Take a fresh look at your lifestyle.

కొరోనా పరీక్షల నిర్వహణ తీరుపై ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

  • ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావుకు కోర్టు ధిక్కరణ నోటీసులు
  • జీహెచ్‌ఎం‌సిలో కొరోనా నిబంధనలు అమలు కావడం లేదు

‌తెలంగాణలో కొరోనా పరీక్షలు నిర్వహిస్తున్న తీరుపై రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతీ రోజు 50 వేలు వారానికి ఓసారి లక్ష వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలన్న తమ ఆదేశాలను ఉద్దేశ్యపూర్వకంగా అమలు చేయడం లేదని మండిపడింది. రాష్ట్రంలో కొరోనా పరీక్షలు విస్తృత స్థాయిలో నిర్వహించడం లేదంటూ దాఖలైన పిటిషన్‌లపై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా బాధితుల నుంచి రూ.లక్షలు ఫీజుల రూపంలో వసూలు చేయడం, ప్రభుత్వ నిబంధనలను పాటించని ప్రైవేటు హాస్పిటల్స్‌పై ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. అవసరం ఉన్నప్పుడు రోజుకు 50 వేల పరీక్షలు నిర్వహిస్తామని నివేదికలో పేర్కొనడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ విషయంలో ప్రజారోగ్య సంచాలకుడు డా.శ్రీనివాసరావుకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కింద చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని ఆయనను హైకోర్టు ఆదేశించిది. జీహెచ్‌ఎం‌సి ఎన్నికల ఫలితాలు ఏమో కాని ఎన్నికలు పూర్తయ్యాక కొరోనా రెండో దశ ఫలితాలు మాత్రం వస్తాయని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. అదే జరిగితే కొరోనాను ఎదుర్కునేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు కనిపించడం లేదని పేర్కొంది. కొరోనా పరిస్థితులను పరిగణనలోనికి తీసుకుని రాజకీయ సమావేశాలకు అనుమతి ఇవ్వాలని స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీఎంఆర్‌ ‌మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేసింది.

జీహెచ్‌ఎం‌సిలో మాస్కులు,భౌతిక దూరం వంటి నిబంధనలు సరిగా అమలు కావడం లేదనీ, ఈ నిబంధనలను అమలు చేసే బాధ్యతను జీహెచ్‌ఎం‌సి అధికారులకు అప్పగించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన జీవో 64ను అమలు చేసే బాధ్యతను పోలీసులకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొరోనా మరణాలపై ఆడిట్‌ ‌కమిటీని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలనీ, అలాగే, బాధితులకు ధైర్యం కలిగించేలా మానసిక కేంద్రం ఏర్పాటు చేయాలని పేర్కొంది. కొరోనా పరీక్షలు, నిబంధనల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే అంశాలపై డిసెంబర్‌ 15‌న పూర్తి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను డిసెంబర్‌ 17‌కు వాయిదా వేసింది.

Leave a Reply