మనిషిలోనూ చెట్టుంటుంది
దారిన పోతూ కాసేపు వాలటానికో,
పూల తేనే జుర్రటానికో,
గూడు కట్టుకుని కొన్నాళ్ళు ఉండటానికో
పిట్టలు వస్తాయి
కిలకిల రావాలతో సందడి సందడి
చెట్టు పులకిస్తుంది
బరువెక్కిన కొమ్మలు
అరమోడ్పు కన్నులతో నింగికేసి చూస్తాయి
కాలం
నింగీ కాదు… నేలా కాదు
అలానే ఉండిపోవడానికి
ఉదయం సాయంత్రం అవుతుంది
ముదిరి చీకటీ అవుతుంది
వాలిన పక్షులు ఎగిరి పోవచ్చు
కొన్ని ఉండిపోనూవచ్చు
ఏదీ శాశ్వతం కాదు
ఏదీ స్థిరమూ కాదు
ఉదయాన్నే అమ్మ
రాలిన ఆకులు ఊడ్చి
గోడవతలకు గిరాటేస్తుంది
వాకిట అద్దమై మెరుస్తుంది
లోలోపలి చెట్టు
కొత్త ఆకులను చిగుర్చుతుంది
– రెహానా