Take a fresh look at your lifestyle.

పుదుచ్చేరి ప్రభుత్వ పతనం బీజేపీ పుణ్యమే…

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి, ప్రభుత్వాలను పడగొట్టడం కాంగ్రెస్‌ ‌సంస్కృతి, మేం అధికారంలోకి వొస్తే  రాజకీయాల్లో విలక్షణత ఎలా ఉంటుందో రుజువు చేసి చూపిస్తామంటూ   కమలనాథులు   పలికినవన్నీ ప్రగల్భాలేనని తాజాగా  పుదుచ్చేరి విషయంలో స్పష్టం అయింది.అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ , ‌మణిపూర్‌, ‌గోవాలలలో ఇదే మాదిరిగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాలను గద్దె దింపిన  బీజేపీ ఇప్పుడు పుదుచ్చేరిలో కూడా అదే మార్గాన నడిచింది. పుదుచ్చేరి కావడానికి  ఒక కేంద్ర పాలిత ప్రాంతమైనప్పటికీ,అది చాలా కీలక స్థానంలో ఉంది.

త్వరలో జరగనున్న తమిళనాడు ఎన్నికలకు   పుదుచ్చేరి ఫలితాలతో సంబంధం లేకపోయినా,  తమిళ  రాజకీయ నాయకులంతా పుదుచ్చేరిలో తమ  కార్యకలాపాలను కొనసాగిస్తున్నవారే. పుదుచ్చేరి వ్యూహాత్మకంగా తమిళనాడుతు అత్యంత కీలకమైన స్థానంలో ఉంది.అక్కడ ప్రభుత్వాన్ని కైవసం చేసుకుంటే తమిళనాడు రాజకీయాలలో చక్రం తిప్పవచ్చని బీజేపీ భావిస్తోంది.   తమిళనాడులో కన్నా పుదుచ్చేరిలో కాస్మాపాలిటన్‌ ‌కల్చర్‌ ఉం‌ది. తమిళనాడుతో పోలిస్తే అంత  ఉత్తరాది వ్యతిరేకత లేదు.  అరవిందాశ్రమం నెలకొని ఉండటం వల్ల దేశదేశాల వారు అక్కడికి వొస్తుంటారు. ఆధ్యాత్మికంగా పేరెన్నికగన్న ప్రాంతం.అరవిందుని  బోధనల ప్రభావంతో అక్కడి ప్రజలు కుల,మత, రాజకీయాలకు అతీతంగా ఉంటారు.  అందువల్ల అక్కడ స్థానం సంపాదించడం సులభం.ఈ కోణం నుంచే బీజేపీ పుదుచ్చేరిలో  స్థానం కోసం అక్కడి ప్రభుత్వాన్ని పడగొట్టింది.  కేంద్ర హోం మంత్రి  అమిత్‌ ‌షా టార్గెట్‌ ‌లలో ఇప్పుడు బెంగాల్‌ ‌మొదటి స్థానంలో ఉంది. పుదుచ్చేరిలో ప్రభుత్వం ఏర్పాటుకు  ఎక్కువ కష్టపడనవసరం లేకుండా కాంగ్రెస్‌ ‌లో అసమ్మతి వాదులను చేరదీశారు .

ముఖ్యమంత్రి నారాయణ స్వామి వ్యవహర తీరుకు కాంగ్రెస్‌లో  అసంతృప్తి ఉంది.నారాయణ స్వామి యూపీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి కార్యాలయ వ్యవహారాల (పిఎంఓ) మంత్రిగా పని చేశారు.అప్పట్లో మంత్రులు, ఎమ్మెల్యేలపై కేంద్రంలో యూపీఏ ప్రభుత్వానికి చాడీలు చెప్పి వారిని తన గుప్పెట్లో ఉంచుకున్నారు. బీజేపీ అధికారంలోకి వొచ్చిన తర్వాత కూడా ఆయన తన పట్టు కొనసాగించారు.  నారాయణ స్వామికి  సమాంతరంగా  రంగస్వామి కాంగ్రెస్‌ ‌లో పేరున్న నాయకునిగా ఎదిగారు.ఆయన  పార్టీలో   ముఖ్యమైన వర్గాలను కూడగట్టి నారాయణ స్వామికి సవాల్‌ ‌విసిరారు.ఇప్పుడు వీరిద్దరినీ కాదని బీజేపీ  ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు  పథకం ప్రకారం లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌పదవి నుంచి కిరణ్‌ ‌బేడీని తప్పించింది.ఆమె ముక్కుకు సూటిగా పోయే వ్యక్తి, ఫిరాయింపులను ప్రోత్సహించడంలో  ఆమె తోడ్పడలేదు.అందుకని ఆమెను తప్పించారు. నిజానికి  బీజేపీ నాయకత్వం పట్ల ఆమె విధేయంగానే ఉన్నారు.  కానీ, మొండి మనిషి.

మరో వంక  ఆమెను తప్పించాలని నారాయణ స్వామి చాలా కాలంగా కోరుతున్నారు.ఆయన ఏకంగా  రాష్ట్రపతి రామనాథ్‌ ‌కోవింద్‌ ‌ని కలిసి వినతి పత్రం సమర్పించారు.  అయితే,  కిరణ్‌ ‌బేడీని కేంద్రం తప్పిస్తోందంటే తనకు మేలు చేయడం కోసమేనని  నారాయణ స్వామి భ్రమపడ్డారు. కానీ, బీజేపీ ఎత్తుగడ వేరు.   కిరణ్‌ ‌బేడీ బదులు  తెలంగాణ గవర్నర్‌  ‌తమిళసై అయితే, తమ మాట వింటారని కమలనాథుల నమ్మకం.ఆమె గవర్నర్‌ ‌పదవి చేపట్టకముందు తమిళనాడులో బీజేపీ నాయకురాలిగా పేరొందారు. తమిళనాడు, పుదుచ్చేరి లలో  కాంగ్రెస్‌, ‌డిఎంకె నాయకులు, వారి నేపధ్యాల గురించి ఆమెకు కరతలామలకం.అందువల్ల వారిని  ఎలా డీల్‌ ‌చేయాలో ఆమెకు తెలుసు.అందుకే, ఆమెను పుదుచ్చేరి ఇన్‌ ‌చార్జి గవర్నర్‌ ‌గా అదనపు బాధ్యత అప్పగించారు.  కేంద్రంలో బీజేపీ నాయకత్వం కాంగ్రెస్‌ ‌పార్టీని ఏ కారణాలపై విమర్శించేదో ఇప్పుడు అదేరీతిలో పాలన సాగిస్తోంది.

కాంగ్రెస్‌ ‌సంస్కృతిగా పార్టీ ఫిరాయింపులను ఎద్దేవా చేసిన బీజేపీ పార్టీ ఫిరాయింపులను   బహిరంగంగానే  ప్రోత్సహిస్తోంది.  నారాయణ స్వామి డిఎంకె పార్టీకి సన్నిహితుడు.  కరుణానిధి హయాంలో  ఆయనకూ యూపీఏ నాయకత్వానికి మధ్య వారథిగా పని చేశారు. డిఎంకె పార్టీతో  బీజేపీ పొత్తు కలిగి ఉండి ఉంటే ఆయన జోలికి   కేంద్రం వొచ్చి ఉండేది కాదు.  అన్నా డిఎంకె ప్రభుత్వం తో బీజేపీ జత కట్టడం వల్ల   డిఎంకె ని దెబ్బతీయాలంటే ఆ పార్టీకి సన్నిహితుడైన  నారాయణ స్వామిని గద్దె దింపాలనే సూత్రాన్ని అనుసరించి  తెరవెనుక ఈ ఆట ఆడిస్తోంది , అయితే, వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు  తగిన నాయకత్వం లేకపోవడం,  ఫిరాయంపుదారులపై నమ్మకం లేకపోవడంతో పుదుచ్చేరిలో కొంత కాలం  రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

తమిళనాడుతో పాటు ఎన్నికలను పుదుచ్చేరిలో నిర్వహించే అవకాశం ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు. తమిళనాడులో జయలలిత ఇష్టసఖి శశికళ ఏ వైపు ఉంటారో ఇంకా స్పష్టం కాలేదు.అక్కడి రాజకీయ సమీకరణాలు క్షణక్షణం మారుతున్నాయి.ఈ నేపధ్యంలో తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయో నని కాంగ్రెస్‌  ‌నేతృత్వంలోని కూటమి ఆందోళన చెందుతోంది.మొత్తం మీద   పుదుచ్చేరిలో పరిణామాలు ఇలా మారడానికి  లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌, ‌స్పీకర్‌ ‌కారణమని నారాయణ స్వామి ఆరోపిస్తున్నారు.  పుదుచ్చేరిలో రాజకీయ అనిశ్చిత స్థితి ఏర్పడటానికి  బీజేపీదే బాధ్యత అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Leave a Reply