“మహాత్ముడు మొదటి నుంచీ దేశ విభజనను వ్యతిరేకిస్తూ వచ్చాడు. కాని, ఆయన ఆయన అనుచరులు అనివార్యమైన ఈ కార్యక్రమానికి మౌన ప్రేక్షకులయ్యారు. ‘నా మాట ఎవరు వింటారు? అయినా నా మాట ఎవరెందుకు వినాలి?’ అంటూ తనను తానే బాపూజీ సాంత్వన పర్చుకున్నాడు. చాలామందికి తెలియని విషయమేంటంటే 1947 ఆగస్టు 15న గాంధీజీ వేడుకలు జరుపుకోలేదు. ఏముంది వేడుకలు జరుపుకోవడానికి, మూర్ఖు స్వర్గంలో జీవిస్తున్నామని మౌనంగా బాధపడ్డాడు.”
గాంధీ తను చేసినవన్నీ నిజంగానే చేశాడని ముందు తరాలవారు నమ్మడం కష్టమేనంటాడు ఐన్‌స్టీన్. తను మరణించి డెబ్బయి ఏళ్ళు దాటిన తర్వాత ఇప్పుడు కూడ ఆయన నిష్కపటతకు, బుద్ధి కుశలతకూ, సాహసికతకూ చిరపరిచితమైన పర్యాయపదం. జనసామాన్యంలో ఆయన గురించి ఉన్న కల్పన ఆయనలోని అసలు మనిషికి ముసుగుకప్పింది. భారతదేశ సుదూరప్రాంతాలలో సైతం అణిచివేతకు వ్యతిరేకంగా నిర్భయంగా, నిస్వార్థంగా, అహింసాయుతంగా పోరాడే ప్రతి ఒక్కరిని గాంధీజీతో పోల్చడం చూస్తున్నాం. అలాగే, భారత్‌లో 1984, 1992, 2002 నాటి మారణకాండల సందర్భంలో జరిగినట్టుగా అమాయకులపై అంతులేని హింసను, పీడనను రుద్దుతున్నవారిని గాంధీ నూతన హంతకులుగా చెప్పొచ్చు. అసలు గాంధీ ఎవరు? ఆయన ఎందరికి అర్థమయ్యాడు? ఆయన మామూలు మనిషా?.. మహాత్ముడా? ఎంతో తెలిసినవాడిలా, మన ఊహకు అందేవాడిలా కనిపించే ఆ మహామనిషి మనల్ని పూర్తిగా పక్కదారి పట్టించే గాంధీ కావచ్చు. ఆ అసలు మనిషి నమ్మకాలు, ఆయన నమ్మినవిగా మనం భావించే నమ్మకాలకు పూర్తి భిన్నమైనవి కావచ్చు. ఒక శతాబ్దపు అంత:కరణగా పరిణమించి, భారతదేశాన్ని స్వాతంత్య్రం వైపు నడిపించిన పిరికి కుర్రాడు కావచ్చు. ఇంతకీ ఎవరు? ఈ సత్యాగ్రహ ఆవిష్కర్త… ప్రతి ఒక్కరి కన్నీరు తుడవాలని కోరుకున్న ఈ వ్యక్తి, మతబాహుళ్యవాదానికి మార్గదర్శి, ఆధునికతపట్ల అసమ్మతివాది అనిపించుకున్న ఈ మనిషి తన దైనందిన జీవితంలో తన సన్నిహితులతో ఎలా ఉన్నాడు? ఇంతకీ ఈయన రాజకీయవాదా? లేక సాధువా? ఒకవేళ ఆయనలో ఉభయులూ ఉన్నారనుకుంటే, ఆ ఇద్దరు గాంధీలను ఆయన ఎలా, ఎన్ని పాళ్ళల్లో మేళవించాడు? లేక, కొందరు విమర్శకులు ఆరోపించినట్టు, తన ప్రాణాలైనా బలి పెడతాను తప్ప దేశ విభజన ఆమోదించనన్న తన ప్రతిజ్ఞను భంగపరిచిన వ్యక్తిగా ఆయనను భావించాలా? భర్తగా, తండ్రిగా ఆయన సహజానుభూతులు లోపించినవాడా? బ్రహ్మచర్యం పేరుతో విచిత్ర ప్రయోగాలకు దిగిన వ్యక్తా? అహింస పేరుతో ఆయన భారతదేశాన్ని నిర్వీర్యం చేశాడా? దళితులను సాధికారులను చేసే బదులు వారిని ఆశ్రితవర్గంగా మార్చడానికి ప్రయత్నించాడా?.
గాంధీజీ ఒకసాధారణ విద్యార్థిగానే ఇంగ్లండ్ వెళ్ళాడు. తన మేధస్సుకు మెరుగులు దిద్దుకున్నాడు. అక్కడ శాఖాహారిగా ఉంటానని తన తల్లికి చేసిన వాగ్దానం ఎప్పుడూ గుర్తుంచుకునేవాడు. హెన్రీసాల్ట్ రచించిన ‘ఏ ప్లీ ఫర్ వెజిటేరియనిజం’ మరియు హోవార్డు విలియం రచించిన ‘ఎథిక్స్ ఆఫ్ డైట్’ పుస్తకాలు ఆయనపై తీవప్రభావాన్ని చూపి ఆయన జీవితాంతం నిఖార్సైన శాఖాహారిగా ఉండటానికి దోహదపడ్డాయి. న్యాయ విద్యార్థిగా ఉన్న సమయంలోనే హిందూ పవిత్ర గ్రంథాలతో పాటుగా బైబిల్, ఖురాన్ గ్రంథాలను చదివాడు. అనిబిసెంట్ రచించిన ఽహౌ ఐ బికేం ఏ థీయిస్ట్’’ గ్రంథం చదివి దైవభక్తిని పెంపొందించుకున్నాడు. తన జీవితాన్ని సమాజసేవకే అంకితం చేయదలుచుకున్న గాంధీజీకి వజ్రాల వ్యాపారి రాయ్ చంద్ భాయితో పరిచయం ఒక మేలి మలుపు. బ్రహ్మచర్య జీవితాన్ని గడపడానికి రాయ్‌చంద్ భాయి గాంధీలో స్ఫూర్తిని నింపాడు. 1909 చివరలో తన నలభయ్యో ఏట తాను జీవితాంతం బ్రహ్మచర్య దీక్ష చేపడతానని, అందుకు సహకరించవలసిందిగా తన భార్యను కోరాడు. రాయిచంద్ భాయి, లియోటాల్ స్టాయ్, ఆర్నాల్డ్ రస్కిన్లు గాంధీజీని తీవ్రంగా ప్రభావితం చేసిన వ్యక్తులు. ఆయన ఎప్పుడూ వీరిని తన ఆధ్యాత్మిక గురువులుగా భావించాడు. రాయిచంద్ దైవచింతనలో ఉండడం ఎలాగో గాంధీజీకి అవగతపరిచాడు. దేవుని రాజ్యం మనిషిలోనే ఉందన్న టాల్‌స్టాయ్ బోధనలు దైవం పట్ల గాంధీజీకి ఆసక్తిని పెంచాయి. రస్కిన్ బాండ్ గ్రంథం ఽఅంటు ది లాస్ట్’’ మహాత్ముణ్ణి మానవతావాదిగా మారేందుకు దోహదపడింది. భారత రాజకీయాలలో ఆయన రాక స్వాతంత్య్రోద్యమంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికింది. జనసమూహాన్ని ఆకర్షించడంలో ఆయనకు ఆయనే సాటి. గాంధీజీ మొదటిసారిగా దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షతను ఎదుర్కొన్నాడు. డర్బన్ కోర్ట్‌లోని యూరోపియన్ మాజిస్ట్రేట్ గాంధీని తన తలపాగ తీయవలసిందని ఆదేశించగా, అందుకు ఆయన తిరస్కరించాడు. ప్రిటోరియా వెళ్తుండగా తెల్లవాళ్ళు ప్రయాణించే కంపార్ట్మెంట్లో ఎక్కినందుకు తనను సెయింట్ మారిట్జ్ బర్గ్ రైల్వేస్టేషన్లో బలవంతంగా రైలు దించడం ఆయన ఎప్పుడూ మర్చిపోలేదు. దక్షిణాఫ్రికాలో పనిచేసే చాలామంది ఒప్పంద కార్మికులు భారతీయులే. వారందరూ తెల్లవారి చేతిలో బానిసలలాగా జీవించవలసి వచ్చేది. ఎటువంటి హక్కులు లేకుండా హీనంగా చూడబడేవారు. అక్కడి నేటాల్ ప్రభుత్వం భారతీయులకు ఓటుహక్కును తొలగించే ప్రయత్నం చేసినప్పుడు ఎటువంటి సంశయం లేకుండా భారతీయులకు హక్కులు కల్పించేందుకు గాంధీజీ ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమైనాడు.
ఽమన ప్రపంచం ఎప్పుడూ హింసతో నిండిపోవలసిందేనా? పేదరికం, ఆకలికేకలు ప్రపంచాన్ని శాసించవలసిందేనా? అందరిచే సమ్మతమైన ఒక మతం ఈ లోకంలో ఉండాల? లేక దేవుడే లేని సమాజంగా మిగలవలసిందేనా? సమాజంలో మార్పు తేవడం ఎలా? యుద్ధం తోనా? విప్లవాలతోనా? లేదా శాంతియుతంగానా? రేపటి ప్రపంచం అహింసా సూత్రంతో నడిచే సమాజమై ఉండాలి. సమాజంలో మార్పు తేవడం ఎలా? యుద్ధం తోనా? విప్లవాలతోనా? లేదా శాంతియుతంగానా? రేపటి ప్రపంచం అహింసా సూత్రంతో నడిచే సమాజమై ఉండాలి. ఇదే ప్రాథమిక సూత్రం. ఇది చేధింపలేని లక్ష్యంగా కనపడవచ్చు. కార్యాచరణకు నోచుకోని మాయవాదంలా అనిపించనూ వచ్చు. కాని అహింస ఎక్కడైనా ఫలిస్తుంది. వ్యక్తిగతంగా, సమాజాలుగా, దేశాలుగా అందరూ అహింసను ఆమోదించవలసిందే. ఽరేపటి ప్రపంచంలో పేదరికం, యుద్ధాలు, రక్తపాతం ఉండకూడదు’’. అంతేకాకుండ ఆ ప్రపంచంలో గతంలో కంటే గాఢమైన దైవభక్తిని ప్రపంచ ప్రజలు పెంపొందించుకోవాలి. ఒక సమాఖ్య ప్రపంచం కేవలం అహింస పునాదుల మీదనే నిర్మించబడుతుంది. సమాజం నుంచి హింస పూర్తిగా నిర్మూలించబడవలసిందే. ఽఅంటూ గాంధీజీ ఒక ఉన్నతమైన ప్రపంచ నిర్మాణానికి పిలుపునిచ్చాడు. ఇది మహాత్ముని జీవితంలోకి శూలశోధన చేయవలసిన సమయం కాదు, కాని ఆయన జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకోవలసిన సమయం. ఆయన జీవితం తేదీలు, సంఘటనలమయమే కాదు, ఆయనే ఎన్నోసార్లు చెప్పినట్లు ఆయన జీవితమే ఒక సందేశం. నేటి సమాజానికి గాంధీజీ జీవితం ఏ విధంగా ఆపాదించుకోవాలో ఆలోచించుకోవలసిన సమయమిది. గాంధీ జీవితమే ఒక యజ్ఞం. ఆయన ప్రతిక్షణం, ప్రతీశ్వాస, ప్రతీచర్య ఆయన విశ్వాసాలను, నమ్మకాలను నొక్కిచెబుతాయి. ఆయన ప్రజలకు, దేశానికి సేవకుడిగా ఉండేందుకే నిర్ణయించుకున్నాడు. జీవితమంతా నిరంతరాయంగా పోరాడుతూ భరతమాతకు స్వేచ్ఛ వాయువులందించాడు. మహాత్మాగాంధీ జీవితం సమాజానికి సేవ చేయడమంటే దేవుని సేవ చేయడమనే అంశాన్ని నొక్కి చెబుతుంది. భగవద్గీత ఆయనకు సాదాకాలంగా తోడుగా నిలిచింది.
ఆయన నమ్మిన అతిగొప్ప మార్గదర్శి.
ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా ఎట్టకేలకు స్వాతంత్య్రం సిద్ధించింది. ఇది కేవలం నాణానికి ఒకవైపు మాత్రమే. అఖండభారతంలో మరోభాగం ఖండితమై పాకిస్తాన్ అనే కొత్త దేశం అవతరించింది. విభజన శాంతియుతంగాలేదు. శాంతిని కలిగించనూలేదు. విభజన విరజిమ్మిన రక్తపాతం దేశమంతా వ్యాపించింది. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొమ్మీలు దేశమంతా సర్వసాధారణమయ్యాయి. మతఘర్షణలు మూలమూలనా భయాందోళనలు కలిగించాయి. మహాత్ముడు మొదటి నుంచీ దేశ విభజనను వ్యతిరేకిస్తూ వచ్చాడు. కాని, ఆయన ఆయన అనుచరులు అనివార్యమైన ఈ కార్యక్రమానికి మౌన ప్రేక్షకులయ్యారు. ‘నా మాట ఎవరు వింటారు? అయినా నా మాట ఎవరెందుకు వినాలి?’ అంటూ తనను తానే బాపూజీ సాంత్వన పర్చుకున్నాడు. చాలామందికి తెలియని విషయమేంటంటే 1947 ఆగస్టు 15న గాంధీజీ వేడుకలు జరుపుకోలేదు. ఏముంది వేడుకలు జరుపుకోవడానికి, మూర్ఖు స్వర్గంలో జీవిస్తున్నామని మౌనంగా బాధపడ్డాడు. మువ్వన్నెల జెండాల సొగసుతో, దేదీప్యమానంగా వెలిగే దీపాలంకరణలతో ఢిల్లీ నగరం అంగరంగ వైభవంగా వెలిగిపోతుంటే, గాంధీజీ మాత్రం రక్తసిక్తమైన నౌఖాలి వీధులలో పాదరక్షలు లేకుండా నడక సాగించాడు. ఽమతఘర్షణలు జ్వాలలు దేశాన్ని నిలువునా కాల్చేస్తుంటే నవీన భారతం ఎలా మనుగడ సాగిస్తుందని ప్రశ్నించాడు. దేశమంతా స్వాతంత్య్ర సంబరాలలో మునిగి తేలుతూంటే గాంధీజీ మాత్రం ముస్లిం లీగ్ నాయకుడైన సుహ్రవర్ది నివాసంలో హిందూ ప్రజల కష్టాలను విన్నాడు. ఒకరంటే ఒకరికి భయం కలిగే భయోత్పాత వాతావరణంలో గాంధీజీ ఒక ముస్లిం లీగ్ నాయకుడు ఒకే పైకప్పు కింద నివసించడం సాధ్యమని నిరూపించాడు. బాధితుల ఆగ్రహపూరిత ప్రశ్నలకు సమాధానం చెబుతూ దాదాపు వారం రోజులు అక్కడ ఉన్నాడు. తానిక్కడకు వచ్చింది కేవలం ముస్లింలకు సేవ చేసేందుకే కాదు, హిందువులకు కూడా అంటూ తన నిష్పక్షపాతాన్ని నిర్మొహమాటంగా ప్రకటించాడు. తనను హిందూ వ్యతిరేకిగా చిత్రించడంలో ఆంతర్యమేంటని ఆవేదన చెందాడు. తనను తాను హిందూ వ్యతిరేకిగా అంగీకరించనన్నాడు.
ఒక పిచ్చివాడి చేతిలో బుల్లెట్లతో తాను చంపబడవచ్చు. దానిని నవ్వుతో ఎదుర్కోవాలి. వాడిపై తనకే విధమైన కోపం ఉండకూడదు. దేవుడు తన హృదయంలో, ఆయన నామం తన పెదవులపై ఉండాలని తన హత్యకు రెండు రోజులముందు మహాత్ముడు చెప్పాడు. నిజానికి గాంధీజీపై అంతకుముందే నాలుగుసార్లు హత్యాయత్నాలు జరిగాయి. మొదటిది, 1934లో పుణలో జరిగిన సమావేశంలో గాంధీజీ ప్రసంగిస్తుండగా దుండగులు బాంబులు విసిరి పారిపోయారు. ఈ కుట్రకు సంబంధించిన రికార్డులుగాని, ఇతరత్ర ఆధారాలుగాని లభ్యం కావడం లేదు. రెండోది, 1944 మే నెలలో జరిగింది. నాథూరాం గాడ్సే నేతృత్వంలో పంచగనీలో జరిగిన ఈ హత్యాయత్నంలో గాంధీజీ తృటిలో తప్పించుకున్నాడు. మూడోది, 1944 సెప్టెంబర్ నెలలో బొంబాయిలో జరిగింది. నాలుగోది, 1948 జనవరిలో మదన్‌లాల్ పహ్వ, విష్ణు కర్కరే జరిపారు. చివరిప్రయత్నం 1948 జనవరి 30న జరిగింది. నాథూరాం గాడ్సే చేతిబుల్లెట్లకు మహాత్ముడు నేలకొరిగాడు. దేశం దు:ఖ సాగరంలో మునిగిపోయింది. ఽఇంతటి మహిమాన్విత మరణం ఎవరూ పొందలేదు. తన రామునితో మాట్లాడేందుకు మహాత్ముడు మనలని వదిలి వెళ్ళిపోయాడు. వైద్యులు, సేవకుల కోసం ఆయన అంగలార్చలేదు. అనారోగ్యంతో తనువు చాలించలేదు. కూర్చుని కాదు, నిలబడి మరణించాడు’’ అని గాంధీజీ హత్యోదంతంపై రాజగోపాలాచారి విలపించాడు. ఽశతాబ్దాలు గడిచినా, యుగాలు మారినా భూమి ఉన్నంత కాలం ప్రజలు మహాత్ముణ్ణి స్మరించుకుంటూనే ఉంటారని’’ పలికిన జవహర్లాల్ నెహ్రూ వ్యాఖ్యలు అక్షర సత్యాలు.
– డాక్టర్ మార్త శ్రీనివాస్
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ,
స్పైసర్ మెమోరియల్ కాలేజ్, పూణే