Take a fresh look at your lifestyle.

దేశంలో కొరోనా కేసుల పెరుగుదల ఆందోళనకరం

  • కొత్తగా 1,84,372 మందికి పాజిటివ్‌ ‌నిర్దారణ
  • వైరస్‌ ‌బారిన పడి 1,027 మంది మృతి
  • యూపి సిఎం యోగి, ఢిల్లీ మంత్రి కైలాష్‌లకు కొరోనా
  • సిబిఎస్‌ఇ 10‌వ తరగతి పరీక్షలు రద్దు..12వ తరగతి పరీక్షలు వాయిదా
  • సుప్రీమ్‌ ‌కోర్టు ఆవరణలోకి రావాలంటే కొరోనా టెస్టింగ్‌ ‌తప్పనిసరి
  • సెకండ్‌వేవ్‌లో లాక్‌డౌన్‌ ‌విధించేదిలేదన్న నిర్మలాసీతారామన్‌
  • ‌సెకండ్‌వేవ్‌లో ఆర్థిక కార్యకలాపాలకు విఘాతం: మూడీస్‌

‌‌దేశంలో కొరోనా విలయతాండవం చేస్తున్నది. క్రమంగా విస్తరిస్తూ దేశవ్యాప్తంగా కోరలు చాస్తున్నది. 24 గంటల్లో భారతదేశంలో కొత్తగా 1,84,372 మందికి కొరోనా నిర్దారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం తెలిపింది. ఆ అదే సమయంలో 82,339 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కొరోనా కేసుల సంఖ్య 1,38,73,825 కు చేరింది. 24 గంటల సమయంలో ఆరు నెలల్లోనే లత్యధికంగా 1,027 మంది కొరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,72,085 కు పెరిగింది. దేశంలో కొరోనా నుంచి ఇప్పటివరకు 1,23,36,036 మంది కోలుకున్నారు. ఇక యూపి సిఎం యోగి ఆదిత్యనాథ్‌, ‌ఢిల్లీ మంత్రి కైలాష్‌ ‌గెహ్లాట్‌ ‌కొరోనా బారిన పడ్డారు. మహారాష్ట్రలో కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు కేసులు ఆందోళనకరంగా ఉండడంతో సిబిఎస్‌ఇ ‌పరీక్షలను రద్దు చేశారు. పరీక్షల రద్దును ఢిల్లీ సిఎం అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌స్వాగతించారు. కేసులు పెరగడంతో సుప్రీమ్‌ ‌కోర్టు ఆవరణలోకి వొచ్చే అనుమానితులకు కొరోనా టెస్టులు తప్పనిసరి చేస్తూ సుప్రీమ్‌ ‌కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

కొరోనా కేసులు ఇలాగే పెరిగిపోతే భారత్‌లో లాక్‌ ‌డౌన్‌ ‌విధించే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగుతున్నది. ఆర్థిక కార్యకలాపాలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని మూడీస్‌ అం‌చనా వేసింది. అయితే పూర్తీ స్థాయిలో లాక్‌ ‌డౌన్‌ అయితే ఉండదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌స్పష్టత ఇచ్చారు. భారతదేశంలో పెరుగుతున్న కొరోనా కేసుల కట్టడి కోసం పెద్ద ఎత్తున లాక్‌ ‌డౌన్‌ ‌విధించమని, స్థానిక నియంత్రణ మాత్రమే చేపడతామని నిర్మలా సీతారామన్‌ అన్నారు. టెస్ట్, ‌ట్రాక్‌, ‌ట్రీట్‌, ‌టీకాలు, కొరోనా మార్గదర్శకాల అమలు లాంటి ఐదు స్తంభాల వ్యూహంతో కొరోనాను కట్టడి చేస్తామని సీతారామన్‌ ‌స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ ‌విధించకుండా, స్థానికంగా కొరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోవిడ్‌ ‌సెకండ్‌ ‌వేవ్‌ ‌లో లాక్‌ ‌డౌన్‌ ఉం‌డదని, ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కొరోనా బాధితులను ఇళ్లలో క్వారంటైన్‌ ‌చేస్తామని చెప్పారు.

ప్రపంచ బ్యాంకు గ్రూప్‌ ‌ప్రెసిడెంట్‌ ‌డేవిడ్‌ ‌మాల్‌ ‌పాస్‌తో జరిగిన వర్చవల్‌ ‌సమావేశంలో భారతదేశానికి రుణం పెంచడానికి ప్రపంచబ్యాంకు చేపట్టిన చర్యలను కూడా నిర్మలా సీతారామన్‌ ‌ప్రశంసించారు. ఇకపోతే దేశ రాజధాని ఢిల్లీలో మరో మంత్రి కొరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో తనకు కొవిడ్‌- 19 ‌పాజిటివ్‌ ఉన్నట్టు తేలిందని ఢిల్లీ రవాణా, న్యాయశాఖ మంత్రి కైలాష్‌ ‌గెహ్లోట్‌ ‌బుధవారం వెల్లడించారు. తనకు సమిపంగా మెలిగిన వారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. కాగా గత బుధవారమే మంత్రి కైలాశ్‌ ‌కొవిడ్‌-19 ‌టీకా తొలి డోసు వేయించుకున్నారు. ఇంతకు ముందు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ ‌సిసోడియా, పర్యావరణ మంత్రి గోపాల్‌ ‌రాయ్‌, ఆరోగ్యమంత్రి సత్యేందర్‌ ‌జైన్‌ ‌తదితరులు కొవిడ్‌ ‌బారిన పడిన విషయం తెలిసిందే.

యూపి సిఎం యోగి ఆదిత్యనాథ్‌కు కొరోనా
ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కొరోనా వైరస్‌ ‌సంక్రమించింది. కోవిడ్‌ ‌పరీక్షలో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఆయన తెలిపారు. వైరస్‌ ‌లక్షణాలు తనలో కనిపించడంతో పరీక్ష చేయించుకున్నానని, దాని రిపోర్ట్ ‌పాజిటివ్‌గా వొచ్చినట్లు ఆదిత్యనాథ్‌ ‌తన ట్విట్టర్‌లో తెలిపారు. వైద్య చికిత్స తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ ‌యాదవ్‌కు కూడా కొరోనా సంక్రమించినట్లు బుధవారం తన ట్విట్టర్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే. ఉత్తర్‌ ‌ప్రదేశ్‌లో కొరోనా వైరస్‌ ‌కేసులు పెరుగుతున్న క్రమంలో అధికారులు అలసత్వం వహిస్తే రాష్ట్ర రాజధాని లక్నోలో లాక్‌డౌన్‌ ‌తప్పదని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి బ్రజేష్‌ ‌పాధక్‌ ‌సంకేతాలు పంపారు.

లక్షణాలు ఉండి కోర్టు ఆవరణలోకి రావాలంటే టెస్టు చేయించుకోవాల్సిందే : సుప్రీమ్‌ ‌కోర్టు మార్గదర్శకాలు
దేశంలో కొరోనా సెకండ్‌ ‌వేవ్‌ ఆం‌దోళన రేపుతున్నది. ఇటీవల 40 మంది సుప్రీమ్‌ ‌కోర్టు సిబ్బంది వైరస్‌ ‌బారినపడ్డారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త కోసం సుప్రీమ్‌కోర్టు బుధవారం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. సుప్రీమ్‌ ‌కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించే వారిలో కొరోనా లక్షణాలుంటే కోవిడ్‌ ‌టెస్ట్ ‌తప్పనిసరి అని పేర్కొంది. రిజిస్ట్రీ సిబ్బంది, కోఆర్డినేట్‌ ఏజెన్సీల సిబ్బంది, న్యాయవాదులు, వారి సిబ్బందిలో కోవిడ్‌ -19 ‌వ్యాప్తికి నోటిఫై చేసిన లక్షణాలున్నట్లయితే రాపిడ్‌, ఆర్టీ-పీసీఆర్‌ ‌టెస్ట్ ‌చేయించుకోవాలని వెల్లడించింది. అలాగే కొరోనా లక్షణాలున్నవారు కోర్టుకు రావొద్దని, ఐసొలేషన్‌లో ఉండాలని సుప్రీమ్‌కోర్టు తెలిపింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచుగా చేతులను శానిటైజ్‌ ‌చేసుకోవడం వంటి కొరోనా నిబంధనలను సిబ్బంది పాటించేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని సూచించింది. లిప్ట్‌లో ముగ్గురు కన్నా ఎక్కువ మంది వెళ్లకూడదని, పైకి వెళ్లేటప్పుడు మాత్రమే లిప్ట్ ‌వినియోగించాలని, కిందకు మెట్ల ద్వారా రావాలని పేర్కొంది. ఈ మేరకు సుప్రీమ్‌ ‌కోర్టు బుధవారం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply