Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్‌లో తరాల మధ్య అంతరం…. అదే సంక్షోభానికి కారణం

కాంగ్రెస్‌ ‌పార్టీలో తరాల మధ్య అంతరం చాలా కాలంగా కొనసాగుతోంది. అది ఇప్పుడు బహిర్గతం అయింది. సీనియర్లు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన లేఖను ఆ కోణం నుంచే చూడాల్సి ఉంది. యువతరం అంతా పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ ‌గాంధీని సమర్థిస్తుండగా, పాత తరం వారు సోనియాగాంధీయే పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగాలని కోరుతున్నారు. ఆమె అనారోగ్యం బారిన పడకుండా ఉంటే మరి కొంత కాలం ఆమె పార్టీకి నేతృత్వం వహించి ఉండేవారు. కానీ, ఈ మధ్య ఆమె ఆరోగ్యం అసలు ఏమాత్రం సహకరించడం లేదు. తరచుగా ఢిల్లీలోని గంగారామ్‌ ‌హాస్పిటల్‌కి వెళ్ళి చెక్‌ అప్‌ ‌చేయించుకోవడం, అవసరమైతే రెండు మూడు రోజులు అక్కడే ఉండి రావడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీని నడిపించే నాయకుడు లేకపోవడంతో దిశా నిర్దేశనం కొరవడటం, పార్టీ వేదిక అయిన కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ సమావేశం ఏర్పాటు కాకపోవడం వల్ల సీనియర్లు తమ అసంతృప్తిని వెళ్ళ గక్కేందుకు వేరే అవకాశం లేక సోనియాకు లేఖ రాశారు. అయితే, ఆ లేఖ ఎలా లీక్‌ అయిందనేది పార్టీ అధిష్ఠానాన్ని వేధిస్తున్న అంశం. పార్టీ అధ్యక్షురాలికి రాసిన లేఖపై సంతకం చేసిన వారిలో ఎవరైనా దానిని బయట పెట్టి ఉండవచ్చన్న అనుమానం వ్యక్తం అవుతోంది. రాహుల్‌ ‌గాంధీకి కోపం తెప్పించిన అంశం ఇదే. పార్టీ అధ్యక్షురాలు అస్వస్థతగా ఉన్న సమయంలో ఇలాంటి లేఖలను బయట పెట్టడం ఏ విధంగా సమంజసమని ఆయన ప్రశ్నించారు. అంతటితో ఆయన ఊరుకుంటే సమస్య ఉండేది కాదు.

కొందరు నాయకులు బీజేపీ నాయకులతో కుమ్మక్కయ్యారంటూ రాహుల్‌ ‌చేసిన ఆరోపణపై కపిల్‌ ‌సిబాల్‌, ‌గులామ్‌ ‌నబీ ఆజాద్‌ ‌వంటి సీనియర్లు స్పందించిన తీరు అర్థం చేసుకోదగినదే. వారు పేర్కొన్నట్టు మూడు దశాబ్దాలుగా పార్టీని ముఖ్యంగా గాంధీ కుటుంబాన్ని నమ్ముకుని, అనేక క్లిష్ట సమయాల్లో పార్టీ తరఫున కోర్టులలో వ్యాజ్యాలను విజయవంతంగా ఎదుర్కొన్న నాయకులకు ఆమాత్రం కోపం రాకుండా ఉండదు. ముఖ్యంగా, కపిల్‌ ‌సిబాల్‌ ‌పేర్కొన్నట్టు పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వైరి వర్గాలను ఒక తాటిపై తీసుకుని రావడంలో సీనియర్ల పాత్ర విస్మరించలేనిది. ముఖ్యంగా, ఇటీవల రాజస్థాన్‌లో చోటు చేసుకున్న పరిణామాల్లో అసమ్మతి వర్గం నాయకుడు సచిన్‌ ‌పైలట్‌కి నచ్చజెప్పి ఆయన తిరిగి పార్టీలో కొనసాగేట్టు చేసేందుకు సిబాల్‌ ఎం‌తో కృషి చేశారు. అలాగే, గులామ్‌ ‌నబీ ఆజాద్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నాయకుడే కాకుండా, ఆయనను ట్రబుల్‌ ‌షూటర్‌గా అభివర్ణిస్తుంటారు. తెలంగాణలో తెలంగాణ కాంగ్రెస్‌ ‌నాయకులందరిని ఏకతాటిపై నడిపించడంలో ఆయన సమర్థవంతమైన పాత్ర పోషించారు, ఇప్పటికీ పెక్కు రాష్ట్రాల పార్టీ శాఖల్లో వివాదాలు ఏర్పడినప్పుడు మధ్యవర్తిత్వానికి సోనియా ఆజాద్‌నే పంపిస్తుంటారు. కాశ్మీర్‌ ‌మాజీ ముఖ్యమంత్రి అయిన ఆజాద్‌ ‌బీజేపీతో రాజీలేని పోరాటం సాగిస్తున్నారు. కాశ్మీర్‌ ‌మాజీ ముఖ్యమంత్రులను గృహనిర్బంధంలో ఉంచినప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్‌ ‌షాలపై నేషనల్‌ ‌కాన్ఫరెన్స్, ‌పీడీపీ నాయకుల కంటే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది ఆయనే. అయితే, రాష్ట్రంలో పరిస్థితులను బట్టి ఆయన నేషనల్‌ ‌కాన్ఫరెన్స్, ‌పీడీపీ నాయకులతో కలిసి పని చేయాల్సి వచ్చింది. వారు కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడినవారే.

సచిన్‌ ‌పైలట్‌ ‌బీజేపీ నాయకులతో మంతనాలు సాగించారని రాజస్థాన్‌ ‌వివాదం కొనసాగుతున్న రోజుల్లో రాహుల్‌ ఆరోపించారు. సచిన్‌ ‌వెనక పార్టీ సీనియర్‌ ‌నాయకులైన కపిల్‌ ‌సిబాల్‌, ఆజాద్‌లు ఉన్నారన్నది రాహుల్‌ అనుమానం మాత్రమే. సచిన్‌ ‌రాహుల్‌కే సన్నిహితుడు. అలాగే . మధ్యప్రదేశ్‌లో తిరుగుబాటు బావుటా ఎగుర వేసిన జ్యోతిరాదిత్య సింధియా కూడా గత పార్లమెంటు సమావేశాల్లో రాహుల్‌ ‌పక్కనే కూర్చుని ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగారు. ఆయన పార్టీ నుంచి వైదొలగడానికి కారణం ఆ రాష్ట్రంలో(మధ్యప్రదేశ్‌లో) సీనియర్‌ ‌నాయకులైన దిగ్విజయ్‌ ‌సింగ్‌, ‌కమలనాథ్‌లు జ్యోతిరాదిత్యను అవమానించడమే. జ్యోతిరాదిత్యకు పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని(ముఖ్యమంత్రి పదవిని) ఇప్పించేందుకు రాహుల్‌ ‌చివరి దాకా ప్రయత్నించారు. రాజస్థాన్‌లో సచిన్‌ ‌పైలట్‌ని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చో బెట్టేందుకు రాహుల్‌ ఈ ‌మధ్య చాలా ప్రయత్నం చేశారు. రాహుల్‌ ‌పార్టీ విషయాలలో క్రియాశీలంగా వ్యవహరించకుండా, తమ రాష్ట్రాల్లో జూనియర్‌ ‌నాయకులను ఉసిగొల్పుతున్నారన్న అనుమానం సీనియర్‌ ‌నాయకులకు ఉంది. రాహుల్‌ ‌పూర్తి బాధ్యతలను తీసుకుని పార్టీని నడిపిస్తే తమకు అభ్యంతరం లేదని సీనియర్‌ ‌నాయకులు బహిరంగంగానే ప్రకటించారు. మధ్యలో జోక్యం చేసుకుంటుండటంతో వారు అసంతృప్తితో ఉన్నారు.

ఇలాంటి వారంతా సోనియాగాంధీని కలిసి వ్యక్తిగతంగా తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఆమె ఇప్పుడు ఇరువర్గాలకూ సర్ది చెప్పే పరిస్థితిలో లేరు. ఆమె పార్టీ అధ్యక్ష పదవిని అలంకార ప్రాయంగా నిర్వహిస్తున్నారే తప్ప దైనందిన వ్యవహారాలను నడిపించే స్వస్థత కలిగి లేరు. ప్రియాంకను క్రియాశీలక బాధ్యతలను చేపట్టాలని పార్టీలో ఓ వర్గం గట్టిగా కోరుతోంది. అయితే, రాహుల్‌ని కాదని తాను ఏ పదవినీ చేపట్టబోనని ఆమె ఇటీవల స్పష్టంగానే ప్రకటించారు. పార్టీ పగ్గాలు గాంధీ కుటుంబం చేతుల్లోనే ఉండాలని అధిక సంఖ్యాకుల అభిమతం. దక్షిణాదికి చెందిన శశి థరూర్‌కి నాయకత్వం అప్పగించాలని యువతరం ప్రతినిధులు లాబీయింగ్‌ ‌చేస్తున్నారు. కానీ, ఆయన నాయకత్వాన్ని కేరళకు చెందిన ఆంటోనీ వంటి సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. ఆంటోనీ సోనియాకు వీరవిధేయుడు. ఈ నేపథ్యంలో పార్టీలో ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభాన్ని టీ కప్పులో తుపానుగానే భావించాలి. సోనియానే అధ్యక్షురాలిగా కొనసాగిస్తూ, పార్టీని నడిపించగల క్రియా శీల నాయకుని కోసం అన్వేషణ కొనసాగుతోంది. రాహుల్‌ ‌తన పద్దతి మార్చుకుంటే ఆయన నేతృత్వంలో పని చేయడానికి అంతా ఒప్పుకోవచ్చు. రాహుల్‌ ‌క్రియా శీలంగా వ్యవహరించకపోవడం వల్లనే ప్రస్తుత సంక్షోభం తలెత్తింది.

Leave a Reply