Take a fresh look at your lifestyle.

సమతామూర్తిని ఆవిష్కరించిన అసమానతా మూర్తి

దేశ ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజుల క్రితం నూటా ఇరవై అడుగుల రామానుజాచార్యుల విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర రాజధానిని ఆనుకున్న ముచ్చింతల్‌లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. లోకంలో భేదభావాలు, కులమతాలకు అతీతంగా విశిష్ట అద్వైతాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన ఆచార్యులను సమతామూర్తిగా ప్రస్తుతిస్తుండగా…ఆ విగ్రహాన్ని అవిష్కరించిన ప్రధాని మోదీని మాత్రం అసమానతామూర్తి అంటూ పలువురు సోషల్‌ ‌మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అందుకు సంబంధించిన బ్యానర్లు, ప్లకార్డులను కూడా ప్రదర్శించారు.

ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న పక్షపాత వైఖరిని ఎండగడుతూ రాష్ట్ర అభిమానులు, చివరకు పాలకులు కూడా తమ ట్విట్టర్‌ ‌ఖాతాలో విపరీతంగా పోస్టింగ్‌లు పెడుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి, టిఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కల్వకుంట్ల తారకరామారావు పెట్టిన పోస్ట్ ‌మాత్రం పలువురిని ఆలోచింపజేసేదిగా ఉంది. ‘వివక్షతకు చిహ్నమైన వ్యక్తి.. సమతామూర్తిని ఆవిష్కరించారన్నది’ ఆయన ట్విట్టర్‌ ‌సారాంశం. గత రెండు బడ్జెట్‌ల్లో తెలంగాణపై కేంద్రం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం తీరును లేఖల రూపంలో ఇక్కడి పాలకులు పలు దఫాలుగా ఎత్తి చూపుతూనే ఉన్నారు. అయినా ఉలుకూ పలుకు లేకపోగా, తామిచ్చిన నిధులకు సరైన లెక్కలు చూపించడంలేదని రాష్ట్రంపైన విరుచుకు పడుతుంది కేంద్రం, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకత్వం.

రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం చట్టబద్ధంగా ఇచ్చిన హామీలేవీ నెరవేరడంలేదని ఉభయ తెలుగు రాష్ట్రాలు చాలాకాలంగా మొరపెట్టుకుంటున్నా జరిగింది మాత్రం ఏమీలేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్తగా నిధులు, పథకాలు, ప్రాజెక్టులు సమకూర్చకపోగా ఈ రాష్ట్రాల్లోని ప్రభుత్వ రంగ సంస్థలకు మంగళం పాడేందుకు సిద్దపడుతుంది. ఇది పుండుమీద కారంలా ఈ రెండు రాష్ట్రాల పాలకులకు మంటలేపుతుంది. ఎప్పుడో నిజాం కాలంలో ఏర్పాటు చేసిన సింగరేణి బొగ్గుగనులను దెబ్బతీసేందుకు కేంద్రం పథకం రచిస్తుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ సంస్థను నిర్వీర్యం చేయడం ద్వారా అది నడువదన్న ముద్ర వేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉండడంపై ఇటీవల తెలంగణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఒక పక్క కాజీపేట కోచ్‌ ‌ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌లాంటి కొత్త ఆవిష్కరణల కోసం పోరాడుతుంటే తెలంగాణలోని వేల కుటుంబాల ఇంట సిరులు పండిస్తున్న సింగరేణికి కాలదోషం పట్టించాలనుకోవడం పట్ల మంత్రి కెటిఆర్‌ ‌తాజాగా కేంద్రంపై లేఖాస్త్రాన్ని సంధించారు.

ఉద్దేశ్య పూర్వకంగానే కేంద్రం సింగరేణిని చంపే ప్రయత్నం చేస్తున్నదంటూ ఆయన కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ ‌జోషికి ఘాటైన లేఖకూడా రాశారు. సింగరేణి నడిచేందుకు కావాల్సిన బొగ్గు నిక్షేపాలను వేలం ద్వారా ప్రైవేటు సంస్థలకు అంటగట్టాలనుకోవడం కన్నా మరో మోసం లేదన్నది ఆయన వాదన. దీని పరిధిలోని నాలుగు బొగ్గు గనులను కేంద్రం ఇటీవల వేలం వేయడానికి సిద్ధపడిన విషయం తెలిసిందే. ముడి సరుకును అందించే గనులను ప్రైవేటీకరిస్తే సంస్థ క్రమేణ తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగు పర్చాల్సింది పోయి, క్రమేణ నష్టపూర్తి పబ్లిక్‌ ‌సెక్టార్‌ ‌కంపెనీగా మార్చే ప్రయత్నాలు చేస్తుందన్నది ఆయన ఆరోపణ. ఈ విషయంలో యావత్‌ ‌తెలంగాణ ప్రజ, సింగరేణి కార్మిక సంఘాలు తమ నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమవుతున్నారు. టిబిజికెఎస్‌ ‌కార్మిక సంఘంతోపాటు, ఇతర కార్మిక సంఘాలు, తెరాస పార్టీ శ్రేణులు ఈ నెల 9న పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేపట్టేందుకు అప్పుడే సిద్ధమయ్యాయి. ఇందుకుగాను ఇప్పటికే సుమారు నలభై వేల సంతకాలను కూడా సేకరించారు. మరిన్ని సంతకాలతో త్వరలో కోల్‌ ‌మినిస్ట్రీకి లేఖను అందజేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు కూడా.

కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుందని భావిస్తే ఎంగిలిచెయ్యి కూడా విదల్చడం లేదని ఇక్కడి పాలకులు ఆక్రోషిస్తున్నారు. తెలంగాణ ఆభివృద్ధికి కావాల్సిన నిధులు, పథకాల విషయంలో ఇప్పటికే అనేకానేక లేఖలు రాయడంతో పాటు, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌స్వయంగా 22 సార్లు డిల్లీ చుట్టు ప్రదక్షిణ చేసి వొచ్చినా లాభం లేకుండా పోయింది. స్టీల్‌ప్లాంటు, కోచ్‌ ‌ఫ్యాక్టరీతోపాటు విద్య, వైద్య, పర్యావరణ రంగాలకు కావాల్సిన ఆర్థిక సహకారం విషయంలోనూ కేంద్రం ఏ మాత్రం స్పందించక పోవడంపైన తెలంగాణ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఉడాన్‌ ‌పథకం కింద వరంగల్‌ ‌విమానాశ్రయానికి పూర్వవైభవం తెస్తామన్నది కలగానే మిగిలిపోయింది. ఇక కొత్తగా ఏర్పాటు చేస్తామన్న విమానాశ్రయాల ఊసే లేదు. అలాగే అనవాళ్ళు కూడా మాయమైన ఆజంజాహి మిల్‌కు మించి వరంగల్‌లో ఏర్పాటు చేస్తామన్న మెగా టెక్స్‌టైల్‌పార్క్ ‌కూడా కాలగర్బంలో కలిసిపోతున్నదే తప్ప తీసుకుంటున్న చర్యలేవీలేవు.

ఇక్కడ చేనేత రంగానికి మంచి డిమాండ్‌ ఉం‌ది, దాన్ని ప్రోత్సహించేందుకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌హ్యాండ్లూమ్‌ను ఏర్పాటు విజ్ఞప్తిపై ఆలోచనేలేదు. చాలా కాలంగా ఉపాధి అవకాశాలు లేక ఆర్థికంగా చితికిపోతున్న యువతకు అంతో ఇంతో ఉపాధిని కలిగిస్తుందనుకున్న హైదరాబాద్‌ ఐటిఐఆర్‌ ‌ప్రాజెక్టు ఏర్పాటు కూడా విషాదంగానే మారింది. తెలంగాణలో నేషనల్‌ ‌డిజైన్‌ ‌సెంటర్‌తోపాటు, హైదరాబాద్‌-‌వరంగల్‌, ‌హైదరాబాద్‌-‌నాగపూర్‌ ఇం‌డస్ట్రియల్‌ ‌కారిడార్లు, హైదరాబాద్‌ ‌ఫార్మాసిటి, నేషనల్‌ ఇం‌డస్ట్రియల్‌ ‌మ్యానుఫ్యాక్చరింగ్‌ ‌జోన్‌, ‌జహీరాబాద్‌ ‌నోడల్‌ అభివృద్ధికి కావాల్సిన ఆరువేల కోట్ల నిధుల కోసం తాజాగా తెలంగాణ సర్కార్‌ ‌రాసిన లేఖను కూడా కేంద్రం పట్టించుకోలేదు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ పార్టీ విజయావకాశాల కోసం ఆయా రాష్ట్రాలకు నిధులను మంజూరు చేస్తూ, తెలంగాణ లాంటి ఎదుగుతున్న రాష్ట్రాలకు ఏమాత్రం చేయూతనందించడం లేదన్న విమర్శ కేంద్రంపై ఉంది. ఆ కారణంగానే ప్రధాని మోదీని అసమానతామూర్తి అంటూ కెటిఆర్‌ ‌సంబోధించారు.

Leave a Reply