దేశంలోనే తొలి మొబైల్ వైరాలాజీ ల్యాబ్
దేశంలోనే తొలి మొబైల్ వైరాలాజీ ల్యాబ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో ఏర్పాటైన ఈ ల్యాబ్‌ను గురువారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆన్లైన్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంతోష్ గాంగ్వార్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటీఆర్ డీఆర్డీవో అధికారులు పాల్గొన్నారు. కొరోనా పరీక్షలతో పాటు వైరస్ కల్చర్, వ్యాక్సిన్ తయారీ కోసం ఈ ల్యాబ్‌ను ఉపయోగించనున్నారు. ఐ క్లీన్, ఐ సేఫ్ సంస్థల సహకారంతో బయో సేఫ్టీ లెవల్ 3 ల్యాబ్‌ను డీఆర్డీవో ఈ ల్యాబ్‌ను రూపొందించింది. దేశంలో కొరోనా రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో డీఆర్డీవో శాస్త్రవేత్తలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేవలం 15 రోజుల వ్యవధిలో రెండు భారీ కంటైనర్లలో దీనిని రూపొందించారు. ఇప్పటి వరకు అభివృద్ధి చెందిన దేశాలలో మాత్రమే మొబైల్ వైరాలజీ ల్యాబ్‌లు అందుబాటులో ఉండగా, భారత్‌లో తొలిసారిగా హైదరాబాద్‌లో ఈ ల్యాబ్ అందుబాటులోకి రావడం విశేషం. మొబైల్ వైరాలజీ ల్యాబ్ ప్రారంభం అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కొరోనా బాధితులకు చికిత్స అందించేందుకు గచ్చిబౌలిలో కేవలం 20 రోజుల వ్యవధిలోనే 1500 పడకల ప్రత్యేక ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కొవిడ్ 19 చికిత్స కోసం ఇప్పటి వరకు 8 ఆసుపత్రులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.
గాంధీ ఆసుపత్రిలో పేషెంట్ మేనేజ్మెంట్ను పరిశీలించిన మంత్రి ఈటల
గాంధీ ఆసుపత్రిలో కొరోనా పాజిటివ్ వ్యక్తుల అడ్మిషన్, వైద్య చికిత్సలు, డిశ్చార్జిలపై మంత్రి ఈటల గురువారం సమీక్షించారు. ఇందులో భాగంగా గాంధీ ఆసుపత్రిని మొత్తం 6 భాగాలుగా విభజించాలనీ, ప్రతీ విభాగానికి ఒక ప్రొఫెసర్‌ను ఇంచార్జిగా నియమించాలని సూచించారు. అన్ని యూనిట్లలో పేషెంట్లు సమాన సంఖ్యలో ఉండాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రాజారావును ఈ సందర్భంగా మంత్రి ఈటల ఆదేశించారు. పేషెంట్ ఎప్పుడు అడ్మిట్ అయ్యారు, 14 రోజులు ఎప్పుడు పూర్తయ్యింది, మొదటి, రెండో పరీక్షలు ఎప్పుడు చేయాలి ఎప్పుడు డిశ్చార్జి చేయాలనే పూర్తి సమాచారం ప్రతీ విభాగపు ఇన్చార్జి వద్ద ఉండాలని సూచించారు. ప్రతీ కొరోనా పేషెంట్‌ను ఉదయం, సాయంత్రం రెండు సార్లు పరీక్షించాలనీ, డయాబెటిస్, బీపీ ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న పేషెంట్లను మరింత జాగ్రత్తగా పరీక్షించాలన్నారు. చిన్నపిల్లల తల్లిదండ్రులు ఆసుపత్రిలో ఉంటే, వారి దగ్గరే ఉంచాలనీ, పీడియాట్రీషన్ల సంరక్షణలో మెరుగైన సేవలు అందించాలని సూచించారు. గాంధీ ఆసుపత్రిలో కేవలం కొరానా పేషెంట్లు మాత్రమే ఉన్నందున వైరస్ వ్యాప్తి జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వుఖ్యంగా వైద్యులు, నర్సులు, శానిటేషన్ సిబ్బంది పీపీఈ కిట్లు విధిగా ధరించాలని ఈ సందర్బంగా మంత్రి ఈటల సూచించారు.