Take a fresh look at your lifestyle.

టిఆర్‌ఎస్‌ ‌పార్టీ భవిష్యత్‌….?

దశాబ్దకాలం ఉద్యమించి ఒక రాష్ట్రాన్నే ఏర్పాటుచేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) ‌భవిష్యత్‌ ఏమిటన్నది ఇప్పుడు రాష్ట్రంలోనేకాదు, దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉద్యమ పార్టీగా అవతరించి, అనంతరం రాజకీయపార్టీగా మారి గడచిన ఎనిమిదేళ్ళుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ ఇక ముందుకూడా అదే పేరున కొనసాగుతుందా లేక త్వరలో ఏర్పాటు చేయనున్న జాతీయ పార్టీలో పరకాయ ప్రవేశం చేస్తుందా అన్నవిషయంపై రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం విస్తృత చర్చ జరుగుతున్నది. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కొంతకాలంగా జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన విషయం తెలియందికాదు. కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ సారథ్యంలోని ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని కూలదోసి, మరో ప్రత్యమ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న దృఢ సంకల్పంతో ఆయన కొంతకాలంగా బిజెపిని వ్యతిరేకించే పార్టీలు, నాయకులతో సమాలోచన చేస్తున్నారు. బీహార్‌, ‌బెంగాల్‌, ‌కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, జార్ఖండ్‌, ‌కేరళ రాష్ట్రాల్లోని అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులతో విడతల వారీగా మంతనాలు జరుపుతూనే ఉన్నారు.

కెసిఆర్‌ ‌కలిసిన వారంతా బిజెపిని వ్యతిరేకిస్తున్నవారే అయినప్పటికీ, వీరిలో చాలవరకు కాంగ్రెస్‌ను కలుపుకుపోవాలన్న అభిప్రాయంగా ఉన్నారు. అయితే పై రెండు పార్టీలను మినహాయించి థర్డ్ ‌ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలనుకున్న కెసిఆర్‌ )‌క్ష్యం దీంతో నెరవేరకుండా పోయింది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో టిఆర్‌ఎస్‌తో ఎవరు కలిసి వచ్చినా,రాకపోయినా ఎలా ముందుకు వెళ్ళారో ఇప్పుడుకూడా కొత్తగా జాతీయ పార్టీ ఏర్పాటు విషయంలో ఏమాత్రం వెనుకడుకు వేసేదిలేదన్నట్లుగా కెసిఆర్‌ అం‌దుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చకచక చేసుకుంటూ పోతున్నారు. ఇప్పటికే పార్టీ పేరు, జండా, ఎజండాను ఖరారు చేసినట్లు తెలుస్తున్నది. దాన్ని అధికారికంగా ప్రకటించేందుకు ‘దసరా’ సరైన ముహూర్తంగా భావించినట్లు తెలుస్తున్నది. ఆరోజు టిఆర్‌ఎస్‌ఎల్‌పిని సమావేశ పర్చి, సరిగ్గా ఒంటి గంటా పందొమ్మిది నిమిషాలకు జాతీయ పార్టీ పేరు జండా, ఎజండాను ప్రకటిస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఈ విశేషకార్యక్రమంలో బిజెపిని వ్యతిరేకించే వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల ముఖ్యనేతలు హాజరవుతారంటున్నారు. ముందుగా పార్టీ ప్రకటించిన తర్వాతే ప్రతిపక్ష పార్టీలతో కూటమి కట్టే ఆలోచనలో కెసిఆర్‌ ఉన్నట్లుగా ఆ వర్గాలద్వారా తెలుస్తున్నది. దేశ ప్రజలు ప్రధానంగా ఎదుర్కుంటున్న సమస్యలనే ప్రధానాంశంగా తమ ఎజండాలో పొందుపర్చే అవకాశాలున్నాయంటున్నారు. ముఖ్యంగా ప్రజలంతా సస్యశ్యామలంగా జీవించేందుకు కావాల్సిన వనరులన్నీ ఉన్నప్పటికీ వాటిని గత కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వినియోగిం చుకోలేకపోయింది.

ఎనిమిదేళ్ళుగా అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కూడా వాటిని సద్వినియోగంలోకి తేలకపోయిందన్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నది ప్రకటించబోయే జాతీయ పార్టీ ఎజండాలోని ముఖ్యాంశాలుగా ఉండబోతున్నట్లు వినికిడి. అంతేగాక బిజెపియేతర రాష్ట్రాలపైన కేంద్రం సవతితల్లి ప్రేమను కనబరుస్తున్నదన్న విషయాన్ని లెక్కలతోసహా వివరించాలన్న అంశాలను అందులో పొందుపరుస్తున్నట్లు తెలుస్తున్నది. వృధాగా సముద్రంలో కలిసిపోతున్న నీటిని తెలివిగా వినియోగించుకోగలిగితే దేశంలో కరువు ప్రాంతాలే ఉండవన్నది కెసిఆర్‌ ‌మొదటినుండీ చెబుతున్న మాట. అలాగే కావల్సినంత విద్యుత్‌ అం‌దుబాటులో ఉన్నప్పటికీ దాన్ని వాడుకోలేకపోవటం. వ్యవసాయం రంగంలో వినూత్న చట్టాలపేర ఆ రంగాన్ని నష్టపరిచేందుకు కేంద్రం అనుసరిస్తున్న తీరును దేశంలోని రైతాంగానికి అర్థమయ్యే రీతిలో తెలియజెప్పడం, విస్తారంగాఉన్న యువ సంపదను దేశ అభివృద్ధి రంగాల్లో వినియోగించుకోకపోతున్న కేంద్ర నిస్సహాయ చర్యలను వివరించడం తోపాటు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న దళిత బంధు, రైతు బంధు లాంటి సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టాలన్న డిమాండ్‌ ‌ప్రజలనుండి వచ్చే విధంగా వారిని చైతన్యపర్చాలన్నది ఆ ఎజండాలోని ముఖ్యాంశాలుగా ఉండబోతున్నట్లు తెలుస్తున్నది. అయితే దసరారోజున ప్రకటించనున్న ఈ జాతీయ పార్టీ పేరు ఏమై ఉంటుందన్నదే అందరిని ఆలోచింపజేస్తున్నది.

టిఆర్‌ఎస్‌ అన్నది ప్రాంతీయ పార్టీ కావటం వల్ల ఎట్టి పరిస్థితిలో ఆ పార్టీ పేరును జాతీయ పార్టీకి పెట్టే అవకాశంలేదు. అలా అని మరోపేరును ప్రకటిస్తే టిఆర్‌ఎస్‌ ఉనికి ప్రశ్నార్థకంగా మారకపోదు. ఉద్యమ పార్టీగా ఇంతకాలం దానికున్న గుర్తింపు మరుగునపడే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతానికైతే భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌) ‌లేదా భారత రైతు సమితి అన్నపేర్లు ఉండే అవకాశం ఉందని వినిపిస్తున్నది. రెండింటికీ కెసిఆరే సారథ్యం వహిస్తారా? లేక చాలాకాలంగా రాజకీయాల్లో నలుగుతున్నట్లు ఆయన కుమారుడికి టిఆర్‌ఎస్‌ ‌బాధ్యలు అప్పగిస్తారా అన్నది ప్రశ్నగానే ఉంది. బిజెపిని ఎదుర్కునేందుకు ప్రాంతీయ పార్టీలన్నీ ఒక తాటిపైకి రావాలనుకుంటున్నప్పుడు టిఆర్‌ఎస్‌ ‌వేరుగా ఉంటుందా? ఇంతకూ ఇతర రాష్ట్రాలు ఎంతవరకు ఈ కొత్త జాతీయ పార్టీని ఆదరిస్తాయి? యావత్‌ ‌దేశ ప్రజలను కెసిఆర్‌ ఆకట్టుకోగలరా? అన్నిటికన్నా ముఖ్యంగా దక్షిణాదివారి నాయకత్వాన్ని ఉత్తరాదివారు ఏమేరకు అంగీకరిస్తారు? అలాంటప్పుడు దేశంలో ఇప్పుడు జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్న ఎంఐఎం, టిడిపి, ఆప్‌, ‌టిఎంసి, ఎన్సీపిల్లాగ పేరుకే జాతీయ పార్టీగా కొనసాగుతుందా లాంటి ప్రశ్నలకు సమాధానంకోసం దసరా వరకు ఆగాల్సిందే.

Leave a Reply