- కరెంట్ కోతలతో రైతుల కనీళ్ళు
- వర్ధన్నపేట ఐనవోలు సబ్‌స్టేషన్‌లో రేవంత్ రెడ్డి ఆకస్మిక సందర్శన
వర్ధన్నపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : తెలంగాణ రాష్ట్రంలో రైతులకు 24 గంటల పాటు కరెంట్ ఇచ్చే విషయంలో కెసిఆర్ ప్రభుత్వం మడిమ తిప్పిందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కనీసం 8 గంటల కరెంట్ కూడా రైతులకు అందించలేక పోతున్నారని, కరెంట్ ఎప్పుడు వొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని అయోమయ పరిస్థితులలో రైతులు ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హాత్ సే హాత్ జోడోయాత్రలో భాగంగా వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని అయినవోలు మండల కేంద్రంలో ఉన్న సబ్ స్టేషన్‌ను గురువారం రేవంత్‌రెడ్డి ఆకస్మికంగా సందర్శించి అధికారులతో మాట్లాడారు. ప్రతిరోజు రైతులకు ఇవ్వాల్సిన కరెంటును ఎన్ని గంటలకు ఇస్తున్నారని, మళ్ళీ ఎన్ని గంటలకు నిలిపివేస్తున్నారని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నానని సీఎం కేసీఆర్ చెప్పి రైతులను రాత్రిపూట పొలాల్లోకి వెళ్లకుండా చేసి ఇప్పుడు మళ్ళీ తిరిగి అదే కష్టాలను వారికి తీసుకువచ్చాడని ఆరోపించారు. రాష్ట్రంలో కనీసం 8 గంటల విద్యుత్ సైతం రైతులకు అందడం లేదని దీనిపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని రైతుల బాధలను పట్టించుకోవాలని కోరారు. అధికారులు కూడా రైతులకు సహకరించి ఉదయం పూటే కరెంటు సరఫరా చేసేలా చూడాలని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వొచ్చిన తర్వాత రైతులకు తిరిగి నాణ్యమైన విద్యుత్ కరెంటును సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోట్ల రూపాయల దోపిడీ…
కె•ళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కెసిఆర్ కుటుంబం కోట్ల రూపాయలు దోచుకున్నారని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర పాదయాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మన ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి అప్పుల తెలంగాణగా మర్చడాని అన్నారు. రైతులకు 24గంటలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకున్నారని ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
24 గంటలు కరెంట్ ఇస్తే రైతులు సబ్ స్టేషన్‌ల వద్ద కరెంట్ కోసం ధర్నాలు, ముట్టడులు ఎందుకు చేస్తున్నారని, అధికారులు ఆటోమేటిక్ స్టార్టర్‌లను తొలగించాలని రైతులపై ఎందుకు ఒత్తిడి చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో వొచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అధికారంలోకి వొచ్చిన వెంటనే రైతులకు ఒకే దఫా రెండు లక్షల రుణ మాఫీ చేస్తామన్నారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని ప్రజలు, రైతులు అధైర్యపడవద్దని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొచ్చాక అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు.
మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హనుమకొండ జిల్లా అయినవోలు మండల కేంద్రం నుండి రేవంత్ రెడ్డి పాదయాత్ర పెరుమండ్ల గూడెం మీదుగా పంతిని గ్రామానికి పాదయాత్ర చేరుకుంది. పెరుమాండ్లగూడెం క్రాస్ నుండి నేరుగా క్యాంపుకు చేరుకున్నారు. రేవంత్ రెడ్డి అభిమాని పంతిని గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని జెండా ఏర్పాటు చేశానని కాళ్ళ మీద పడ్డాడు.
భద్రతా సిబ్బంది అతన్ని లాక్కుని వెళ్లే పని చేసినప్పటికీ కాంగ్రెస్ కార్యకర్త రేవంత్ రెడ్డి అంటూ గట్టిగా అరుపులు వేసి ప్రాధేయపడటంతో రేవంత్ రెడ్డి జెండా ఎగరవేసేందుకు ఒప్పుకుని మళ్లీ పాదయాత్రను గ్రామ వైపుకు మళ్ళించారు. ప్రజలకు అభివాదం చేస్తూ రేవంత్ రెడ్డి పాదయాత్రను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు.