మానవ హక్కుల వేదిక గ్రౌండ్ రిపోర్ట్
సంగారెడ్డి జిల్లా, అమీన్ పూర్ మండలం, ఐలాపూర్ లో…
మే 10 ఉదయం 3 గంటల ప్రాంతంలో వందలాది పోలీసులు, రెవిన్యూ అధికారులు అమీన్ పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో 500 ఇళ్లకు పైగా కూల్చేశారన్న వార్త అన్ని పత్రికలలో ప్రచురితమైనది ,టీవీ. ఛానెల్లలో ప్రసారం అయింది. ఈ సంఘటన పై విషయం సేకరణ చేయడానికి జంట నగరాల కమిటి కి చెందిన ఐదుగురు సభ్యుల బృందం మే 20 వ తేదీన ఐలాపూర్ గ్రామంలో బాధిత కుటుంబాలను, ఈ సమస్య పై అవగాహన ఉన్న ఇద్దరు సామాజిక కార్యకర్తలను, లాయర్లను, స్థానిక సర్పంచ్ ను కలిసింది. ఈ భూమికి సంబంధించిన అన్ని రెవెన్యూ కాగితాలను పరిశీలించి ఈ నివేదిక తయారీ చేసింది. రెవిన్యూ అధికారులను కలిసే ప్రయత్నం చేయగా వాళ్ళు అందుబాటులో లేరు. ఐలాపూర్ గ్రామంలో సర్వే నం. 1 – 220 లో ఉన్న సర్ఫే కాస్ భూమి దాదాపు 1250 ఎకరాలు ని 1902 లో ఇమామ్ అలీ కి నిజాం ప్రభుత్వం 56 సంవత్సరాలకు లీజుకి ఇచ్చింది. ఆ భూమిని ఇమామ్ అలీ దగ్గర హకీం కొనుగోలు చేసాడు. హకీం మరణించిన తరువాత 1958 లో ఆ భూమిని తన వారసులు క్లెయిమ్ చేసారు, అదే సమయంలో ఇమామ్ అలీ వారసులు కూడా ఆ భూమిని క్లెయిమ్ చేసారు. ఈ కేసు కోర్టులో నడుస్తుండగా 1982లో జాయింట్ కలెక్టర్ ద్వార సర్వే చేసి అప్పటికే వ్యవసాయం చేస్తున్న స్థానికులకి కొంత మొత్తంలో పట్టా చేసింది. మిగిలిన భూమిని హుస్సేన్ వారసులకే చెందుతుంది అని చెప్పింది. దీనిపై హై కోర్టులో ఇమామ్ అలీ కుటుంబీకులు పిటిషన్ వేశారు, వేరే పార్టీస్ రిట్ పిటీషన్ వేసాయి. 2005 లో హై కోర్టు హుసేన్ కుటుంబానికే చెందుతుంది అని తీర్పు ఇచ్చింది. అయితే విద్యుత్ ఎంప్లాయిస్ కో-ఓపెరటివ్ హౌసింగ్ సొసైటీ వాళ్ళు ఆ భూమిని మేము కొనుగోలు చేసాం అని పిటిషన్ వేశారు. ఈ విషయమై 2013 లో హైకోర్టు డివిజన్ బెంచ్ స్టేటస్ కో తీర్పు ఇచ్చింది, WAMP No. 264 of 2013 in WA No. 115 of 2013).). ఈ ట్రయల్ కోర్ట్ లో ఇంకా నడుస్తుంది.
SY 119 లో ఉన్న 25 ఎకరాల భూమిని పిటిషనర్లు తీర్పు తమకే అనుకూలంగా వస్తుంది అని కొందరు బ్రోకర్లు, స్థానిక రాజకీయ నాయకుల అండతో ప్లాట్లు వేసి విక్రయించటం మొదలు పెట్టారు. బ్రతుకు దెరువు కోసం హైదరాబాద్‌కి వచ్చిన మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్ మరియు ఇతర ప్రాంతాల ప్రజలు భూమి ధర వాళ్లకు అందుబాటులో ఉందని, రాజకీయ నాయకుల సహకారం ఉంది కాబట్టి సమస్య ఏమీ ఉండదని తలచి, నోటరీలు పద్దతి ద్వారా ఈ భూమిని కొన్నారు. వీరంతా బీద ప్రజలు, ఆటో డ్రైవర్లు, వడ్రంగులు, కూలీలు, ఇతర రోజు వారి కూలికి పని చేసుకుంటూ జీవనం గడిపే వాళ్ళు. ఎక్కువ శాతం షెడ్యూల్డ్ కులాలకి చెందిన వాళ్లు. గత 2-3 సంవత్సరాలుగా ఈ అమ్మకం-కొనుగోలు ప్రక్రియ నడుస్తుంది. ప్రజలు ప్లాట్లు కొన్నకోవడమే కాక అక్కడ ఇళ్ళు కూడా కట్టుకున్నారు. ఆ ప్లాట్లు అన్ని 60 నుండి 120 గజాల లోపివే. మొత్తం 672 ప్లాట్లు ఉన్నాయి. అక్కడ అన్నీ ఇళ్లకు కరెంటు కనెక్షన్లు ఉన్నాయి, కొంత మంది స్థానిక మున్సిపాలిటీకి పన్ను కూడా కడుతున్నారు, కొన్ని ఇళ్లకు ఇంటి నంబర్ కూడా వచ్చింది. అభివృద్ధి చేసిన ఆ భూమిలో పద్ధతి ప్రకారం రోడ్లు ఉన్నారు, డ్రైనేజీ లైన్ లు వేశారు. ఇదంతా జరుగుతుంటే మున్సిపల్ అధికారులు గానీ, రెవిన్యూ అధికారులు గానీ ఎప్పుడు అభ్యన్తరం తెలపలేదు. అకస్మాత్తుగా మే 10న మున్సిపల్ అధికారులు పొద్దున 3 గంటల ప్రాంతంలో కరెంట్ కట్ చేసి దాదాపు 40 జేసీబీలు, 100 మంది పోలీసులతో ఆ ప్రాంతానికి వచ్చి ప్రజలు నివాసం ఉంటున్న 500 కి పైగా ఇళ్లను కూలగొట్టారు. అంత మంది పోలీసులను, రెవిన్యూ సిబ్బందిని చూసి భయ పడ్డామని చీకట్లో అసలు ఏమి అవుతుందో తమకు అర్ధం కాలేదని బాధితులు మా కమిటీకి తెలిపారు.
కొంత మంది అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్లని ఇంటి నుండి ఈడ్చుకు వచ్చి, నానా బూతులు తిట్టుకుంటూ, మహిళలు, వృద్దులు అనే విషయం చూడకుండా చాలా దుర్మార్గం గా పోలీసులు దాడి చేశారని బాధితులు మా కమిటీ కి తెలిపారు. ఇంట్లో ఉన్న సామాగ్రి కూడా బయటికి తీసుకపోనివ్వకుండా వాళ్ళ ప్రైవేట్ ఆస్తిని కూడా ధ్వంసం చేసారు. ఈ ప్రక్రియలో పాల్గొన్న పోలీసులలో ఒక మహిళా పోలీసు కూడా లేదు. వీడియో తీసుకునే ప్రయత్నం చేసిన ప్రజలని అడ్డుకున్నారు, కొంత మంది ప్రజలు ఆత్మాహుతి దాడికి పాలుపడతాం అని బెదిరించడం తో ఒక్కటి ఆరా ఇళ్లను వదిలిపెట్టారు. 2-3 ఏళ్ళ నుండి ఇల్లు కట్టుకుంటున్నా కూడా ఏనాడూ నోటీసులు ఇవ్వని మున్సిపల్ అధికారులు హఠాత్తుగా ఇంతటి దుశ్చర్యకు పాలుపడడం చాలా అన్యాయం, చట్ట విరుద్ధం అని ప్రజలు మాతో అన్నారు. నోటీసులు లేకుండా కూల్చివేత ఎలా చేస్తారు అన్న ప్రశ్నకు ఎవరో కొందరు కంప్లైంట్ చేసారు అని అందుకే కూల్చామని పత్రికలకు ప్రభుత్వ అధికారులు చెప్పడం విడ్డూరం. ఈ ప్రాంతంలో లో పెద్ద, పెద్ద లే ఔట్లు, కాలనీలు వచ్చాయి. ఎప్పుడు లేంది అధికారులు, పోలీసులు, చట్ట వ్యతిరేకంగా పేదల ఇళ్ల పై పడి విధ్వంసం చేశారని మేము గుర్తించాం. రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ల తగాదాలు ఉన్నట్టు, భూముల ధరలు బాగా పెరుగడం తో రాజకీయ ప్రాబల్యం ఉన్న నాయకులు దీని వెనుక ఉన్నట్టు ప్రజలు అంటున్నారు. అసలు ఈ సర్వే నంబర్లలో భూములు ప్రభుత్వ భూములు కాదు. ప్రభుత్వ అంగాలైన పోలీసులకు, రెవిన్యూ శాఖ కు ఆ భూముల పై అధికారం లేనే లేదు. కొంత భూమి పై కోర్టు లో కేసు నడుస్తూ ఉంది. ప్రైవేట్ సంస్థలు గా అధికారులు వ్యవహరించిన తీరుపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించాలి. ప్రైవేట్ భూ సమస్యల పై పోలీసులు అస్సలు జోక్యం చేసుకోవద్దని ఎన్నో సార్లు కోర్టులు ఆదేశాలు ఇచ్చిన విషయం మేము పోలీసు శాఖకు గుర్తు చేస్తున్నాం . ఎలాంటి నోటీసులు లేకుండా ప్రజల నివాసాలను కూల్చి వేసి, వారి నివాస హక్కులకు భంగం కలిగించిన అధికార్ల పై చర్య తీసుకోవాలి.
గూడు లేక బ్రతుకుతున్న ప్రజలకు వెంటనే తాత్కాలిక ఆశ్రయం కల్పించాలి
నోటరీ ద్వార డబ్బులు పెట్టి భూమిని కొనుగోలు చేసిన ప్రజల భూములను ప్రభుత్వం చొరవ తీసుకోని జీ ఓ నెంబర్ 58, 59 ప్రకారంగా క్రమబద్దీకరణ చేసి పట్టాలు ఇవ్వాలి కూల్చివేత అప్పుడు జరిగిన అస్థి నష్టాన్నీ అంచనా వేసి ప్రభుత్వమే బాధ్యత వహించి తగు నష్ట పరిహారం చెల్లించాలి. ఈ సంఘటన పై జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన చేయాలి ఈ నివేదిక ను మా సంస్థ ముఖ్య మంత్రి కార్యాలయానికి, చీఫ్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ కి అందచేసి విచారణ కోసం వత్తిడి చేస్తుంది. బాధితుల తరుపున నిలబడుతుంది, వాళ్లకు న్యాయ సహకారాన్ని అందిస్తుంది.
– మానవ హక్కుల నిజనిర్దారణ బృందం.
ఎస్. జీవన్ కుమార్ (ఉభయ రాష్ట్రాల సమన్వయకర్త),వి. బాలరాజ్ (జంట నగరాల అధ్యక్షుడు), సంజీవ్ (జంట నగరాల ప్రధాన కార్యదర్శి),శ్రీకాంత్, సంధ్య, సురేష్ బాబు, శ్యామ్ సుందర్, రోహిత్ (జంట నగరాల సభ్యులు)