సోషల్ మీడియాలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మణికమ్ ఠాగూర్
రైతాంగ వ్యతిరేక బిల్లులపై క్షేత్రస్థాయిలో ఉద్యమం చేయాలని ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మణికమ్ ఠాగూర్ నేతలకు పిలుపునిచ్చారు. రైతు సంఘాలతో కలిసి వ్యవసాయ బిల్లులపై పోరాటం చేయాలన్నారు. మంగళవారం ఏఐసీసీ ఇన్ ఛార్జ్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర నాయకులు రాష్ట్రంలోని డీసీసీ అధ్యక్షులతో జూమ్ ఆప్ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లుల విషయంలో ఏఐసీసీ ఆదేశాల మేరకు గ్రామీణ స్థాయి నుంచి పోరాటాలు చేయాలని ఆ బిల్లులను అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి డీసీసీ అధ్యక్షులను ఏఐసీసీ ఇంచార్జిలకు పరిచయం చేసారు.
అనంతరం రాబోయే దుబ్బాక ఉప ఎన్నికలు, గ్రేట హైద్రాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదు, మండలి ఎన్నికలు తదితర అంశాలపై ఉత్తమ్ మాట్లాడారు. ఏఐసీసీ ఇంచార్జి డీసీసీలకు దిశా నిర్దేశం చేశారు. పార్టీకి డీసీసీ అధ్యక్షులు మూల స్తంభాల్లాంటి వారు వారితో అన్ని సంప్రదింపులు ఉంటాయని గ్రాడ్యుయేట్ ఎన్నికలలో డీసీసీ అధ్యక్షులు వారి వారి పట్టణాలలో, మండలాల్లో గ్రాడ్యుయేట్ వోటర్లను చేర్పించాలని సూచించారు. పార్టీ అభివృద్ధిలో డీసీసీల పాత్ర చాలా కీలకమన్నారు. ఇక పంచాయత్ రాజ్ సంఘటన్ జిల్లా కో ఆర్డినెటర్లను వెంటనే నియమించలన్నారు. తెలంగాణ ప్రజలు భావోగ్వేద అంశాలపై ఎక్కువ స్పందిస్తారని, తెలంగాణ విషయంలో సోనియమ్మ, కాంగ్రెస్ చేసిన త్యాగాలు వారి గుండెల్లోకి చేరేలా కృషి చేయలన్నారు. ఈ సమావేశంలో ఎంపీ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి లతో పాటు డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.
సోషల్ మీడియాలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
జూమ్ యాప్ మీటింగ్లో ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మణికమ్ ఠాగూర్ మాట్లాడుతూ…పార్టీలో క్రమశిక్షణ, టీమ్ వర్క్ చాలా ముఖ్యమని అన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని…ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో క్రమశిక్షణ ఉల్లంఘించి పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సామాజిక మాధ్యమలలో ఇటీవల పార్టీకి నాయకులకు వ్యతిరేకంగా ప్రచారాలు జరుగుతున్నాయని వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు.