Take a fresh look at your lifestyle.

‌క్షీణిస్తున్న తెలుగు భాషా వైభవం

తెలుగంటే శ్వాస, తెలుగంటే  హృదయ స్పందన,తెలుగంటే చలనం,తెలుగు మాట్లాడడం ఒక వరం.తేనె లోలికే తెలుగు వద్దనడం దౌర్భాగ్యం.తెలుగు బడిలో తెలుగు అక్షరం మాయమైతే,అమ్మ ఒడిలో తప్పిపోయిన బిడ్డ గతే.తెలుగు భాష అతి మృదు మథురమైన భాష.తేనెలొలికే తేటగీతితో,ఆహ్లాదంగా సాగే ఆటవెలదితో,పలుఉపమానాలతో, ప్రాసలతో అలంకారాలతో, అష్టావధాన,శతావధాన  ప్రక్రియలతో భాషకు జీవం పోసే చతురోక్తులతో,నానార్ధాలతో, పలు వ్యాకరణాంశాలతో విరాజిల్లిన తెలుగు భాషా సోయగం ఆంగ్ల భాషా విస్తరణతో అడుగంటి పోవడం బాధాకరం.

ప్రపంచీకరణ ప్రభావం తెలుగు భాషకు శాపం లా మారింది. ఆంగ్ల భాషా ప్రభావం  ఎంతగా విస్తరించినా ఇతర రాష్ట్రాల ప్రజలు వారి మాతృభాషను విస్మరించలేదు-విమర్శించనూ లేదు. అయితే మనం మాత్రం పరభాషా వ్యామోహంతో’’ తెలుగు’’ భాషకు తెగులు పుట్టించి, అధోగతి పాలు చేస్తున్నాం. బ్రతుకు దెరువుకు ఆంగ్ల భాష ఎంత అవసరమో ఎలా బ్రతకాలో నేర్పే తెలుగు కూడా అంతే అవసరం. కళాశాల స్థాయిలో ఆంగ్ల మాధ్యమం అవసరమే. కాని పదవ తరగతి వరకైనా తెలుగును కొనసాగిస్తే భాష బ్రతుకుతుంది. భాషను ఎంచుకునే హక్కు విద్యార్థులకే ఉండాలి.అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కనీసం రెండు,మూడు పాఠ్యాంశాలు తప్పని సరిగా తెలుగు లోనే బోధించాలి.

ధనిక,పేద విద్యార్దులనే తారతమ్యం లేకుండా తెలుగును అందరికీ తప్పనిసరి చేయాలి. ఆంగ్ల పాఠ్యాంశాలను కొంత వరకైనా కుదించి, ఆ స్థానంలో అదనంగా తెలుగు పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలి. ఆంగ్ల భాషను అందరికీ అందుబాటులోకి తేవడం తో పాటు మాతృభాషకు విశేష ప్రాధాన్యాన్ని కల్పించాలి. తెలుగు భాష మాట్లాడితే చులకనై పోతామన్న భావ దారిద్య్ర  ధోరణి దారుణం. ఇతర రాష్ట్రాల్లోని ప్రజలు వారిభాషకిస్తున్న  ప్రాధాన్యతను మనం అవగాహన చేసుకోవాలి.

ప్రాచీన భాష హోదా సంపాదించుకున్న తెలుగుభాషను గౌరవించడమంటే మన మాతృమూర్తి ని గౌరవించుకున్నట్లే కాగలదు. ఆంగ్ల భాషను నేర్చుకుంటూనే, ఆంధ్ర భాషా వికాసానికై పాటుపడాలి. మాతృభాషను పారద్రోలడమంటే మనం కూర్చున్న కొమ్మను మనం నరుక్కున్నట్టే, విలువైన ప్రాచీన సంపదను కోల్పోయినట్టే. ఇకనైనా  భావ దారిద్యం విడనాడాలి. తెలుగు భాషా వికాసానికై పాటు బడాలి.

-సుంకవల్లి సత్తిరాజు                              
మొబైల్‌ ‌నెంబర్‌: 9704903463.
‌సంగాయగూడెం,(నూతన తూ.గో.జిల్లా)
ఆంధ్ర ప్రదేశ్‌.

Leave a Reply