Take a fresh look at your lifestyle.

మహాతత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్‌

“తత్వవేత్తల ప్రవచనాలలోని సత్యాసత్యాలను, బౌద్ధ, జైన, హిందు మొదలైన మతాచార్యులు వెలువరించిన అభిప్రాయాలలోని సారాన్ని గ్రహించిన మహామేధావి రాధాకృష్ణన్‌. ఆయన ప్రతిభకు గుర్తింపుగా వివిధ విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్‌ ‌నిచ్చి సత్కరించాయి.”

స్వాతంత్య్రానంతరం భారతదేశ ప్రథమ ఉపరాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికై ఆ తర్వాత రాష్ట్రపతి పదవిని అలంకరించి ఆ పదవికే వన్నె తెచ్చిన మహానీయుడు డాక్టర్‌ ‌సర్వేపల్లి రాధాకృష్ణన్‌. ‌గొప్ప తత్వవేత్తగా, ఉపాధ్యాయుడిగా విశిష్ట సేవలు అందించిన రాధాకృష్ణన్‌ ‌జన్మదినాన్ని ప్రభుత్వం ప్రతియేటా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తున్నది. రాధాకృష్ణన్‌ ‌మద్రాస్‌ ‌లోని తిరుత్తణి గ్రామంలో 1888 సెప్టెంబర్‌ 5 ‌న వీరస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించారు. బాల్యం నుండే ఆయనకు దైవభక్తి, దేశభక్తి ఎక్కువ. ఆయన ఏక సంతాగ్రాహి. ఆయన అద్భుత జ్ఞాపక శక్తికి ఉపాధ్యాయులు కూడా ఆశ్చర్య పోయేవారు. తత్వశాస్త్రంలో ఎం.ఏ. పూర్తి చేసిన రాధాకృష్ణన్‌ ‌చిన్నప్పటి నుండే వివిధ మతాచార్యుల బోధనలు విని అందులో విషయ సారాన్ని మిత్రులతో , గురువులతో చర్చించేవాడు. మతాలనేవి మంచిని పెంపొందించాలని, సకల మానవాళి అభ్యున్నతే అన్ని మతాల సారమని విశ్వసించిన మహానీయుడు రాధాకృష్ణన్‌.

‌రాధాకృష్ణన్‌ ‌రాసిన ‘‘వేదాంత నీతిశాస్త్రం’’ గ్రంథం పండితుల ప్రశంసలు పొందింది. ఈ గ్రంథం ఎం.ఏ. విద్యార్థులకు పఠనీయ గ్రంథంగా నిర్ణయించారు. తత్వశాస్త్ర సారమంతా ఈ గ్రంథంలో ఇమిడి ఉంది. రాధాకృష్ణ న్‌ ఆదర్శ విద్యార్థియే కాక ఆదర్శ ఉపాద్యాయుడు కూడా. విద్యార్థి దశలోనే ఆయన అనేక మంది పేద విద్యార్థులకు బొఢించారు. మద్రాస్‌ ‌ప్రెసిడెన్సీ కళాశాలలో, మైసూర్‌ ‌విశ్వవిద్యాలయంలో , కాశీ విశ్వవిద్యాలయంలో, ఆంధ్ర విశ్వవిద్యాలయం లో తత్వశాస్త్ర ఆచార్యునిగా విశేషమైన పేరు గడించారు. ఈయన రాసిన ‘‘రీయన్‌ ఆఫ్‌ ‌రెలిజియన్‌ ఇన్‌ ‌కాన్‌ ‌టెంపరరీ ఫిలాసఫీ’’ గ్రంథం భారత దేశంలోనే కాక బ్రిటన్‌, అమెరికా మొదలైన దేశాల్లో విశ్వవిద్యాలయాల్లో పాఠ్య గ్రంథమైంది.

ఈయన రాసిన ‘‘ఇండియన్‌ ‌ఫిలాసఫీ’’ (భారతీయ తత్వము) గ్రంథం మనదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది. తత్వవేత్తల ప్రవచనాలలోని సత్యాసత్యాలను, బౌద్ధ, జైన, హిందు మొదలైన మతాచార్యులు వెలువరించిన అభిప్రాయాలలోని సారాన్ని గ్రహించిన మహామేధావి రాధాకృష్ణన్‌. ఆయన ప్రతిభకు గుర్తింపుగా వివిధ విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్‌ ‌నిచ్చి సత్కరించాయి. తత్వశాస్త్రంలోని ఆయన ఉపన్యాసాలన్ని ‘‘ఆదర్శ జీవన దృక్పథం’’ పేరిట గ్రంథంగా వెలువడింది. మతం మానవాళికి జీవామృతం అనీ, మత విశ్వాసం శాంతి సాధనమనీ, దైవభక్తి మానవుడిని పతనం నుండి రక్షిస్తుందనీ ఆయన ప్రభోదించారు.

బ్రిటీష్‌ ‌పాలకులకు వ్యతిరేకంగా గాంధీజీ ప్రారంభించిన క్విట్‌ ఇం‌డియా ఉద్యమంలో పాల్గొని భారతమాతను దాస్య శృంఖలాలనుండి విముక్తి చేయాలని భావించారు. తన ఉపన్యాసాల ద్వారా స్వాతంత్య్ర ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రజలలో స్వాతంత్య్ర ఉద్యమ కాంక్షను రాధాకృష్ణన్‌ ‌నెలకొల్పారు. రాజ్యాంగ పరిషత్‌ ‌సభ్యుడిగా భారత రాజ్యాంగ రచనలో తనవంతు పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించారు. రాధాకృష్ణన్‌ ‌దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1954లో ఆయనకు భారత రత్న అవార్డును ప్రకటించింది. ఆయన జన్మదినాన్ని ఉపాధ్యాయుల దినోత్సవంగా పరిగణించి సెప్టెంబర్‌ 5 ‌న ప్రత్యేకంగా ఉపాధ్యాయులను సత్కరిస్తున్నారు. రాధాకృష్ణన్‌ 1975 ఏ‌ప్రిల్‌ 17 ‌న భౌతికంగా మరణించినప్పటికీ అపరిమిత విజ్ఞానవేత్తగా ఆదర్శప్రాయుడిగా, అత్యున్నత ప్రతిభాశీలిగా, తత్వవేత్తగా,ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రజలందరి మదిలో చిరస్థాయిగా నిలిచి ఉన్నారు.
కందుకూరి భాస్కర్‌, 9703487088

Leave a Reply