Take a fresh look at your lifestyle.

మీ కాళ్లపై మీరు నిలబడాలన్నదే ప్రభుత్వ ఆలోచన

  • ఎస్సీ కార్పొరేషన్‌ ‌ద్వారా మహిళలకు చేయూత
  • త్వరలో జిల్లా వ్యాప్తంగా మరో 200 మందికి శిక్షణ, మిషనరీ
  • రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు
  • ఆర్టీసీ డిపోలో హెవీ మోటార్‌ ‌వెహికల్‌ ‌డ్రైవింగ్‌ ‌శిక్షణ..నిరుద్యోగ యువత ఆసక్తి చూపాలి : పిలుపునిచ్చిన మంత్రి హరీష్‌ ‌రావు

స్వయం ఉపాధి పొంది ఎవరి కాళ్లపై వారు నిలబడాలన్నదే ప్రభుత్వం ఆలోచన అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎస్సీ కార్పొరేషన్‌, ‌సెట్విన్‌ ‌సంయుక్తంగా మూడు నెలలు టైలరింగ్‌ ‌శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కుట్టు శిక్షణ మీ ఉపాధికి రక్షణగా ఉంటుందని ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌, ‌సెట్విన్‌ ‌ద్వారా మహిళలకు చేయూతను అందిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పొందిన తర్వాత డొమెస్టిక్‌ ‌మిషన్లు కాకుండా టైలరింగ్‌ ‌మిషన్లు ఎప్పటికీ మీకు కమర్షియల్‌ ‌గా ఉపయోగపడేలా ఇస్తున్నట్లు, శిక్షణ, మిషనరీలకు రూ.11,98,400 లక్షల రూపాయల వ్యయంతో ఇప్పటి వరకు 40 మంది ఎస్సీలకు మంజూరు చేసినట్లు, టైలరింగ్‌ ‌మిషన్లతో పాటు ఐరన్‌ ‌బాక్స్, ‌టూల్‌ ‌కిట్‌ ‌రూ.16 వేల రూపాయల విలువ కలిగిన సామాగ్రి అందిస్తున్నట్లు మంత్రి చెప్పారు.

త్వరలోనే ప్రారంభించనున్న శిక్షణలో సిద్ధిపేట పట్టణ ప్రాంత వాసులకు 100 మందికి శిక్షణ, మిషనరీ అందిస్తామని, అలాగే జిల్లాలోని గజ్వేల్‌, ‌దుబ్బాక, హుస్నాబాద్‌ ‌మున్సిపాలిటీ పరిధిలోని ప్రాంత వాసులకు 100 మందికి జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో బోర్డింగ్‌, ‌లాడ్జింగ్‌ ‌సదుపాయాలు కల్పించి శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి హరీష్‌ ‌రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో సెట్విన్‌ అమీనా, ఎస్సీ కార్పోరేషన్‌ ఈడీ రామాచారి, మార్కెట్‌ ‌కమిటీ చైర్మన్‌ ‌పాల సాయిరామ్‌, ‌మాజీ చైర్మన్‌ ‌రాజనర్సు, కౌన్సిలర్‌ ‌సాకి ఆనంద్‌, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ డిపోలో హెవీ మోటార్‌ ‌వెహికల్‌ ‌డ్రైవింగ్‌ ‌శిక్షణ..నిరుద్యోగ యువత ఆసక్తి చూపాలి : పిలుపునిచ్చిన మంత్రి హరీష్‌ ‌రావు
అనుభవం కలిగిన వారితో శిక్షణ. డ్రైవింగ్‌తో పాటు మెకానిక్‌ ‌మెలకువలపైనా బోధన. అదీ పూర్తయ్యాక సులభంగా లైసెన్స్ ‌జారీ. ఆర్టీసీ డ్రైవర్ల నియమకాల్లోనూ ప్రాధాన్యం ఉంటుందని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ ‌రావు యువతకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ఆర్టీసీ డిపోలో హెవీ మోటార్‌ ‌వెహికల్‌ ‌డ్రైవింగ్‌ ‌శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి, జెండా ఊపి శిక్షణ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఈ డ్రైవింగ్‌ ‌శిక్షణతో స్వయం ఉపాధి పొందే అవకాశం ఉన్నదని, రాబోయే రోజుల్లో మండలాల వారీగా గుర్తించి డ్రైవింగ్‌ ‌శిక్షణ ఇచ్చేలా చూస్తానని మంత్రి భరోసా ఇచ్చారు. నెల రోజుల పాటు జరిగే శిక్షణకు మొదటి బ్యాచ్‌ ఒక్కొక్కరికీ రూ.15 వేల 600 రూపాయలు ఫీజుగా నిర్ణయించామని, ఎస్సీ కార్పొరేషన్‌ ‌ద్వారా నిరుద్యోగ యువత 30 మందికి 4 లక్షల 68 వేలు ప్రభుత్వమే వెచ్చించినట్లు మంత్రి చెప్పారు.

లైసెన్సు మంజూరుకూ తోడ్పాటు..
శిక్షణ అనంతరం నిర్ణీత పరీక్షల్లో పాసైన వారికి ధ్రువపత్రం జారీ చేస్తారని, హెవీ మోటార్‌ ‌వెహికల్‌ ‌లైసెన్సు మంజూరుకు ఆర్టీసీ అధికారులే చర్యలు తీసుకుంటారని మంత్రి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఆయా కులాల కార్పొరేషన్లే ఫీజు చెల్లిస్తున్నాయని, భారీ వాహనాల డ్రైవింగ్‌ ‌శిక్షణతో స్థిరమైన ఆదాయంతో కూడిన ఉపాధి అవకాశాలు లభించనున్నాయని చెబుతూ..సిద్ధిపేట ఆర్టీసీ ప్రారంభించిన సరికొత్త శిక్షణా కార్యక్రమంలో నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఔత్సాహిక యువత నేరుగా ఆర్టీసీ డిపోను సంప్రదించాలి…
మెరుగైన, స్థిరమైన ఉపాధి అవకాశాల దిశలో ఈ శిక్షణ పొందాలంటే ఔత్సాహిక యువత నేరుగా ఆర్టీసీ డిపో సంప్రదించి రూ.15,600 రూపాయలు చెల్లించి శిక్షణ, లైసెన్సు పొందాలని సూచించారు. కేవలం భారీ వాహనాల శిక్షణ, లైసెన్సు జారీ చేయడమే కాదని, మరో వివిధ రకాలైన 23 శిక్షణ కోర్సులు ఇవ్వనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్‌ఏం ‌రాజశేఖర్‌, ‌డీఏం రామ్మోహన్‌ ‌రెడ్డి, ఎస్సీ కార్పోరేషన్‌ ఈడీ రామాచారి, మార్కెట్‌ ‌కమిటీ చైర్మన్‌ ‌పాల సాయిరామ్‌, ‌మాజీ చైర్మన్‌ ‌రాజనర్సు, డిపో సిబ్బంది, శిక్షణార్థులు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply