Take a fresh look at your lifestyle.

సద్విమర్శే విలువలకు పునాది

“దేశంలో పార్లమెంటరీ విధానాన్ని, కార్యనిర్వాహక వ్యవస్థను సక్రమమైన మార్గంలో ప్రయాణించేలా మార్గదర్శనం చేస్తూ, ప్రజలకు ఈ దేశం కల్పించబడ్డ హక్కులను కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఫరిడవిల్ల జేసే గొప్ప బాధ్యతను తన భుజాల మీద మోయాల్సిన అత్యున్నత న్యాయస్థానం తన ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక తీర్పుల వల్ల తన ప్రతిష్టను తనే మసిపూసి మసకబార్చుకుంటున్నది.”

ఎవరు ఏ వృత్తిని చేపట్టినా అందరూ సమాన స్థాయి గౌరవాన్ని పొందడం సాధ్యం కాదు. అది వృత్తి పట్ల వారు చూపే అంకితభావం, బాధ్యతల సమర్ధవంతమైన నిర్వహణపై ఆధారపడి వుంటుంది.సమాజంలో కష్టించి పనిచేసే ప్రతీ వృత్తి గౌరవించద గిందే.సమాజం యొక్క సమిష్టి అవసరాలను తీర్చడానికి ప్రజలు విభిన్న వృత్తుల్లో పనిచేస్తూన్న క్రమంలో ఆయా వృత్తుల సమూహాలను విభిన్న కులాలుగా భిన్న పేర్లతో పిలుస్తున్నారు.ఈ వృత్తులకు భిన్నంగా కుల చట్రం నుంచి బయటపడి సామాజికీక రించబడిన సార్వత్రిక వృత్తులు మరికొన్ని. అందులో సమాజం అత్యంత గౌరవాన్ని కట్టబెట్టిన వాటిలో ఉపాధ్యాయ, వైద్య, న్యాయవాద వృత్తులు ముఖ్యమైనవి. ఏ వృత్తి మీద అయినా లేదా వ్యవస్థ మీద అయినా సమాజం ఉంచిన గౌరవం లేదా విలువ, ఆ వృత్తిని నిర్వర్తిస్తున్న లేదా ఆ వ్యవస్థలో భాగస్వామిగా పనిచేస్తున్న వ్యక్తులందరికీ ఆయాచితంగా దక్కుతుంది అనుకోవడం పొరపాటు. గౌరవనీయ వ్యవస్థలో పనిచేసినంత మాత్రాన తమ వ్యక్తిత్వాలతో, ఆచరించదలిచిన వ్యవస్థ నిర్దేశిత విలువలతో సంబంధం లేకుండానే తమకూ ఆ గౌరవం దక్కాల్సిందేనని ధోరణి బాగా పెరిగిపోవడం దురదృష్టకరం. వ్యక్తి యొక్క ఉన్నతమైన వ్యక్తిత్వంతో, వృత్తిపట్ల అంకితభావంతో, ఏ ప్రలోభాలకు లొంగని నిజాయితీతో కూడిన విలువలను పాటించినప్పుడే వృత్తి మీద ఉండే గౌరవం వ్యక్తికీ దక్కుతుంది.

వ్యవస్థ కంటే తామే ఉన్నతులమని ఆయా వ్యవస్థలలో పనిచేసే వ్యక్తులు భావించడం, ఆ వ్యవస్థ గౌరవానికే కాదు, ఉనికికే ప్రమాదకరంగా పరిణమిస్తుంది. దీనికి ఏ వ్యవస్థ మినహాయింపు కాదు. ప్రజాస్వామిక వ్యవస్థలో పార్లమెంటరీ, కార్యనిర్వాహక వ్యవస్థలతో సరిసమానమైన స్థానాన్ని, రాజ్యాంగ బద్ధంగా పొందినది న్యాయవ్యవస్థ. చట్టసభల్లో రూపొందించబడే నిర్ణయాలను గానీ, ఆ నిర్ణయాల అమలులో కార్యనిర్వాహక విభాగం చేసే ఆచరణను గానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడం, అవి రాజ్యాంగ విలువలకు లోబడి ఉన్నాయా లేదా పరిశీలించడం న్యాయవ్యవస్థ విధి. అంతమాత్రమే కాకుండా ప్రజల హక్కులు, వారి సంక్షేమానికి వ్యతిరేకంగా ఉన్న ఏ నిర్ణయాన్నైనా రద్దు పరచమని ప్రభుత్వాలను అదేశించే గురుతరమైన బాధ్యతను కూడా కలిగి ఉంది. న్యాయవ్యవస్థ చరిత్రలో ఎంతోమంది న్యాయమూర్తులు చట్టసభలతో ఘర్షణలు పడి రాజ్యాంగ వ్యతిరేక విధానాలను రద్దుపరిచే తీర్పులు వెలువరించి రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయడమే కాకుండా, తమ పని విధానంతో తమ పదవికే మరింత గౌరవాన్ని పెంచేలా, ఉన్నత ప్రమాణాలను, ఆదర్శాలను నెలకొల్పారు. కానీ, ప్రస్తుతం వాటిని విస్మరించి గౌరవనీయ స్థానాల్లో ఉన్న వ్యక్తులు కూడా తమను తాము రాజ్యాంగ విలువలకు, లక్ష్యాలకు అతీతులుగా భావించుకోవడం దాని పట్ల ప్రజలకున్న విశ్వసనీయతను ప్రశ్నార్థకంగా మారుస్తుంది. ఇలాంటి సందర్భాల్లో సమాజంలో బాధ్యత గల పౌరులు బాధ్యతలను విస్మరిస్తున్న వ్యక్తులను ప్రశ్నించడం లేదా విమర్శించడం చేస్తే అది వ్యవస్థను ప్రశ్నించడమో, తిరస్కరించడమో లేదా ధిక్కరించడమో ఎంతమాత్రం కానేరదు. ఎందుకంటే వ్యవస్థను ప్రశ్నించడమంటే సైద్ధాంతికంగా విభేదించడం, దానిని అంగీకరించకపోవడం అవుతుంది. అందులో పని చేసే వ్యక్తులను ప్రశ్నిస్తే అది వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని గుర్తుచేయడం అవుతుందే తప్ప వ్యవస్థను కించపరిచినట్లు కాదు. పైగా వ్యవస్థను అమితంగా ప్రేమిస్తూ, దాని ఉన్నతిని కాంక్షించడం అవుతుంది.

ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానంలో గత రెండు దశాబ్దాలుగా న్యాయవాదిగా పనిచేస్తున్నసామాజిక కార్యకర్త, అన్నా హజారే తో కలిసి అవినీతి రహిత భారత్‌ ‌కోసం లోక్‌ ‌పాల్‌ ‌బిల్లును పార్లమెంటులో చట్టంచేసి, అన్ని వ్యవస్థలను దాని పరిధిలో చేర్చాలని ఉద్యమించిన ప్రశాంత్‌ ‌భూషణ్‌ ‌తన ట్వీట్‌ ‌ద్వారా వ్యవస్థలో పని చేస్తున్న వ్యక్తుల పొరపాట్లను లేదా లోపాలను ప్రశ్నించడం న్యాయస్థానాన్ని ధిక్కరించడం ఎలా అవుతుందో సామాన్యులకు సైతం అంతుచిక్కని వ్యవహారం. ముందుగానే చెప్పుకున్నట్లుగా వ్యవస్థలో అత్యున్నత స్థానంలో పనిచేసినప్పటికీ ,తాము వ్యవస్థ కంటే ఉన్నతులమని భావించుకోవడమే ఈ వ్యవహారం అంతటికీ కారణంగా తోస్తుంది. ప్రశాంత్‌ ‌భూషణ్‌ ‌చేసిన నేరమల్లా దేశ ప్రధాన న్యాయమూర్తి బాబ్డే గారిని హార్సెలీ డేవిడ్సన్‌ ‌బైక్‌ ‌ను హెల్మెట్‌ ‌మరియు మాస్క్ ‌లేకుండా నడుపుతున్న ఫొటోలు బహిర్గతం చేయడం సరికాదని ట్వీట్‌ ‌ద్వారా ప్రశ్నించడం, ఆదర్శవంతంగా నిలవాలని గుర్తుచేయడమే. అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తులు చేసే ప్రతీ పని అత్యున్నతంగా కాకపోయినా, ఆదర్శంగా ఉండి తీరాలి. ఈ క్రమంలో వ్యక్తిగత జీవితాన్ని, అందులో వుండే అలవాట్లు, సరదాలను కూడా కోల్పోవాల్సి ఉంటుంది. ఈ విషయం వారికి గుర్తు చేయాల్సి రావడమే మన దురదృష్టం.ఈ పనే చేసిన ప్రశాంత్‌ ‌భూషణ్‌ ‌ట్వీట్‌ ‌ను సానుకూల దృక్పథంతో స్వీకరించాల్సింది. అలాగే గత ఆరేండ్లుగా పనిచేసిన నలుగురు ప్రధాన న్యాయమూర్తులు కీలకమైన అంశాలపై సకాలంలో విచారణ జరపలేదని, రాజ్యాంగం కల్పించిన పౌరహక్కులను కాపాడే తీర్పులు ఇవ్వలేకపోయారన్న (తన ఆవేదనను) లోపాన్ని మరొక ట్వీట్‌ ‌ద్వారా ఎత్తిచూపారు.. నిజానికి ఆయన వేసిన ప్రశ్న లేదా విమర్శ ఒక న్యాయవాదిగా మాత్రమే కాదు బాధ్యతాయుత దేశ పౌరుడిగా, రాజ్యాంగంలోని 19(1) (ఏ) అధికరణ ద్వారా తనకు సంక్రమించిన వాక్స్వాతంత్య్రపు హక్కును వినియోగించుకున్న భారతీయుడిగా, న్యాయవ్యవస్థ కు ఉన్న సమున్నతను ఎల్లవేళలా కాపాడాలనే తపన కలిగిన వ్యక్తిగా గుర్తించడానికి బదులు, జస్టిస్‌ అరుణ్‌ ‌మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం కోర్టుధిక్కరణగా తీర్పునివ్వడం అంటే తమను తాము రాజ్యాంగానికి అతీతులుగా భావిస్తున్నారా అనే ప్రశ్నే ప్రాథమికం కావడం సహజం. సుమోటోగా స్వీకరించిన తన కేసును (ట్వీట్లు) మరొక బెంచ్‌ ‌కు బదిలీచేయాలని రాజ్యాంగబద్ధంగా చేసుకున్న అప్పీలును కూడా కారణం చూపకుండా తిరస్కరించడం ఏ ప్రమాణాలకు నిదర్శనమో వారికే తెలియాలి.

దేశంలో పార్లమెంటరీ విధానాన్ని, కార్యనిర్వాహక వ్యవస్థను సక్రమమైన మార్గంలో ప్రయాణించేలా మార్గదర్శనం చేస్తూ, ప్రజలకు ఈ దేశం కల్పించబడ్డ హక్కులను కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఫరిడవిల్ల జేసే గొప్ప బాధ్యతను తన భుజాల మీద మోయాల్సిన అత్యున్నత న్యాయస్థానం తన ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక తీర్పుల వల్ల తన ప్రతిష్టను తనే మసిపూసి మసకబార్చుకుంటున్నది. గతంలోనూ చాలా సందర్భాల్లో న్యాయవ్యవస్థలో పనిచేసిన వ్యక్తులు (న్యాయమూర్తులు) అవినీతికి పాల్పడిన సంఘటనలు న్యాయ వ్యవస్థ స్వచ్చతకు మకిలిలాంటివే. ఇప్పటికైనా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, అది కల్పించిన హక్కులను కాపాడుతూ, ప్రజలకు అందిస్తూ తన మహోన్నత స్థానాన్ని నిలుపుకునే ప్రయత్నం, ప్రజల మన్ననలు చూరగొనే తాపత్రయంతో పనిచేయాల్సిన అవసరంఉంది. ప్రశాంత్‌ ‌భూషణ్‌ ‌చేసిన సద్విమర్శలను కోర్ట్ ‌ధిక్కరణగా ప్రకటించి శిక్ష ఖరారు కి ముందు క్షమాపణ కోరితే శిక్ష రద్దు చేస్తామన్న గౌరవ న్యాయస్థానం సూచనను సున్నితంగా తిరస్కరించారు. క్షమాపణ చెప్పేంత నేరం నేనేమీ చేయలేదని, నేను నా అత్యున్నత కర్తవ్యంగా భావించిన దానిని, కోర్టు నేరంగా భావించినందున నా పట్ల దయ చూపమని అడగను, ఔదార్యం చూపమని విజ్ఞప్తి చేయనని లేఖ రాశారు. క్షమాపణ పై పునరాలోచన చేయాలని ఈ నెల 24 వరకు గడువిచ్చిన దరిమిలా న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, ప్రజలు ప్రశాంత్‌ ‌భూషణ్‌ ‌గారికి బాసటగా నిలుస్తున్నారు. న్యాయమూర్తులు తమ తీర్పును పునఃసమీక్షించి, న్యాయవ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టాలి.
-చుంచు శ్రీశైలం, ఉపాధ్యాయులు
TPTF జిల్లా కౌన్సెలర్‌
‌మహబూబాబాద్‌ ..
shailushailubashi@gmail.com

Leave a Reply