- 40వేలు దాటిన కొరోనా మృతుల సంఖ్య
- 19,61,357 చేరిన మొత్తం కేసులు
దేశంలో కొరోనాతో మృతిచెందినవారి సంఖ్య 40 వేలను దాటింది. గడచిన 24 గంటల్లో అంటే ఒక్క రోజులో అత్యధికంగా 918 మరణాలు నమోదయ్యాయి. ఒక్క రోజులో మరణాల సంఖ్య 900 లను దాటడం ఇదే మొదటిసారి. కొత్తగా 56,695 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల పాటు కేసులు తగ్గినట్టు కనిపించినా, తిరిగి విజృంభించాయి. దేశంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 19,61,357.
దేశంలో మరణాల రేటు ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా అత్యల్పంగా ఉన్నప్పటికీ, ఇటీవలి కాలంలో ఈ సంఖ్య వేగంగా పెరిగింది. గడచిన నెలలో దేశంలో 20 వేలకు పైగా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. వీటిలో 10 వేల మరణాలు గత 13 రోజులలో సంభవించాయి. గడచిన 6 రోజుల్లో 5 వేల మంది మృతి చెందారు. ఇంతకుముందు ఒక్క రోజులో గరిష్ట మరణాలు 848. ఇది ఆగస్టు ఒకటిన నమోదైంది. బుధవారం 7 రాష్ట్రాల్లో అత్యధిక మరణాలు సంభవించాయి. 334 మరణాలతో మహారాష్ట్ర ఆధిక్యంలో ఉంది. తమిళనాడులో 112, ఆంధప్రదేశ్‌లో 77, బెంగాల్లో 61, పంజాబ్‌లో 29, బీహార్‌లో 44, పుదుచ్చేరిలో 7 మరణాలు సంభవించాయి. మరోవైపు, ఢిల్లీలో బుధవారం 11 మరణాలు మాత్రమే చోటుచేసుకున్నాయి. మహారాష్ట్ర, ఆంధప్రదేశ్లలో కొత్తగా 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఈ సంఖ్య 10,309, ఆంధప్రదేశ్‌లో ఈ సంఖ్య 10,128గా ఉంది.