కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులతో వేధింపులు
మండిపడ్డ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, కోమటిరెడ్డి
జనగామకు వెళుతుండగా అడ్డుకున్న పోలీసులు
సీఎం కేసీఆర్ పతనం మొదలైందని పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కెసిఆర్ పాలనపై ఇప్పటికే ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని, టిఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడాలని చూస్తున్నారని అన్నారు. జనగామ వెళ్తూ భువనగిరిలో ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి డియాతో మాట్లాడారు. పోలీసులు కేసీఆర్‌ను చూసి ఎగరకండని.. జాగ్రత్తగా ఉండాలని.. తాము ఎవరిని వొదిలిపెట్టబోమన్నారు. అధికార పార్టీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వొత్తిడితో జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారన్నారు.
పోలీసులు చట్టం, ధర్మం, రాజ్యాంగం పరిధిలో పని చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అరెస్టును రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కేసీఆర్‌కు పోయే రోజులు దగ్గర పడ్డాయని…అందుకే సోయిలేని మాటలను మాట్లాడుతున్నాడన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై సీఎం కేసీఆర్ అక్రమ కేసులు పెట్టిస్తున్నారన్నారు. కేసీఆర్ పరిపాలన రజాకారుల పాలన కంటే ఘోరంగా ఉందన్నారు. కేసీఆర్ పాలన కంటే రజాకారుల పాలన భేష్ అన్నారు. వొచ్చే రెండేళ్ళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కోమటిరెడ్డి తెలిపారు. మరోవైపు వరంగల్‌కు వెళ్తున్న కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని రణంపల్లి మండలం వెంకటాయపాలెం టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
రెండు వాహనాలకే అనుమతి ఉందని నర్మెట సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. దీంతో పోలీసులపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. ఎందుకు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ డ్రెస్ వేస్తే భయపడాల అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు.