- అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి.. దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా తెలంగాణ
- నేడు ఉదయం పది గంటలకు అసెంబ్లీలో నిరుద్యోగులకు శుభవార్త ప్రకటిస్తా.. తప్పకుండా టివి చూడండి
- వనపర్తి బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు
వనపర్తి, మార్చి 08(ప్రజాతంత్ర విలేఖరి) : కెసిఆర్ ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ పాలసీని తీసుకువచ్చేదే లేదని సీఎం కెసిఆర్ చంద్రశేఖర్‌రావు అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా సమీకృత కలెక్టరేట్, టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం, మార్కెట్‌యార్డు, మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాలలకు శంకుస్థాపన ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సాధించుకోవడం తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే మన కర్తవ్యమని అన్నారు. దేశాన్ని నాశనం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సాధించుకున్న రాష్ట్రంలో అభివృద్ది దిశగా సాగుతున్నామని అందులో బాగంగానే తెలంగాణ వొస్తే కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా పూర్తి చేసుకున్నామని, అదే స్థాయిలో సశ్యశ్యామలం చేసుకున్నామని, అదే స్థాయిలో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసుకుని పాలమూరు జిల్లా పాలుగారే జిల్లాగా పచ్చబడాలని ఆయన పిలుపునిచ్చారు. అద్భుతమైన పంటలు పండించుకోవడంతో సాగునీరు, వలసలు, ఆత్మహత్యలు తగ్గాయని, కర్నెతండా లిఫ్టు ఎత్తిపోతలతో పంటలు సాగు చేసుకుని ఆత్మహత్యలు లేకుండా వలసలు తగ్గించుకోవాలని అన్నారు.
11 రాష్ట్రాలు మన రాష్ట్రానికి వలసలు వొస్తాయని, అవినీతిరహితంగా పని చేయడంతోనే సాధ్యపడిందని చెప్పారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం జరిగిందన్నారు. వొచ్చే ఎన్నికల్లో ఇదే స్ఫూర్తితో అద్భుతంగా అభివృద్ధిని సాధించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గిరిజన, వాల్మీకులకు 12769 గ్రామాల్లో ప్రతి గ్రామంలో నర్సరీలు, అద్భుతమైన పల్లెలు, 16లక్షల ఎకరాల్లో సాగునీరు అందిస్తున్నామని, బంగారు తునకగా అభివృద్దిలో దేశంలోనే ముందున్నామన్నారు.
24 గంటల విద్యుత్, సాగునీరు, తాగునీరులో ముందున్న రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమేనని, అదే స్ఫూర్తితో దేశం కూడా బంగారు భారతదేశం కావాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉద్యమానికి ఏ స్థాయిలో నడుము బిగించారో, బంగారు భారతదేశం కోసం కలిసి నడుద్దామని పిలుపునిచ్చారు. దేశంలోనే దళిత బంధు పథకం విషయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, దళిత బిడ్డలు అభివృద్ది చెందాలని అన్నారు.
కేంద్రంలోని నరేంద్రమోడి మతతత్వ రాజకీయాలకు తెర లేపారని, తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కులమత రాజకీయాలను నిలదీస్తామని, బంగారు భారతదేశం కోసం చివరిదాకా పోరాడుతామన్నారు. తెలంగాణ మేధావులు మేల్కోవాలని, నేడు ఉదయం అసెంబ్లీలో నిరుద్యోగుల కోసం తాను మంచి శుభవార్త అందిస్తానని, నిరుద్యోగులందరూ తప్పకుండా టివి చూడాలని కోరారు. గిరిజన వాల్మీకుల రిజర్వేషన్లను కేంద్రం అడ్డు పెట్టుకుని అణిచివేస్తుందని, నరేంద్రమోడి ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ది చెప్పాలని, కూకటి వేళ్లతో ప్రభుత్వాన్ని తీసివేయాలన్నారు. కషాయ పార్టీలను బంగాళకాతంలో కలపాలని అన్నారు. వనపర్తి అభివృద్ధిని చూసి ఆనందపడుతున్నామని, వనపర్తికి బైపాస్ కోసం 200 కోట్ల నిధులైనా విడుదల చేసి పూర్తి చేస్తామని, అదే స్థాయిలో తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు. దేశ రాజకీయాల కోసం మడమ తిప్పని బంగారు భారత దేశం కోసం ముందుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బహిరంగసభలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మెన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.