ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు
సిద్ధిపేట, డిసెంబర్ 20(ప్రజాతంత్ర బ్యూరో) : యేసు ప్రభువు సర్వ మానవ, సమానత్వం కోరారని, శాంతి, సహనం, ప్రేమ కలిగి ఉండాలని యేసు క్రీస్తు తన బైబిల్ బోధనలో చెప్పారని, అదే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వ మతాలను గౌరవిస్తారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ప్రభుత్వం స్థలం ఇచ్చి ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలోనే తొలి క్రైస్తవ భవనం నిర్మించుకుని ప్రారంభం చేసుకున్నామనీ, గజ్వేల్ నియోజకవర్గ క్రైస్తవులకు మంత్రి హరీష్‌రావు పవిత్ర క్రిస్మస్ మాస శుభాకాంక్షలను తెలిపారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో రూ.1.50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన క్రిస్టియన్ భవనాన్ని సోమవారం ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు.
అనంతరం క్రిస్మస్ వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి సంబురాలలో పాల్గొని, ఆ తర్వాత నియోజకవర్గ పరిధిలోని 3600 మంది పేద క్రైస్తవ లబ్ధిదారులకు దుస్తుల పంపిణి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రతీ యేటా క్రిస్మస్ పండుగను అధికారికంగా జరుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, సాయం అందించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి చేయూత అందించాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా క్రైస్తవులకు కమ్యూనిటీ భవనాలు జిల్లాలోని గజ్వేల్, సిద్ధిపేటలో నిర్మించుకుని వినియోగించుకుంటున్నట్లు, త్వరలోనే అన్నీ నియోజకవర్గ పరిధిల్లో కూడా వొస్తాయని మంత్రి పేర్కొన్నారు.
గజ్వేల్‌లో చక్కటి క్రిస్టియన్ భవనాన్ని, అన్ని రకాల అవసరాలకు ఉపయోగపడేలా నిర్మించుకున్నట్లు, క్రైస్తవ పేదలందరికీ అనువయ్యే విధంగా ఈ భవనం నిర్వహణ ఉండాలని నిర్వాహకులను మంత్రి కోరారు. సర్వ మానవ సమానత్వం, శాంతి, సహనం, ప్రేమ కలిగి ఉండాలని ఆ యేసుక్రీస్తు తమ బైబిల్ బోధనలో చెప్పారని గుర్తు చేస్తూ..అదే విధంగా సీఎం కేసీఆర్ సర్వమతాలను గౌరవిస్తారని, హిందూ దేవాలయాలు అభివృద్ధి జరగాలని, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరే వ్యక్తి మన సీఎం కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. పండుగ ఏదైనా ప్రభుత్వం అన్నీ మతాల వారిని కూడా సముచితంగా చూస్తూ..క్రిస్మస్ పండుగకు కానుకగా దుస్తులు పంపిణీ చేస్తున్నట్లు, మారుమూల గ్రామ ప్రాంతాల్లోని పేదలందరికీ క్రిస్మస్ కానుక బట్టలు అందేలా ఫాస్టార్లంతా చొరవ చూపాలని మంత్రి కోరారు.