దేశంలో ప్రస్తుతం ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలకు సరైన మౌలిక సదుపాయాలను కల్పించలేకపోతున్న నరేంద్రమోడీ ప్రభుత్వం హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్ వంటి నగరాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేయాలని ఆలోచిస్తోందంటూ ఎంఐఎం నాయకుడు అసుదుద్దీన్ ఒవైసీ చేసిన ప్రకటన కేవలం ఊహాగానమే. కేంద్ర పాలిత ప్రాంతం కాగలిగిన అర్హతలు హైదరాబాద్ కి ఉన్నాయి. ఆంధప్రదేశ్ విభజన సమయంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. హైదరాబాద్ లేకుండా తెలంగాణను ఊహించలేమంటూ ఉద్యమనాయకులు స్పష్టం చేశారు. తెలంగాణ ఆదాయం అంతా హైదరాబాద్ మీదనే ఆధారపడి ఉంది. తెలంగాణకు కీర్తి ప్రతిష్టలు తెస్తున్నది కూడా హైదరాబాదే. ఇప్పుడిప్పుడే వరంగల్, కరీం నగర్ జిల్లాల్లో ఐటి పార్కులు,ఇతర ఆధునిక పరిశ్రమల స్థాపనపై తెరాస ప్రభుత్వ దృష్టి పెట్టింది. నారా చంద్రబాబునాయుడు హైదరాబాద్ ని తానే అభివృద్ధి చేసినట్టు సమయం వొచ్చినప్పుడల్లా చెప్పుకుంటూ ఉంటారు.అది అర్థ సత్యం.ఆయన హయాంలో హైటెక్ సిటీ అభివృద్ధి చెందిన మాట నిజమే కానీ, ఐటి విప్లవంగా విస్తరించే సమయానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల హైదరాబాద్ కి ఉన్న వనరులను ఆయన ఉపయోగించుకున్నారు తప్ప,ఆయన వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే ఎవరూ నమ్మరు. ఒక రాష్ట్రానికి కావల్సిన భౌగోళిక వనరులు అన్నీ ఉన్నప్పుడే అది రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుంది.
కాశ్మీర్ ను రెండు ముక్కలుగా చేయడం రాజకీయంగా బీజేపీకి అవసరం కనుక చేసింది. లడఖ్ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలన్న డిమాండ్ ఆ ప్రాంత ప్రజల నుంచి చాలా కాలంగా వస్తోంది.ఆ ప్రాంత ఎంపీ బీజేపీ సభ్యుడే.ఆయన గట్టిగా ఒత్తిడి చేయడం వల్ల లడఖ్ ని ప్రత్యేకంగా కేంద్ర పాలిత ప్రాంతంగా రూపొందించారు. లడఖ్ కి మౌలిక సదుపాయాలను కల్పించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైంది. ఈ విషయమై ఎవరైనా గొంతెత్తితే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. కాశ్మీర్ విభజన సమయం నుంచి ఇటీవల వరకూ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా,ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా, పీడీపీ నాయకురాలు మెహబూబ్ ముఫ్తీలను గృహ నిర్బంధం వరకూ ఉంచారు. మళ్ళీఒమర్ కుటుంబాన్ని గృహ నిర్బంధంలో ఉంచారు. కాశ్మీర్ కు రాష్ట్ర ప్రతిపత్తిని కల్పిస్తామని రాష్ట్ర విభజన సమయంలో హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. దానిపై చర్చ సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర పాలిత ప్రాంతాల అంశాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్ పాత బస్తీలో ఎంఐఎంకి మెజారిటీ ఉంది. ఆ పార్టీ మద్దతు తోనే ఆ ప్రాంతంలో కాంగ్రెస్ రాజకీయం నడిపింది.
ఇప్పుడు ప్రాంతీయ పార్టీ అయిన తెరాస కూడా అదే బాటన నడుస్తోంది.ఈ రెండు పార్టీల మధ్య పొత్తు రహస్య పొత్తుగా సాగుతోంది. కార్పొరేషన్ ఎన్నికల్లో విడిగా పోటీ చేసినప్పటికీ, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తెరాసకు మజ్లిస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఈ రెండింటి మధ్య పొత్తును తెగగొట్టాలంటే హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్న ఆలోచన కమలనాథులకు వొచ్చిందన్నది ఒవైసీ ఆరోపణ. కానీ, కమలనాథుల వాదన వేరేగా ఉంది. తెరాస,ఎంఐఎంలు కలిసే ఈ ప్రతిపాదనను తెరమీదికి తెచ్చినట్టు కమలనాథులు ఆరోపించారు. పార్లమెంటులో ఒవైసీ ఈ ఆరోపణ చేసి సభ నుంచి వెళ్ళిపోయారు. దానికి సమాధానమిద్దామనుకునే సరికి ఆయన సభ నుంచి వెళ్ళిపోయారని హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అయితే, ఒవైసీ ఒక రాయి వేద్దామన్న ఉద్దేశ్యంతోనే ఈ ఆరోపణ చేసి ఉంటారు. కాశ్మీర్ లో ఎన్నికలు జరిపించాలంటే అక్కడ అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంలో సమస్యలొస్తాయనీ, వెంటనే రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కాశ్మీర్ లో బీజేపీకి సరైన నాయకత్వం లేదు.అందుకే, ఎన్నికలు జరిపించేందుకు వెనకాడుతోంది.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులామ్ నబీ ఆజాద్ రాజ్యసభ సభ్యత్వం కాలపరిమితి ముగిసిన సందర్భంలో ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ ప్రధాని మోడీ కంటతడి పెట్టడం వెనుక భావోద్వేగమైన బంధాన్ని కలుపుకునేందుకేనని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఆజాద్ కు తమ పార్టీ అండదండలు ఉంటాయంటూ మోడీ చేసిన ప్రకటన అంతరార్ధం ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానించడమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.ఆయన కనుక బీజేపీలో చేరితే ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో పాగా వేయవచ్చని మోడీ ఆకాంక్ష అయి ఉంటుంది. అయితే, ఆజాద్ కాంగ్రెస్ తో దశాబ్దాల బంధాన్ని అంత తేలికగా ఒదులుకోగలరా అన్నది ప్రశ్న. ఆయన కు కాంగ్రెస్ పార్టీ మంచి గుర్తింపు నిచ్చింది.దానికి తగ్గట్టుగానే పార్టీకి ఆయన విధేయునిగా ఉంటూ ఎన్నో పదవులను పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ నిర్వహించారు.
ఆజాద్ ని మోడీ పొగడటం గాలం వేయడం వంటిదే. కానీ, ఆజాద్ ప్రస్తుతం కాంగ్రెస్ పరిణామాలతో అసంతృప్తిగా ఉన్న మాట నిజమే అయినా, సోనియాగాంధీ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగినంత కాలం ఆయన బయటపడరు.ఈ విషయం బహిరంగ రహస్యం. రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల అసంతృప్తి కలిగిన పాత తరం నాయకుల్లో ఆయన ఒకరు. అంతమాత్రాన ఆయన బీజేపీలో చేరతారనుకోవడం ఆయన ఇమేజ్ రీత్యా సాధ్యపడే విషయం కాదు.
కాశ్మీర్ విషయం ప్రస్తావనకు వొచ్చినప్పుడు హైదరాబాద్ గురించి ఒవైసీ ఎందుకు ప్రస్తావించారో కమలనాథులు ఆలోచించాల్సిందే. సర్దార్ పటేల్ సమాఖ్య వ్యవస్థకు కృషి చేసినప్పుడు భారత్ లో చేరడానికి కాశ్మీర్ పేచీ పెట్టినట్టే, హైదరాబాద్ నిజాం నవాబు కూడా పేచీ పెట్టినట్టు చరిత్ర చదువుకున్నాం.ఈ రెండింటికీ సంబంధం ఉందా అని మేధావులు తర్కించుకుంటున్నారు. మొత్తానికి హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కావడం అనేది ఊహాగానమే అని గట్టిగా చెప్పవొచ్చు.