గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి విడనడాలనీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్యరెడ్డి డిమాండు చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారమిక్కడ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేస్తూ.. గత కొన్ని నెలలుగా ఫి•ల్డ్ అసిస్టెంట్లు తమ సమస్యలను పరిష్కరించాలని, 4779 నెంబర్ సర్క్యులర్ రద్దు చేయాలని, వేతనాలు పెంచాలన్న డిమాండ్‌తో ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ఏర్పాటుకు జరిగిన ఉద్యమాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు ముఖ్య పాత్ర పోషించారన్నారు.
ప్రభుత్వ విధానాలు వల్ల ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఉపాధి హామీ పథకం పకడ్బందీగా అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. నెలనెలా బిల్లులు చెల్లించడం లేదన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా సస్పెన్షన్ చేస్తూ సర్క్యులర్ ఇవ్వడం సరైంది కాదన్నారు. ప్రభుత్వం పిల్డ్ అసిస్టెంట్లపైన వేధింపులు ఆపి చర్చలు జరపాలని అయోధ్యరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు న్యాయం జరిగేంత వరకు వారికి, వారి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందనీ అయోధ్యరెడ్డి తెలిపారు.