Take a fresh look at your lifestyle.

అశాంతికి అత్యాశే కారణం

మానవుడు తనకు ఎన్ని వున్నా ఇంకా ఏదో కావాలనే తపన ఎక్కువైపోతోంది. వాటిని పొందడానికి జీవితమంతా ఉరుకులూ పరుగులూ పెడుతూవున్నాడు. గత కాలంలో గాక ఈనాడు మానవునికి ఎన్నో విధాలుగా సాంకేతికంగా ఎదిగిన పరిజ్ఞానంతో కూడిన పరికరాలూ, ఎన్నో రకాల ఉపకరణాలూ వున్నాయి. అయినా ఎక్కడా కూడా మనిషికి  శాంతి కనిపించడంలేదు. అశాంతి నానాటికీ పెరిగిపోతూ వుంది. ఎన్నివున్నా, ఎంతవున్నా ఇంకా ఏదో కావాలనే ఆశ మితిమీరిపోయి, వాటిని సాధించడానికి జీవిత కాలంలో ఎక్కువ సమయాన్ని విచ్చలవిడిగా, వృధాగా కాలయాపన చేస్తున్నాడు. జ్ఞానేంద్రియ సంబంధంగా ఎన్నో కోర్కెలు పుట్టడం, అవి నేరవేరకపోవడంతో కోపం,ద్వేషం, అసూయలాంటివి మొలకెత్తడం, తద్వారా అవివేకంగా ప్రవర్తించడం జరుగుతూవుంది. బుద్ధి నాశనం జరుగుతూవుంది. మనస్సు ద్వారా ఏర్పడే సంబంధం ముదిరి, అది కోరిక గానూ, ఆశగానూ పరిణమించి, మనిషి మహాపతనానికి దారితీస్తున్నది. ఈ విషయంలో ఎన్నో పురాణగాధలు ప్రచారంలో వున్నాయి. పూర్వకాలంలో పార్వతీశ్వర వర్మ పల్లవ రాజ్యాన్ని పాలించేవాడు. ఆయనను ఒక అనుమానం ఎంతో కాలంగా పీడిస్తోంది. ఆశ అనేది మానవుడికి ఎందుకు పుట్టాలి?  వీటి వలనే అన్ని అనర్థాలూ చోటు చేసుకుంటున్నాయని ఆయన భావన. ఈ విషయాన్ని ఆయన మంత్రులు గమనించి, నగరమంతా దండోరా వేయించారు. ఎవ్వరైతే రాజుగారి అనుమానాన్ని నివృత్తి చేస్తారో వారికి మూడు గ్రామాలతో బాటు తగినంత ధనం ఇవ్వబడుతుంది అని. ఇక ఎంతో మంది పండితులూ, భాషా కోవిదులూ వచ్చి ఎన్నో విధాలుగా వివరించారు. అయినా రాజుగారికి ఊరట కలిగించలేదు. ఇది గమనించిన మంత్రులు ఈ విషయం బాహ్యప్రపంచానికి చెందినది కాదని గ్రహించి, సాధారణ మానవులు దీనికి సమాధానం చెప్పలేరని నిర్ణయించి, కొంత సమయం కావాలని రాజుగారిని కోరారు.

ఆయన సరేనన్నాడు. కొన్నాళ్ళకు రాజుగారి కొలువు కూటంలోకి ఒక కాషాయ వస్త్రాలు ధరించిన యువకుడు ప్రవేశించాడు. తనపేరు సుధాముడని చెప్పాడు. మహారాజు ఆ యువకుడిని చూసి, ‘నీవు చిన్నవాడివి, అనుభవం అంతంత మాత్రమేనని చెప్పాలి. పండితులు వృద్ధులే చెప్పలేని విషయాన్ని నీవెలా తీర్చగలవు’ అన్నాడు. ఆ యువకుడు తాను సన్యాసం పుచ్చుకొని పుష్కరం పాటు తపస్సు చేసి వచ్చాననీ, సత్యాన్ని గ్రహించి, అంబ కృపచేత జ్ఞాన నేత్రాన్ని పొందాననీ చెప్పాడు. అతని గంభీర స్వరాన్ని విని అందరూ ఆశ్చర్యపోయారు. రాజుగారు తన అనుమానాన్ని వ్యక్తం గావించారు. మనిషిని అల్లలాడిస్తున్న ఆశలమూలస్థానం ఏమిటని అడగగానే యువ సన్యాసి ఈ విధంగా చెప్పాడు. ‘రాజా! కొన్ని సత్యాలు కంటికి కనిపించవు. అవి అంతర్‌ ‌దృష్టి తో  మాత్రమే గోచరిస్తాయి. అలాంటి అంటారు దృష్టి  కలగాలంటే అంతరాత్మను మేల్కొలపాలి. అశాంతి సుడిగుండానికి అత్యాశే కారణం. అన్యాయ అక్రమాలకు కేంద్ర బిందువు. అది మీలోనూ వుంది. అందుకే మీరు ఆశల పుట్టుక గురించి తెల్సుకోడానికి సలసల కాగిపోతున్నారు.

సుఖ దు:ఖాలకు దూరమవుతున్నారు’ అని చెప్పగానే రాజుగారికి విపరీతంగా కోపం వచ్చింది. నేత్రాలు ఎర్రబడ్డాయి. నాలో అవినీతి అక్రమాలు పోగుపడి వున్నాయా? అంటూ ప్రశ్నించగానే, సుధాముడు చిద్విలాసంగా అవుననే చెప్పాడు. రాజు మరింతగా కోపంతో ఊగిపోయి ‘నీ అపవాదును నిరూపించు’ అని గద్దించాడు. సుధాముడు శాంతంగా ఇలా చెప్పుకు వచ్చాడు.‘ రాజా మీకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య మీధురా నగర చక్రవర్తి కుమార్తె. ఆమెతోబాటు అర్ధరాజ్యాన్ని పొందారు. రెండవ భార్య తండ్రి కోసల రాజ్యాధిపతి. ఆయనను పదవీచ్యుతుణ్ణి చేసి, ఆయన రాజ్యాన్ని కలుపుకొన్నావు. అంతటితో మీ ఆశ తీరక పొరుగూరి వజ్ర వ్యాపారి జ్యేష్ఠ పుత్రికను పెళ్లాడి ఆయన సర్వ సంపదనూ కలుపుకోవాలని ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నావు. వీటిని సాధించుకోడానికై సర్వభ్రష్ట రాజకీయాలు నడుపుతూ వున్నావు. దీని పేరే ఆశ. ఇది అశాంతికి తోబుట్టువులాంటిది. మీలో ప్రాకిన ఈ చీకటి తెరల్ని మీరుగా తెల్సుకోడానికి ప్రయత్నించకుండా, మరొకరిని అడిగి తెల్సుకోవాలని ప్రయత్నించడం అనుమాన నివృతి కాజాలదు. అంధకార బంధురమైన అజ్ఞానమే అవుతుంది అని చెప్పి, ‘రాజా, ఇక మీరు మీ అనుమానాన్ని నివృత్తి చేయలేదనుకుంటే ఏ శిక్ష విధించినా సరే అన్నాడు. వెంటనే మహారాజు సింహాసనం మీద నుండి లేచి, మూడు గ్రామాల పత్రాలు, బంగారు కాసుల మూటను యువ సన్యాసి ముందు వుంచి ప్రణమిల్లాడు. అందుకు సధాముడు నవ్వుతూ వెంటనే దూరంగా జరిగి, ‘ రాజా నేను వీటిని స్వీకరించినట్లయితే మీకూ నాకూ వ్వత్యాసమేముంటుంది’ అని అంటూ వెనక్కి తిరిగి చూడకుండా రాజుగారి సభనుండి నిష్క్రమించాడు. కావున మనుష్యులందరూ ‘ఆశ’ అనేదాన్ని ఆదిలోనే తుంచి వేసి, వారికి ఉన్న దానితోనే తృప్తిగా జీవించాలి. విషయభోగాల నుండి దృష్టిని దైవం మీదకు తిప్పినట్లయితే ఆశ నశించి, మోక్షం ప్రాప్తిస్తుంది. దైవారాధనను స్వీకరించి, జీవితాల్లో శాంతిని పొందాలి.
– డా।। పులివర్తి కృష్ణమూర్తి.

Leave a Reply