Take a fresh look at your lifestyle.

ఆరోగ్య రంగాన్ని ప్రైవేటు రంగ విషకౌగిలి నుంచి విముక్తి చెయ్యాలి: తోలేటి జగన్మోహన రావు

నాకు ఏడెనిమిదేళ్ళున్నప్పుడు, 1953 ప్రాంతంలో, ఒకసారి మా ఊళ్ళో మశూచి వ్యాపించింది. ప్రతీ వీధిలోనూ కొన్ని కేసులుండేవి. పిల్లలను బయటకు వెళ్ళనిచ్చేవారు కారు. కాని ఒకసారి, నా స్నేహితులతో ఆడుతూ పక్క వీధికి వెళ్ళి, అక్కడ ఒక మశూచి రోగిని చూశాను. అరిటాకులు అరుగు మీద పరిచి ఆయన్ను ఆ అరిటాకుల మీద పడుకోబెట్టారు. మశూచి అంటే ఇప్పటి తరానికి తెలియక పోవచ్చు. మశూచి చాలా తేలికగా వ్యాపించే భయంకరమైన అంటువ్యాధి. ఒళ్ళంతా మశూచి కురుపులు వస్తాయి. కళ్ళల్లో వస్తే కళ్ళు పోతాయి. కొంతమందికి చాలా ఒత్తుగా వచ్చేవి. అందువలన బట్టలు వెయ్యడానికి కూడా వీలు పడేది కాదు. కురుపుల రసికి బట్టలు శరీరానికి అంటుకు పోతాయి. అందువల్ల అరిటాకుల మీద పడుకో బెట్టి, పైన ఒక అరిటాకు కప్పి, వేప మండలతో విసురు తున్నారు. ఒక క్షణం చూశానేమో – అంతే. అక్కడున్న పెద్దలు మమ్మల్ని తరిమేశారు. మశూచి అంటువ్యాధిలా ప్రబలినప్పుడు లక్షల మంది చనిపోయేవారు. మరి కొన్ని లక్షలమంది శరీరం మీద మచ్చలతో అందవికారంగా తయా రయ్యే వారు. అటువంటి భయంకరమైన అంట గం ఇప్పుడు ఆనవాలుకూడా లేకుండా పోయింది.

ఎలా మాయమైపోయింది? మశూచి నివారణ కార్యక్రమం ఉండేది. స్కూలుకు వచ్చి టీకాలు వేసేవారు. టీకాలు వేసిన చోట పుళ్ళు పడేవి. రెండు మూడు రోజులు జ్వరం వచ్చేది. ఆ భయంతో పిల్లలు స్కూలు నుంచి పారిపోయేవారు. ఇప్పటిలాగా టీకాలు వేయించుకోవడానికి ప్రజలు సిద్ధమయ్యేవారు కారు. మశూచి అంటే అమ్మవారు అనే మూఢ నమ్మకంతో టీకాలు వేయించుకోవడానికి ఇష్టపడేవారు కారు. పెద్దలు పిల్లలను దాచేసేవారు. అయినా ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్ళి, స్కూళ్ళకు వెళ్ళి, పెద్దలను, పిల్లలను ఒప్పించి, ఉచితంగా టీకాలు వేసేవారు. క్రమంగా ఈ నాడు మశూచి వ్యాధిని ప్రపంచంనుంచి తుడిచి వెయ్యడం జరిగింది.

నేను ఢిల్లీలో ఉన్నప్పుడు, మా సాహితీ సమావేశాలలో జె.యల్‌. ‌రెడ్డిగారు ఒక హిందీ కధ చదివి వినిపిస్తూ, తెలుగులో చక్కగా వ్యాఖ్యానం చేస్తుండేవారు. ఆయన వినిపించిన కధ ఒకటి నాకు ఇప్పటికీ గుర్తుండి పోయింది. ఒక చిన్న గ్రామంలో, ఒక కుటుంబంలో ఒక అమ్మాయికి పెళ్ళి కుదురుతుంది. మగ పెళ్ళి వారికి సంబంధం ఇష్టమే, కాని ఆ కుటుంబంలో తాత కుష్టురోగి. అతను ఊరవతల ఒక పాకలో ఒంటరిగా ఉంటాడు. ఒక పిల్లి తప్ప అతనికి తోడు ఎవరూ ఉండరు. రోజూ ముసిలాయనకు భోజనం గుడిసె బయట పెట్టి వెళ్ళిపోతుంటారు. ఆ తాత కుటుంబాన్నుంచి నిష్క్రమిస్తే మనవరాలి పెళ్ళికి అభ్యంతరం ఉండదు. గ్రామ పెద్దలూ, కుటుంబ సభ్యులూ, మనవరాలి పెళ్ళి గురించి చెప్పి తాతని ఒప్పిస్తారు. మళ్ళీ జన్మలో నీకు మంచి గతులుంటాయని చెబుతారు. తాతను తీసుకెళ్ళి గంగానదిలో ముంచుతారు. మనవరాలి పెళ్ళవుతుంది. ఆ అమ్మాయి పల్లకీలో వెడుతూ తాత నివసించిన పాక చూస్తుంది. అది కూలిపోయి ఉంటుంది. ఒక పిల్లి మాత్రం మొండి గోడల మధ్య కనపడుతుంది. తాత ఏమయ్యాడో ఆమెకు తెలియదు.

ఒకప్పుడు మన రైళ్ళలో, రోడ్ల మీదా, మార్కెట్లలో ఎక్కడ చూసినా కుష్టు రోగులు కనుపిస్తుండేవారు. కాని ఇప్పుడు అలా కనుపించరు. కుష్టురోగ నివారణ క్రింద ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. పూర్తిగా నివారించలేకపోయినా కుష్టు రోగం అదుపులో ఉంది. రోగానికి చికిత్స ఉంది. బహుశా ఉచిత చికిత్స అనుకుంటా. పాతకాలంలో క్షయరోగులను గ్రామం వెలుపల పాకల్లో ఉంచి తగలబెట్టేసేవారని మా నాన్న గారు చెప్పారు. గాలి ద్వారా చాలా తేలికగా వ్యాపించే భయంకరమైన వ్యాధి క్షయ. ఆ వ్యాధికి చికిత్స ఉండేది కాదు. తర్వాత ఈ క్షయవ్యాధికి టీకాలు వచ్చాయి. టీకాలు ఉచితంగా వేసేవారు. పేదలకు మందులు ఉచితంగా ఇచ్చేవారు. ఇప్పుడు చాలా తేలికగా తగ్గిపోయే జబ్బు క్షయ. ఇప్పుడు కూడా లక్షలమంది క్షయరోగంతో చనిపోతున్నారు, కాని కారణం క్షయ వ్యాధి కాదు, దారిద్య్రం అనే మరో భయంకరమైన రోగం. ఈ రోగానికి శస్త్ర చికిత్సే కాని వేరే నివారణ, ఉపశమన మార్గాలు లేవు.

నా చిన్నప్పుడు పాలకొల్లులో బోదకాలు లేని ముసలాళ్ళుండేవారు కారు. దోమకాటు వలన వస్తుంది బోదకాలు (ఫైలేరియా). పాలకొల్లు మునిసిపాలిటీలో కుంటి శానిటరీ ఇన్స్పెక్టరు ఒకాయన ఉండేవాడు. ఖాకీ నిక్కరులో ఖాకీ చొక్కా టక్‌ ‌చేసి, నెత్తిమీద దొర టోపీ పెట్టుకునే వాడు. బహుశా ఆయనకు బ్రిటిషు ప్రభుత్వం క్రింద పని చేసిన అలవాటు పోలేదేమో. ఆయన పొద్దుటే మోపెడ్‌ ‌బండి మీద బయలు దేరి, ప్రతీ మురుగు కాలవ పక్కనా ఆగి, సంచీలోంచి ఒక గరిటె బయటకు తీసి, మురుగు నీరు తీసి భూతద్దంతో పరీక్షిస్తుండేవాడు. సిబ్బంది రోజూ మురుగు కాలవల్లో మందు చల్లుతున్నారో లేదో చూస్తుండేవాడు. దగ్గరుండి పని చేయించేవాడు. ఆయన్ను చూసి మేము నవ్వుకుంటుండేవాళ్లం. జనం నవ్వుకున్నా, నిజాయితీగా పని చేసే అటువంటి వారివల్ల పాలకొల్లులో బోదకాలు పూర్తిగా మాయమైపోయింది.

భీష్మ ఏకాదశికి అంతర్వేదిలో తీర్థం జరుగుతుంది. అప్పుడు గోదావరి మీద వంతెన లేదు. యాత్రీకులు నరసాపురం నుంచి అంతర్వేదికి పడవల మీద ప్రయాణం చేసేవారు. కలరా ఉన్న టైంలో పడవల రేవు దగ్గర ఆరోగ్య సిబ్బంది అందరికీ కలరా వేక్సిన్‌ ‌వేస్తుండేవారు. అది లేకపోతే పడవ ఎక్కనిచ్చేవారు కారు. లరా కలుషిత నీటి ద్వారా వస్తుంది. ఒకప్పుడు కలరాతో వేలమంది చనిపోతుండేవారు. సురక్షిత నీటి పథకాల ద్వారా కలరా, టైఫాయిడు లాంటి వ్యాధులు తగ్గాయి. ఈ సురక్షిత నీటి పథకం ప్రభుత్వం క్రిందే ఉండేది. ఇప్పటిలాగా సురక్షిత నీరు వ్యాపారంగా మారలేదు. లీటరు నాలుగు పైసలకు కొన్ని పదిహేను రూపాయలకు అమ్మే నిలువు దోపిడీ లేదు. ప్రతీ ఇంట్లోనూ వాటరు ఫ్యూరిఫైయర్లుండే పద్ధతి లేదు. ప్రజలు కుళాయి నీళ్ళు తాగేవారు, ఆరోగ్యంగానే ఉండేవారు.

అలాగే పోలియో నివారణ పథకం. పోలియో చుక్కలు ఇంటింటికీ తిరిగి వేసేవారు. ప్రచారం చేసేవారు. నేటి తరానికి కూడా ఈ విషయం తెలుసు. ఆ విధంగా పోలియో దాదాపు అంతరించి పోయింది. ఇవన్నీ ప్రజారోగ్య రంగంలో మనిషి సాధించిన విజయాలు. ఈ విజయాలకు కారణం ఏ ఒక్క దేశం కాదు, మొత్తం మానవ జాతి.మన దేశంలో ప్రభుత్వాలు గత కొన్ని దశాబ్దాలుగా ప్రజారోగ్యాన్ని పూర్తిగా విస్మరించాయి. ఆరోగ్యం మీద చేసే ఖర్చు తగ్గించాయి. ఆరోగ్య సిబ్బందిని తగ్గిం చాయి. ప్రభుత్వాసుపత్రుల్ని తగ్గించాయి. ఆరోగ్యాన్ని వ్యాపారంగా మార్చి, ప్రైవేటు రంగానికి అప్పచెప్పాయి. ఆరోగ్య రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే, ప్రైవేటు రంగానికి అప్పగిస్తే, ఏం జరుగుతుందో నేడు మనం కొరోనా విషయంలో చూస్తున్నాం.

మశూచి, క్షయ, కలరా లాంటి వ్యాధులతో పోల్చి చూస్తే కొరోనా అంత భయంకరమైన వ్యాధికాదు. అంత తేలికగా వ్యాపించదు. వ్యాధినుంచి కోలుకునే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. చికిత్స కూడా అంత క్లిష్టమైనది కాదు. అయినా లక్షలమంది చనిపోతున్నారు. కొరోనాకు చికిత్స పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు లక్షలకు లక్షలు దోచెయ్యడం చూస్తున్నాం. రోగులు నిస్సహాయం గా మరణించడం చూస్తున్నాం.

కొరోనాకు టీకాలు ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితం అంటున్నారు. అక్కడ రోజుకు 50-100 మంది కంటే ఎక్కువ వెయ్యడంలేదు. టీకాల మందు అయిపోయిందని కొన్ని రోజులు ఆపు చేస్తున్నారు. ఈ టీకాల కోసం తిరిగి, తిరిగి, ఆరోగ్యవంతులు కరోనా బారిన పడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రిలో అయితే టీకాకు, బ్రాండును బట్టి, 600-1000 మధ్యన చెల్లించాల్సి వస్తోంది. అక్కడ కూడా టీకా దొరడం లేదు. ప్రభుత్వం తన ప్రజారోగ్య బాధ్యతను పూర్తిగా వదిలేసింది. డబ్బు చెల్లిస్తేనే మశూచి, క్షయ, పోలియో టీకాలు వేస్తామని ప్రభుత్వం అంటే, ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స చేయించుకోమంటే, ఈ భయంకర రోగాల నుంచి దేశం విముక్తి పొందగలిగేదా?

ఇవాళ కొరోనా నుంచి మనం కొద్దిపాటి నష్టాలతో బయటపడవచ్చు. ప్రభుత్వం ఇది తన ఘన విజయంగా ప్రచారం చేసుకుని తప్పెట్లు, తాళాలు మోగించవచ్చు. కాని రేపు కొరోనా కంటే మరొక భయంకర వ్యాధి విరుచుకు పడవచ్చు. ఆరోగ్యం ప్రైవేటు రంగంలో కొనసాగితే అప్పుడు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. లక్షలమంది నిస్సహాయంగా చనిపోతారు. ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తుంది.

కేవలం మోడీ, బిజెపీలు మాత్రమే నేటి ఈ దుస్థితి కారణం కాదు – ఇంతవరకూ అధికారంలో ఉండి ఈ దేశ ఆరోగ్య రంగాన్ని సర్వనాశనం చేసిన పార్టీలన్నీ ఈ నాటి ఈ దుస్థితికి బాధ్యులు. ఈ పార్టీలు ఇప్పుడు తిరిగి అధికారంలోకి రావడానికి మోడీ, బిజెపీలను మాత్రమే దీనికి బాధ్యులుగా ప్రచారం చెయ్యవచ్చు. కొరోనా విషయంలో మోడీ, బిజెపీలు నేరస్తులు అంటారు కాని ప్రధాన కారణం అనేక దశాబ్దాలుగా అన్ని పార్టీలూ ప్రభుత్వ ఆరోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేసి, ప్రైవేటు రంగానికి ప్రజలను బలి చెయ్యడం. ఆరోగ్యం మా జన్మ హక్కని నినదించి, ఆరోగ్య రంగాన్ని ప్రైవేటు రంగ విష కౌగిలి నుంచి విముక్తి చెయ్యాలనీ, ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత అనీ ప్రజలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఈ వ్యవస్థలో మౌలికమైన మార్పు రాకుంటే మన బతుకులకు భరోసా లేదు.
సీనియర్‌ ‌జర్నలిస్ట్ ఎస్‌ ‌కె జాకీర్‌ ‌ఫేస్‌ ‌బుక్‌ ‌వాల్‌ ‌నుంచి…

Leave a Reply