- వైద్య సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు
- గూడారాలలో కౌంటర్లు ఏర్పాటు చేసి సేవలందిస్తున్న వాలంటీర్లు
తీవ్రమైన చలి రోజుల్లో కూడా సింగు సరిహద్దులో రైతుల నిరసన రోజురోజుకు మరింత ఉదృతమవుతూ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో రైతులకు వైద్య సహాయం కొరత లేకుండా కొంతమంది వాలంటీర్లు సేవలందిస్తూ భరోసా ఇస్తున్నారు. నవంబర్ 26 నుండి, అనేక వైద్య శిబిరాలు – తాత్కాలిక క్లినిక్‌ల ఏర్పాటు చేసి రైతుల వివిధ వ్యాధులను పరీక్షించటం, రక్తపోటును తనిఖీ చేయడం, తక్షణ ఉపశమన మందులను అందించటం వంటి సేవలను కొంతమంది వాలంటీర్లు అందిస్తున్నారు. పంజాబ్, హర్యానా మరియు ఢిల్లీకి చెందిన స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన ఈ శిబిరాలు తాత్కాలిక గుడారాలు, డజన్ల కొద్దీ మెడిసిన్ బాక్సులతో కనిపిస్తున్నాయి. కొంతమంది నిరసనకారులు తమకు ఏ మందులు అవసరమో వాటిని అడిగి తీసుకుంటున్నారు.
మరికొందరికి వైద్యులు పరీక్షలు చేసి మందులు ఇస్తున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు వాలంటీర్లు ధర్నా స్థలంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లోనే వుంటున్నారు. ప్రధాన నిరసన వేదిక వెనుక జాతీయ స్థాయి స్వచ్ఛంద వైద్య సంస్థ మెడికల్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేసిన శిబిరంలో, చికిత్స కోసం కౌంటర్లను ఏర్పాటు చేసారు. రోగులు మొదటి కౌంటర్లో పేరు నమోదు చేసుకున్న తరువాత ఒక సాధారణ వైద్యుడు రెండవ కౌంటర్లో పరీక్షలు చేయగా మరో వైద్యుడు ఒక ప్రిస్క్రిప్షన్‌ను అందించగా మూడవ కౌంటర్లో మరొక వాలంటీర్ మందులు అందజేస్తాడు. ‘‘ఏ సమయంలోనైనా, కనీసం ఇద్దరు వైద్యులు అందుబాటులో వుంటున్నారు. చాలా మందులు వేర్వేరు ప్రదేశాల నుండి సేకరించి తీసుకు వస్తున్నాం. కొన్ని మందులు మాకు దానం ద్వారా అందాయి. మా శిబిరం డిసెంబర్ 1 నుండి పనిచేస్తోంది. అంతేకాదు నిరసన కొనసాగే వరకు మేము ఇక్కడే ఉంటాము. శీతాకాలం కఠినతరం అవుతోంది, చాలా మందికి వాతావరణ సంబంధిత సమస్యలు ఉన్నాయి’’ అని సరిహద్దు వద్ద శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి మధ్యప్రదేశ్ సంస్థకు చెందిన స్వచ్ఛంద వాలంటీర్ ప్రతిజ్ఞ మాజి అన్నారు.
ఈ శిబిరంలో పగటిపూట 200 మందికి పైగా రైతులు వైద్య సహాయం అడుగుతూ కనిపిస్తారు. శిబిరాలలో, తలనొప్పికి డిస్ప్రిన్, పారాసెటమాల్, ఇబుప్రోఫెన్ మరియు ఇతర నొప్పుల నివారణ కోసం అధికంగా పంపిణీ చేయబడిన మందులు అందిస్తున్నారు. గత వారంలో ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోవడంతో జ్వరం మందుల డిమాండ్ బాగా పెరిగింది. ఇవి కాకుండా, ఎక్కువసేపు నిలబడటం వల్ల కీళ్ల నొప్పుల కోసం రైతులు మందులు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో పెయిన్ రిలీఫ్ జెల్లు పెద్ద సంఖ్యలో పంపిణి చేస్తున్నారు. అకాల్ ఎయిడ్ వైద్య శిబిరంలో ఉన్న గుర్దీప్ సింగ్ మాట్లాడుతూ ‘‘మేము చాలా మంది జీర్ణ సంబంధ మందులను మా స్టాక్‌లో ఉంచుతాము, ఎందుకంటే చాలా మంది వీటిని అడుగుతున్నారు. నిరసన కార్యక్రమంలో వారు తినే తిండి పద్ధతులు మారినందున జీర్ణ సంబంధ సమస్యలు వొస్తున్నాయి. నిరసన స్థలంలో కేవలం సేవా దృక్పధంతో హర్యానా నుండి వొచ్చిన ఫిజియోథెరపిస్ట్ కూడా మాతో ఉన్నారు.’’ అని తెలిపారు. గత కొద్ది రోజులుగా అనేక మంది స్థానికులు పెద్ద సంఖ్యలో మందులు దానం చేసారు. ప్రజలు మందుల పంపిణీకి సహాయపడటానికి శిబిరాల వద్దకు స్వచ్ఛందంగా వొచ్చి పాల్గొంటున్నారు.
ఒకవేళ ఒక వ్యక్తికి అనారోగ్యం లేదా గాయం ఉంటే, పోలీసు బారికేడ్ల దగ్గర ఆపి ఉంచిన అంబులెన్సులు వారిని హర్యానాలోని సమీప హాస్పిటల్‌కి తరలిస్తున్నాయి. ‘‘కొంతమంది ట్రాక్టర్ పదునైన అంచులు తగిలి గాయపడ్డారు. కొందరు రోడ్డు మీద చెప్పులు లేకుండా నడిచారు. మేము కట్టులు కట్టి డ్రెస్సింగ్ అందిస్తాము. గాయం తీవ్రంగా ఉంటే సంప్రదించి రైతులను హాస్పిటలకి తరలిస్తున్నాం. ప్రథమ చికిత్స అందించడానికి కనీసం ఒక వైద్య కేంద్రం ఉండడం చాలా అవసరం’’ అని సిఐటియు వైద్య శిబిరంలో వున్న హర్యానాకు చెందిన ఆశా ఉద్యోగి సునీతా రాణి చెప్పారు. పగటిపూట, 50 ఏళ్లు పైబడిన అనేక మంది రైతులు సమీప వైద్య శిబిరానికి చేరి తలనొప్పికి మందులు అడుగుతున్నారు. ఒక శిబిరంలో వరుసలో వేచి వున్నారు 60 ఏళ్ల గురుదాస్ సింగ్.
ఆయన మాట్లాడుతూ ‘‘నేను కొన్నిసార్లు చాలా వొత్తిడికి గురవుతున్నాను. కొంత శరీర నొప్పులు వున్నాయి. మేము బహిరంగంగా నిద్రిస్తున్నప్పటి నుండి చలి కారణంగా ఇలా ఉండవొచ్చు. ఐతే ఇది ఏ విధంగానూ మా మనో ధైర్యాన్ని తగ్గించదు. మేము ఇక్కడే ఉంటాం.. మందులు తీసుకుంటాము. కొంత మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. అయినా కానీ మా సంకల్పం చాలా బలంగా ఉంది.’’ అన్నారు. ప్రధాన వేదికకు దగ్గరగా ఉన్న మొబైల్ వ్యాన్‌లో దంత శిబిరం కూడా ఏర్పాటు చేయబడింది, ఇందులో ఒక దంతవైద్యుడి కుర్చీ ఇతర పరికరాలు ఉన్నాయి. రోగులను పరీక్షించడానికి అవసరమైనప్పుడు అనేక మంది రైతులు ఈ స్వచ్ఛంద వైద్య శిబిరం దగ్గరకి వెళుతున్నారు. శిబిరాల్లో ఒక మొబైల్ బృందం పరీక్షలు చేయటానికి, రోగం ఆరా తీసేందుకు నిరసనకారుల మధ్యలో కలియ తిరుగుతున్నది.
అనేక మంది రైతులు తమ రెగ్యులర్ పరీక్షల కోసం ఇంటికి తిరిగి వెళ్ళ లేక పోతున్నందున ఈ బృందాలు డయాబెటిస్ మరియు బిపి మందులను నిల్వ ఉంచాయి.