Take a fresh look at your lifestyle.

ప్రకృతి ఇచ్చింది అపార సంపద

“ప్రకృతి  కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో కరోనా మనకు ప్రత్యక్షంగా చూపించింది. మనల్ని మనం కాపాడుకోవడానికి వాతావరణాన్ని ఎంత నిర్మలంగా ఉంచాలో తెలియచేసింది. వన్యమృగాలు స్వేచ్ఛగా,హాయిగా జీవించే వాతావరణం ఎలా ఉండాలో తెలియజేసింది.అనవసర మానవ సంచారాన్ని కట్టడి చేసింది. మానవుడు ఎలా హద్దులో ఉండాలనే పద్దతులను నేర్పించింది. మానవుడు ప్రకృతిని జయించాలని చూస్తే,ప్రకృతి తిరగబడి తన అధీనంలోకి తీసుకుంటుందనే సత్యము మరియు ఇతర జీవులు ప్రకృతిలో ఎలా మమేకమవుతాయనే విషయాన్ని కరోనా విపత్తు మానవాళికి నేర్పిన గుణపాఠం.  వాహనాల నియంత్రణ వలన కాలుష్యం అంతరించినప్పుడు ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో మనకు ఎంతటి ఆరోగ్యాన్ని ఇస్తుందో చూపించింది.మనిషి ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలో నేర్పించింది.”

pulluri venugopal
 పుల్లూరు వేణు గోపాల్‌, 9701047002

ఒక జీవి లేక జీవ సముదాయం చుట్టూ గల పరిస్థితులు మరియు వ్యక్తి పై ప్రభావం చూపే సామా జిక, ఆర్ధిక, సాంస్కృతిక, సాంకేతిక పరిసరాల ప్రభావాన్ని పర్యావరణం అం టాము. ప్రపంచం ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యల నుండి పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను సన్నద్ధం చేయుటకు మరియు అవగాహన కల్పించుటకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్‌ 5‌వ తేదీన ఐక్యరాజ్యసమితికి సంబంధించిన యునైటెడ్‌ ‌నేషన్స్ ఎన్విరాన్మెంట్‌ ‌ప్రోగ్రామ్‌ ‌వారు నిర్వహిస్తున్నారు . పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మరియు ప్రోత్సహించడానికి ఇది ఒక ముఖ్యమైన వేదిక.ప్రపంచ వ్యాప్తంగా 1974వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం జూన్‌ 5‌వ తేదీన 150కి పైగా దేశాలు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాయి. ప్రతి సంవత్సరం యునైటెడ్‌ ‌నేషన్స్ ఎన్విరాన్మెంట్‌ ‌ప్రోగ్రాము వారు పర్యావరణానికి సంబంధించి ఒక థీమ్‌ ‌ను తీసుకొని దానికి సంబంధించి వారు తీసుకున్న నిర్ణయాలను ప్రపంచ వ్యాప్తంగా అమలు అగునట్లు చర్యలు తీసుకుంటారు. వారు 2020 సంవత్సరమునకు ‘’జీవ వైవిధ్యం ‘’ అను థీమ్‌ ‌ను తీసుకోవడం జరిగినది. భూమిపై ఉన్న జీవుల మధ్య ఉన్న భేదాన్ని’’ జీవవైవిధ్యం’’అంటారు.ఇది జాతి,జన్యు,ఆవరణ,వ్యవస్థల పరంగా ఉంటుంది. జీవ వైవిధ్యం అనునది మానవుడు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది.

నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ‌ను కట్టడి చేయుటకు కరోనాను తుదముట్టించే అంశాలు ప్రకృతిలో ఉన్నాయనే నినాదంతో మనం ముందుకు పోతున్నాము. ఎప్పటికయినా మనిషి ప్రకృతిలో అంతర్భాగమై అందరితో సమానంగా జీవించాలి. అంతే తప్ప ఏమనిషి ప్రకృతికి అతీతుడు కాడు. ఇది ప్రపంచానికి కరోనా చేస్తున్న ఉపదేశం. ముఖ్యమంత్రి కే.సీ. ఆర్‌ ‌గారు చెప్పినట్లు ‘’ఎవ్వరూ ఈభూమి మీద వెయ్యేళ్ళు బ్రతకడానికి రాలేదు’’. బ్రతికిన కొద్దిరోజులైనా ప్రకృతిలోకి మనం ఎలా వచ్చామో అలా వెళ్ళిపోవాలి. అంతే తప్ప ప్రకృతి విధ్వంసానికి పాల్పడరాదు. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో కరోనా మనకు ప్రత్యక్షంగా చూపించింది. మనల్ని మనం కాపాడుకోవడానికి వాతావరణాన్ని ఎంత నిర్మలంగా ఉంచాలో తెలియచేసింది. వన్యమృగాలు స్వేచ్ఛగా,హాయిగా జీవించే వాతావరణం ఎలా ఉండాలో తెలియజేసింది. అనవసర మానవ సంచారాన్ని కట్టడి చేసింది. మానవుడు ఎలా హద్దులో ఉండాలనే పద్దతులను నేర్పించింది. వాహనాల నియంత్రణ వలన కాలుష్యం అంతరించినప్పుడు ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో మనకు ఎంతటి ఆరోగ్యాన్ని ఇస్తుందో చూపించింది.మనిషి ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలో నేర్పించింది. మానవుడు ప్రకృతిని జయించాలని చూస్తే,ప్రకృతి తిరగబడి తన అధీనంలోకి తీసుకుంటుందనే సత్యము మరియు ఇతర జీవులు ప్రకృతిలో ఎలా మమేకమవుతాయనే విషయాన్ని కరోనా విపత్తు మానవాళికి నేర్పిన గుణపాఠం.

మన ప్రాచీన సంస్కృతులన్నీ ప్రకృతిని ఆరాధించాలని చెప్తున్నాయి. చెట్లు,నదులు,పర్వతాలు,ప్రకృతిని మనం ఎల్లప్పుడు ఆరాధిస్తున్నాము. పూజిస్తున్నాము. నదులను తల్లులుగా,భూమిని దేవతగా కొలిచే దేశం మనది.వాటిని కాపాడుకోవలసిన భాద్యత ప్రతిఒక్కరిపై కలదు. మనిషి కొంచెం శ్రద్ద,సంయమనం,జాగ్రత్తలు పాటించి ,దురాశను వదులుకోగలిగితే కాలుష్యం ఈస్థాయిలో విజృభించేది కాదు.ప్రకృతి మనిషికి ఎన్నో ఇచ్చింది. కానీ మానవులు తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు సంపాదించాలనే దురాశతో పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారు. సాంకేతిక అభివృద్ధి జరిగినప్పుడు పర్యావరణానికి హాని చెయ్యాలనే నిబంధన ఏమి లేదు. సాంకేతికతను వాడుకుంటూ పర్యావరణ సమతుల్యం దెబ్బతినకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మానవుడు ప్రకృతివిషయంలో చేసే తప్పులతో పర్యావరణం పూర్తిగా నాశనమగుచున్నది. నిజానికి పర్యావరణం మన ప్రాణాలతో సమానం. మనం మన యొక్క సుఖాలకోసం,తాత్కాలిక ఆనందాలకోసం, విలాసాలకోసం ప్రకృతిని దెబ్బతీస్తూ విధ్వంసాన్ని సృష్టిస్తున్నాం.పర్యావరణానికి మనం చేసే హాని వల్ల మనం ఎదుర్కొంటున్న ముప్పులను అనుభవిస్తూ కూడా మానవులలో మార్పు రావడంలేదు. తాత్కాలిక అవసరాలకొరకు, ప్రస్తుత మానవుల భవిష్యత్తును ముందు తరాల భవిష్యత్తును,ప్రాణాలను ఫణంగా పెడ్తున్నాము. మనం చేసే ప్రకృతి విధ్వంసం వలన సునామీలు,కరువులు,వరదలు,తుఫానులు వంటి ఎన్నో విపత్తులు,సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ మానవునిలో మార్పు రావడం లేదు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాలన్నీ ఈ లక్ష్యాలు సాధించుటకు కృషి చేయవలసిఉన్నది. వాయుకాలుష్యం , నీటికాలుష్యం,జలకాలుష్యం,ధ్వనికాలుష్యం,నేల కాలుష్యం ,ప్లాస్టిక్‌ ‌నిషేధం,గ్లోబల్‌ ‌వార్మింగ్‌,‌వన్య ప్రాణుల రక్షణ,అటవీసంపదను కాపాడుకోవడం మొదలగు అంశాలపై పర్యావరణాన్ని రక్షించే విధంగా,పర్యావరణ సమతుల్యత దెబ్బతినని విధంగా దేశాలన్నీ కఠిన నిర్ణయాలు తీసుకొని అమలు చేయగలగాలి.

వాతావరణ సంక్షోభంపై పోరాడడానికి మరియు ఆహార భద్రత, నీటి సరఫరా మెరుగు పరచడానికి మరియు మానవ తప్పిదాలవలన నాశనం కాబడిన పర్యావరణ వ్యవస్థలను పునరుద్దరించేలా ప్రపంచంలోని దేశాలన్నీ చర్యలు తీసుకునేలా చూడడం ఈ సంవత్సరం జీవ వైవిధ్యం నినాదం యొక్క ముఖ్య లక్షణంగా చెప్పవచ్చు. వాతావరణ మార్పులవల్ల భూమి మీద లక్షకు పైగా జీవ జాతులు అంతరించిపోయే అవకాశం కలదు . 90% పర్యావరణ కాలుష్యం మానవుల తప్పిదాలతోనే జరుగుతున్నదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మన దేశంలో పర్యావరణ పరిరక్షణ కొరకు అనేక చర్యలు చేపట్టడం జరుగుతున్నది . పౌరులలో మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడం, నదులను శుద్ధి చేయడం, స్వచ్ఛ భారత్‌, ‌పంటలలో సేంద్రీయ ఎరువులను వాడకాన్ని ప్రోత్స హించడంలాంటి కార్యక్రమాలను విరివిగా చేపడుతూ పర్యావరణ పరిరక్షణ కొరకు కృషి చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా తెలంగాణాలో గౌరవ ముఖ్యమంత్రి కే.సి.ఆర్‌ ‌పర్యావరణ పరిరక్షణ కొరకు ఎనలేని కార్య క్రమాలు చేపట్టడం జరుగుతున్నది.వీటిలో ముఖ్యంగా మిషన్‌ ‌భగీరథ ,మిషన్‌ ‌కాకతీయ ,హరిత హారం ,పల్లె ప్రగతి ,పట్టణ ప్రగతి ,సామాజిక అడవుల పెంపకం ,సోలార్‌ ‌విద్యుత్తు ,ఎలక్ట్రికల్‌ ‌వాహనాలు ,నియంత్రిత పంటల విధానం , పశువులు మరియు చేపల పంపిణి కార్యక్రమం లాంటి కార్యక్రమాలతో తెలంగాణ ప్రజల జీవన విధానం మెరుగు పడుటకు మరియు పర్యావరణ పరిరక్షణ కొరకు ఎనలేని కృషి చేస్తున్నారు హరిత హారంలో భాగంగా మొక్కల పెంపకంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్ర భాగాన నిలిచినది.

చెట్ల విస్తీర్ణం మొత్తాన్ని 24% నుండి 34% కి పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్విరామ కృషి చేస్తున్నదని చెప్పవచ్చు . హైదరాబాద్‌ ‌ప్రాంతాన్ని 2022 సంవత్సరం లోపు ప్లాస్టిక్‌ ‌రహిత నగరంగా తీర్చిదిద్దుటకు ప్రయత్నాలు జరుగుతున్నాయి . పర్యావరణానికి అత్యంత ప్రమాదకరంగా యున్నవి శిలాజ ఇంధనాలేనని చెప్పవచ్చు . అందువల్ల ‘‘హరిత సాంకేతికత ‘‘ ను అభివృద్ధి చేసే ప్రయత్నాలను తెలంగాణ ప్రభుత్వం ముమ్మరం చేసినది . శిలాజా ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా సౌర విధ్యుత్‌ ,‌పవన విధ్యుత్‌ , ‌తరంగ విధ్యుత్‌ ‌లాంటి ప్రత్యామ్నాయ వనరుల్ని పెంపొందించేందుకు కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నది . ముఖ్యంగా వాడి పడేసిన అన్నిరకాల వస్తువులను మరియు చెత్తను రీసైక్లింగ్‌ ‌చేయడం , జీవ శైథిల్యానికి గురికాని ఉత్పత్తుల స్థానంలో జీవ శైథిల్యానికి లోనయ్యే ఉత్పత్తులను ప్రవేశపెట్టడం లాంటి చర్యలను ప్రభుత్వం తీసుకొనుచున్నది. అభివృద్ధి పేరిట ,విలాసాల పేరిట మనం మన అవసరాలన్నిటిని పెంచుకుంటూ పోతున్నాం . అయితే నానాటికి పెరుగుతున్న మన అవసరాలను , కోరికలను తీర్చే శక్తి సామర్ధ్యాలు భూమాతకు లేవు . ‘‘మనందరి అవసరాలు తీర్చే శక్తి భూమాతకు ఉంది . అయితే కోరికలన్నిటిని మాత్రం అది తీర్చలేదు ‘‘. అన్న గాంధీజీ పలుకులను మనం ఈ సమయంలో గుర్తుచేసుకొని ఆచరించక తప్పదు . ప్రకృతిని ప్రేమిస్తూ , పర్యావరణాన్ని కాపాడుతూ ముందుతరాలకు ఆదర్శంగా నిలుద్దాం. ప్రకృతితో మనం మమేకమై,సంరక్షిస్తే మనతో పాటు భావి తరాలకు ప్రమోదం.మనకు ఎందుకులే అని అందరు అనుకుంటే చివరకు మిగిలేది మన ఖేదం మాత్రమే. కాబట్టి పర్యావరణ పరిరక్షణ మనందరి భాద్యత.

Leave a Reply