విజయవాడ, సెప్టెంబర్ 29 : ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జారీమునేరు, వైరా, కటలేరు నుంచి 30 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజీ ఇన్ ఫ్లో 6లక్షల 20వేల క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లోలో 6 లక్షల 12వేల క్యూసెక్కులుగా ఉంది. కాగా, కృష్ణా కాలువలకు సాగునీటి అవసరాల కోసం 8వేల క్యూసెక్కుల వరద నీటిని వదిలారు. విజయవాడలోని తారకరామ నగర్, భూపేష్ గుప్త నగర్, బాలాజీనగర్, రామలింగేశ్వర నగర్ ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. ఈ ప్రాంతాల ప్రజలు పునరావాస శిబిరాల్లోనే తలదాచుకున్నారు. మరోవైపు భారీ వరదల కారణంగా కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాలు నీట మునిగాయి.
మరోవైపు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం అధికంగా ఉంది. దీంతో అధికారులు జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల చేశారు. జలాశయం ఇన్ ఫ్లో 2,05,017 క్యూసెక్కులు, ఔట్ ప్లో 3,06,819 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 883.90 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలకు గాను… ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 209.5948 టీఎంసీలుగా నమోదు అయ్యింది. మరోవైపు కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నెల్లూరు జిల్లాలోని కండలేరు డ్యామ్‌కు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. డ్యామ్ పూర్తి నీటి సామర్థ్యం 68.03 టీఎంసీలుండగా… ప్రస్తుత నీటి నిల్వ 46.661 టీఎంసీలుగా ఉంది. అలాగే డ్యామ్ ఇన్ ఫ్లో 10,430 క్యూసెక్కులు, ఔట్ ఫ్లోలో 2350 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది.