Take a fresh look at your lifestyle.

‘‌వాలంటీర్‌ ‌వ్యవస్థ’ పై దుందుడుకు వ్యాఖ్యలు తిరుపతిలో భాజపాకు చేటు

ఉత్తరగోగ్రహణంలో నాడు పాండవులు విజయం సాధించినట్లు నేడు భారతీయ జనతా పార్టీకి దక్షిణ గోగ్రహణంలో విజయసూచనలు మృగ్యంగా అనిపిస్తున్నది. ఉత్తరాది మాదిరి వింధ్య పర్వతాల కింద భాజపాకు హిందుత్వ అస్త్ర ప్రయోగం ఎన్నికల రణంలో ఫలితం ఇచ్చే వాతావరణ పరిస్థితులు కనిపించడం లేదు. ఆంధ్ర ప్రదేశ్‌లో కాలూని దక్షిణాన వామనపాదం విస్తరించాలన్న భాజపా ఆశ అడియాశగా మిగిలే లక్షణాలు బాగా కనిపిస్తున్నాయి.

ఏప్రిల్‌ 17‌వ తేదీ తిరుపతి లోక్‌ ‌సభ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ స్థానం చేజిక్కించుకోవాలని తాపత్రయ పడడం మినహా జరిగేదేమీ ఉండదన్న నిర్ధారణ నేపథ్యంలో భాజపా ఆశలు పెంచుకుంటున్నది. సమైక్యాంధప్రదేశ్‌ ‌తెలంగాణ, ఆంధప్రదేశ్‌గా విడిపోయిన తరువాత భాజపాకు రెండు రాష్ట్రాల్లో ఎక్కడా నిలదొక్కుకునే ఆస్కారం లేకుండా పోయింది. దానికి తోడు దక్షిణాదిన ఆ పార్టీకి స్థానిక పార్టీలతో ఢీకొనే సమర్థుడైన నాయకుడు లేక ఉత్తరాది నాయకత్వాన్నే నమ్ముకోవలసి రావడం వల్ల ఎండమావిలా తయారైంది. రాష్ట్ర విభజనానంతరం తెలంగాణలో టిఆర్‌ఎస్‌, అం‌ధ్రలో టిడిపి, వైఎస్‌ఆర్‌సిపీ ప్రాంతీయ పార్టీలను ఎదుర్కునే సత్తా భాజపా కు సమకూరలేదు. 2019 ఎన్నికల తరువాత తెదేపా ఘోర వోటమి చవి చూసి వైసిపి అధికారంలోకి రావడంతో కనీసం టిడిపిని వెనక్కి నెట్టి రెండో స్థానంలోకి కూడా ఎదిగే ప్రయత్నాలు జరగలేదు.

దక్షిణాది రాష్ట్రాలలో స్థానికత పట్ల అభిరుచి, భాష, సంస్కృతి, సాంప్రదాయం, ఆచారం, ఆత్మగౌరవం గాఢంగా వేళ్ళూనుకున్న కారణంగా భాజపాకు అవకాశం లేకుండా పోయింది. ముఖ్యంగా ఆంధ్రలో రాజకీయ సిద్ధాంతాలంటూ లేకుండ, కేవలం సినీవ్యామోహమే ఆకర్షణగా ఉన్న నాయకత్వం పైనే ఆధారపడి శైశవ స్థాయి దాటని మరో స్థానిక పార్టీ జనసేనతో లాలూచి పడడం అసలు కలిసిరాలేదు. రాష్ట్రంలో అధికార పార్టీ వైసిపికి క్షేత్ర స్థాయిలో ఉన్న బలం, ఊపిరి ‘‘వాలంటీర్ల వ్యవస్థ’’ అనేది కాదనలేని నిజం. ఎలాగైనా తిరుపతి స్థానం గెలవాలన్న పట్టుదలతో వ్యూహరచన చేస్తున్నా రాష్ట్ర భాజపా నాయకులు, ఆ వాలంటీర్ల వ్యవస్థపై బాణాలు ఎక్కుపెట్టి వైసిపిని బలహీన పరచాలని ఎత్తులు వేస్తున్నారు. యువతకు దేశవ్యాప్తంగా ఉపాధి కల్పిస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వొచ్చి, అమలులో ఘోరంగా విఫలమై, రాష్ట్రంలో సుమారు లక్ష మంది యువతకు వైసిపి ప్రవేశపెట్టిన ఆ వాలంటీర్‌ ‌వ్యవస్థ నిరుద్యోగ సమస్య తీరుస్తున్నది అనే వాస్తవాన్ని విస్మరించి, భాజపా రాష్ట్రంలో అధికారంలోకి వొస్తే మొదటగా ఏటా 310 కోట్ల రూపాయలు వృథా అవుతున్న వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి, అంతకంటే మేలైన వ్యవస్థ తీసుకువొస్తుందని భాజపా ఆంధప్రదేశ్‌ అధ్యక్షుడు సోము వీర్రాజు హామీ ఇవ్వడం గురివింద సామెతను గుర్తు చేస్తున్నది..

కిందిస్థాయిలో పార్టీ మరింత బలంగా వేళ్ళూనుకునేలా ఉపయోగించుకునేందుకు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అట్టడుగు ప్రజానీకానికి ఇంటి ముంగిటకు చేరవేసేందుకు, ప్రతి 50 గృహాలకు ఒక వాలంటీర్‌ ‌లక్ష్యంతో వైసిపి నాయకత్వం ప్రవేశపెట్టిన వాలంటీర్‌ ‌వ్యవస్థ ముఖ్యంగా కొరోనా లాక్‌ ‌డౌన్‌ ‌కాలంలో మెరుగైన ఫలితాలిచ్చిందనడంలో సందేహం లేదు. కొరోనా హెచ్చరికలు చేసి, పరీక్షల నిర్వహణ, నిత్యావసర వస్తువులు ఇంటింటికీ చేరవేయడంలో వాలంటీర్లు కీలక పాత్ర నిర్వహించారని సర్వత్రా హర్షం వ్యక్తమైంది కూడా. నిజం చెప్పాలంటే రాజకీయంగా ఎన్నో విమర్శలు, ఆరోపణలు ఎదుర్కుంటున్న వైసిపికి కనిపించని సైన్యంలా ఈ వాలంటీర్లే రక్షణగా నిలిచారని ప్రభుత్వానికి ప్రగాఢ నమ్మకం కూడా కలిగింది.

గ్రామ గ్రామానా పునాది స్థాయిలో తెలుగుదేశం ప్రయత్నాలను విఫలం చెయ్యడంలో, భాజపా వామనపాదం విస్తరణ నిలువరింపచేయడంలోనే కాకుండా, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ ‌రెడ్డి పేదల పెన్నిధిగా నమ్మకం కలిగించడంలో వాలంటీర్‌ ‌వ్యవస్థ అండ • ఉన్నదనడంలో అనుమానం లేదు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి, తమ జీవితాలకు భద్రత కలింగించాలనీ వాలంటీర్లు ఆశిస్తున్న మాట వాస్తవమైనా, అది అసంతృప్తిగా పెంచాలని బిజెపి చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావని అంటున్నారు. తిరుపతి ఎన్నికల్లో పోటీ పడుతున్న బిజెపి ఇప్పటికైనా వ్యూహం మార్చుకుని, ప్రజలకి ప్రయోజనకర హామీలు, వాగ్దానాలు చేసి నమ్మకం కలిగించుకోలేకపోతే ఎన్నికల శ్రమ మినహా ప్రయోజనం ఉండదని సలహా ఇస్తున్నారు.

దీనికి తోడు జగన్‌పై మత ముద్ర వేసేందుకు జగన్మోహన్‌ ‌రెడ్డిని ‘‘ఏసుబాబు’’గా చిత్రీకరించే ఎత్తుగడలు మరింత దుష్ప్రభావం కలిగిస్తాయి. ఆంధ్రలో ఇటీవల ముగిసిన పంచాయతీ, మునిసిపల్‌ ఎన్నికలలో వైసిపిని ఓడించడానికి విపక్షాల ఎత్తులు చిత్తయిన విషయాన్ని భాజపా గుర్తుంచుకుని జనాలకు మేలు చేకూర్చే అంశాలను ప్రస్తావించడం మేలు..! కనీసం టిడిపి స్థానంలో బిజెపి నిలవాలన్నా మాటలు నియత్రించుకుంటే టిడిపికి బిజెపి ప్రత్యామ్నాయమవుతుంది.

Leave a Reply