కొత్త పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపండి
తాత్కాలిక పద్ధ్దతిలో వైద్యులు, సిబ్బంది నియామకాలు
జిల్లా కలెక్టర్లతో మంత్రి ఈటల, సీఎస్ సోమేశ్‌కుమార్ సమీక్ష
స్థానిక జిల్లా మంత్రుల సలహాలు, సూచనలతో కొరోనా వైరస్ నియంత్రణ చర్యలు చేపట్టాలని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ జిల్లా కలెక్టర్లను కోరారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న రోగుల పరిస్థితిని తరచూ సమీక్షించాలనీ, వైద్యులతో ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ ఇప్పించడంతో పాటు సరైన వైద్య చికిత్సలు అందేలా చూడాలని ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి ఈటల, సీఎస్ సోమేశ్‌కుమార్ గురువారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ కొరోనా సోకిన వారికి చికిత్స కంటే మానసిక ధైర్యం కల్పించడంతోనే సగం వ్యాధిని తగ్గించవచ్చన్నారు. పరీక్షల కోసం వచ్చిన ప్రతీ ఒక్కరికీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో పాటు పాజిటివ్ వచ్చిన పక్షంలో తప్పనిసరిగా ప్రతీరోజూ తగిన వైద్య చికిత్సలు అందించేలా చూడాలన్నారు. సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ పాజిటివ్ పేషెంట్లకు కౌన్సెలింగ్‌తో పాటు మెడికల్ కిట్‌ను సైతం అందజేయాలని సూచించారు.
కొత్త టెస్టింగ్ సెంటర్ల ఏర్పాటు కోసం తగిన వివరాలతో ప్రతిపాదలను సమర్పించాలని ఆదేశించారు. కొరోనా చికిత్సలకు అవసరమైన వైద్యులు, వైద్య సిబ్బందిని తాత్కాలిక పద్దతిలో నియమించడానికి అవసరమైన ప్రతిపాదనలు ఇచ్చిన పక్షంలో వెంటనే తగిన అనుమతులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. కొరోనా చికిత్సలు చేయడానికి దరఖాస్తులు చేసిన ప్రైవేటు దవాఖానాలకు సంబందించిన అనుమతి ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని ఆదేశించారు. జిల్లా దవాఖానాలు, ఏరియా దవాఖానాలు ప్రభుత్వ మెడికల్ కళాశాలల అనుబంధ దవాఖానాలలో అన్ని బెడ్లకు ఆక్సీజన్ సదుపాయం కల్పించాలనీ ఇందుకు అవసరమైన అన్ని ప్రతిపాదనలు వెంటనే అందజేయాలన్నారు. కొరోనా చికిత్సకు సంబంధిత పెండింగ్ బిల్లులు తగిన ప్రొఫార్మాలో సమర్పించాలనీ, ఐసోలేషన్ కిట్లు అందజేసే మందుల వివరాలకు సంబంధించి సర్క్యులర్‌ను సైతం వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు. అన్ని జిల్లాలలో కొరోనా వైద్య చికిత్సలకు సంబంధించిన ప్రోటోకాల్‌పై నిబంధనలు రూపొందించాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, పిసిబి మెంబర్ నీతూ ప్రసాద్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రఘునందన్‌రావు, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రాస్ పాల్గొన్నారు.