణాటకకు చెందిన వ్యక్తి విషయంలో వచ్చిన వార్తలపైన భట్టి విక్రమార్కకు, కెసిఆర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. కర్నాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి సౌదీ అరేబీయా నుండి హైదరాబాద్‌ ‌వచ్చాడు. తలాబ్‌గడ్డ అనే ప్రాంతంలో అయిదురోజులున్నాడు. ఈ సందర్భంగా రెండు ప్రముఖ అసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నాడు. ఆతర్వాత కర్నాటక రాష్ట్రానికి వెళ్ళి మృతిచెందాడు. అయితే చనిపోయిన వ్యక్తికి పాజిటివ్‌ ఉం‌దని ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. నాలుగునెలల కిందనే ఈ డేంజరస్‌ ‌వైరస్‌గురించి వినికిడి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం అప్పటినుండి సరైన చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు జరిగేవికాదంటూ కేంద్రాన్నికూడా దోషిగా భట్టివిక్రమార్క శాసనసభలో చెప్పే ప్రయత్నాన్ని కెసిఆర్‌ అడ్డుకోవడంతోపాటు తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు. కేవలం పారసిటమాల్‌ ‌వేసుకుంటే సరిపోతుందని కెసిఆర్‌ అన్న విషయాన్ని కూడా భట్టి ఎత్తిచూపడంతో కెసిఆర్‌కు చురుక్కుమంది. ప్రతిపక్షాలు •ఇష్టంవచ్చినట్లు మాట్లాడి అనవసరంగా ప్రజలను భయాందోళనకు గురిచేయవద్దంటూ కెసిఆర్‌ ‌భట్టిమాటలను తిప్పికొట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీచేయలేదని గుడ్డిగా ఆరోపణ చేసేవారి కర్మకు వారినే వదిలేస్తున్నామంటూ, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు ఈ వ్యాధి విస్తృతంగా ప్రబలుతుందని, ఇంతమంది చనిపోతున్నారని చెప్పి ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తారా, అది సమంజసమేనా అంటూ ఎదురుప్రశ్నవేశారు.

అందుకే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఎంతవరకు వైద్య సదుపాయాన్ని అందించగలిగితే అంతవరకు వైద్యాన్ని అందించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని, అదిచూడకుండా ప్రభుత్వాలు ఏమీ చేయలేదనడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామంటూ తీవ్రంగా స్పందించాడు. కేంద్రంకూడా ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుని పని చేస్తున్నది. 130 కోట్ల ప్రజలున్న దేశంలో ఒక్కసారే స్విచ్‌ ఆఫ్‌చేసినట్లు వైరస్‌ ‌కంట్రోల్‌కు ఎలా వస్తుందన్నారు. కోట్లాది మంది ఉన్న మనదేశంలో ఇప్పటివరకు కేవలం 65 మందికే ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. మన రాష్ట్రంలో ఇటలీనుండి వచ్చిన ఒకరితో పాటు, మరో ఇద్దరికి ఈ వ్యాధి సోకినట్లుగా అనుమానిస్తున్నారు. విదేశాలనుండి వచ్చిన వారితోనే ఈ వ్యాధి వ్యాపిస్తున్నదని, అందుకు శంషాబాద్‌ ‌విమనాశ్రయంలో రెండు వందలమంది వైద్యసిబ్బందిని ఏర్పాటుచేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

ఇలాంటి వైరస్‌ ‌రావడమన్నది ఇవ్వాళ కొత్తేమీకాదు. దాదాపుగా ప్రతీ వంద సంవత్సరాలకు, డెబ్బై అయిదు ఏళ్ళకు ఒకసారి వస్తూనే ఉందంటూ గతంలో వైరస్‌ ఎప్పుడెప్పుడు వచ్చిందన్న విషయాలను చెప్పుకొచ్చారు. 1890లో స్పానిష్‌ ‌ఫ్లూ వల్ల ప్రపంచవ్యాప్తంగా పదినుండి పన్నెండు కోట్ల మరణాలు జరిగినట్లు చరిత్ర చెబుతోంది. అప్పుడు మనదేశంలో కోటి నాలుగు లక్షలమంది చనిపోయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కాని నాటికి నేటికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఇప్పుడు మనకు అనేక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి ఉత్పాతాన్నైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్దంగా ఉన్న విషయాన్ని ఆయన చెప్పుకొస్తూ, ఇందుకు వందకోట్లు కేటాయిస్తామన్నాం కాని, అవసరాన్నిబట్టి అయిదు వందల కోట్లు అయినా కేటాయిస్తామని అసెంబ్లీ సాక్షిగా కెసిఆర్‌ ‌ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన హైలెవల్‌ ‌కమిటి మార్చ్ 31‌వరకు స్కూల్స్, ‌కాలేజీలను సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.

Leave a Reply