ఐఎన్ఎస్ విక్రాంత్ సిద్ధం అయ్యిందన్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్
భారత దేశంలో తయారైన తొలి విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ సిద్ధమైందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. జూలై నుంచి పరీక్షలు జరుగుతాయని, వొచ్చే ఏడాది నుంచి ఇది విధులకు సిద్ధమవుతుందని తెలిపారు. ఈ యుద్ధ నౌక శక్తి సామర్థ్యాలు ఎదురులేనివని చెప్పారు. పోరాట పటిమ, విస్తృతి, విభిన్న కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్యాలతో ఇది దేశ రక్షణలో సాటిలేని సేవలందించగలదని వివరించారు.
కొచ్చిన్ నౌకాశ్రయంలోని ఎర్నాకుళం రేవు వద్ద ఐఎన్ఎస్ విక్రాంత్‌ను శుక్రవారం సందర్శించిన అనంతరం ఆయన మిడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణ ప్రగతిని రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం సమిక్షించారు. ఇది భారత దేశానికి గర్వకారణమని తెలిపారు.
ఆత్మనిర్భర్ భారత్‌కు ఇది గొప్ప ఉదాహరణ అని వివరించారు. 75 ఏళ్ళ స్వతంత్ర భారత దేశానికి ఇది అద్భుతమైన కానుక అని పేర్కొన్నారు. పోరాట పటిమ, విస్తృతి, విభిన్న కార్యకలాపాలను నిర్వహించగలిగే సత్తాగల ఈ యుద్ధ నౌక భారత దేశ రక్షణ రంగానికి ఎదురులేని శక్తిసామర్థ్యాలను జోడిస్తుందని తెలిపారు. సముద్ర రంగంలో భారత దేశ ప్రయోజనాలను కాపాడటానికి దోహదపడుతుందన్నారు. మన దేశంలో నిర్మితమవుతున్న విమాన వాహక యుద్ధ నౌకను సమిక్షించడం సంతోషంగా ఉందన్నారు.
దేశీయ పారిశ్రామిక రంగం, నైపుణ్యాలను వినియోగించుకోవడం, ఆధునికీకరించడంపై తాము ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఆర్డర్‌పై నిర్మించవలసిన 44 యుద్ధ నౌకల్లో 42 నౌకలను మన దేశంలోని షిప్‌యార్డుల్లో తయారు చేస్తుండటం దీనికి నిదర్శనమని చెప్పారు. ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ఇండిజెనస్ ఎయిర్‌క్రాప్ట్ క్యారియర్ -1 (ఐఏసీ-1) అని కూడా పిలుస్తున్నారు. దీనికి ఎన్డీయే ప్రభుత్వం ఆమోదం తెలిపి, కోవిడ్-19 పరిస్థితుల్లో సైతం పనులను కొనసాగించింది.