Take a fresh look at your lifestyle.

మిల్లర్ల దోపిడి… ఆందోళనలో అన్నదాతలు

  • తూకం వేసి మిల్లుకు తరలించాక కొర్రీలు
  • రెండు నెలలు దాటినా…అందని ధాన్యం డబ్బులు
  • సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేయాలంటున్న రైతులు

కొడంగల్‌, ఆగస్టు 7(ప్రజాతంత్ర విలేఖరి) : అమ్మబోతే అడవి…కొనబోతే కొరివి అనే చందంగా అన్నదాతల పరిస్థితి మారింది. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. పంట సాగు కోసం వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టినా వరి ధాన్యం మిల్లర్లు రైతులను నిట్టనిలువునా దోచుకున్నారు. ధాన్యం విక్రయించి రెండు నెలలు గడుస్తున్నా డబ్బులు చేతికందకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. రైతుల వద్ద నుంచి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్లకు పంపిస్తే అడ్డగోలుగా కోతలు విధించి నష్టానికి గురి చేశారని వాపోతున్నారు. ధాన్యం ఒక బస్తాకు 42 కిలోల నుంచి 43 కిలోల వరకు మిల్లర్లకు పంపించారు. కొడంగల్‌ ‌నియోజకవర్గ పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించిన ధాన్యానికి, ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు ఇచ్చిన రశీదులకు, వొచ్చిన బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర వ్యత్యాసం ఉందటంతో పలు అనుమానాలకు దారి తీస్తుంది. ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు 700 బస్తాలు పంపిస్తే ప్రతీ బస్తాకు 2 నుంచి 5 కిలోల వరకు కోత విధించారు. రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని సేకరించి మిల్లర్లకు తరలించారు. అడ్డగోలు కోతలు రైతులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసింది.

ధాన్యం లారీలు మిల్లర్లకు చేరగానే ఆక్నాలెడ్జెమెంట్‌పై మిల్లర్లతో ధాన్యం వివరాలు రాయించుకొని, సంతకం తీసుకొని పౌరసరఫరాల అధికారులు సీల్‌ ‌వేయిస్తారు. ఇక్కడే భారీ అక్రమాలు జరిగినట్లు రైతులు ఆవదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం అన్‌లోడ్‌ ‌కాగానే కోత పేరుతో ఒక్కో లారీకి 200 నుంచి 300 కిలోల వరకు ఇష్టానుసారంగా తరుగు తీశారు. ధాన్యం తేమగా ఉంటే రైతుల అంగీకారంతో తరుగు తీయాల్సి ఉంటుంది. అలా కాకుండా రైస్‌మిల్లర్లు క్వింటాలు ధాన్యానికి 10 కిలోల చొప్పున కోత విధించి కొత్త మోసానికి తెరతీశారు. ధాన్యం విక్రయించి రెండు నెలలు గడుస్తున్నా రైతుల చేతికి ధాన్యం డబ్బులు అందలేదు. మిల్లర్ల ఆగడాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు అడ్డుకట్ట వేయకపోవడంతో అన్నదాతలు నష్టానికి గురి కావాల్సిన దుస్థితి నెలకొంది.

వరి ధాన్యం కొనుగోలు నిర్వాహకులు ధాన్యాన్ని మిల్లర్లకు పంపించిన తర్వాత మిల్లర్లు ఇచ్చిన రశీదుతో వెంటనే పౌరసరఫరాల శాఖ అధికారులకు పంపించి డబ్బులు అందే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల న్విహకులు రశీదులు ఇంట్లోనే పెట్టుకోవడంతో పలు అనుమానాలకు తావు ఇస్తుంది. జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఆమన్‌గల్‌, ‌కరీంనగర్‌ ‌మిల్లులకు తరుగు తీసి పంపించినా…తాజాగా క్వింటాలుకు 6 నుంచి 10 కిలోలు తరుగు తీసేయడంతో రైతులు పండించిన పంటకు లాభాం లేకుండా పోతుందని దిగులు చెంబుదుతున్నారు. ఈ విషయంపై రైతులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో అడిగితే పొంతన లేని సమాధానాలతో కాలం వెళ్లదీస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వరి ధాన్యంలో కోత విధించకుండా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

రైతులకు తీవ్ర నష్టం…: సుష్మ, గుండెపల్లి
కొనుగోలు కేంద్రంలో 239 బస్తాల వరి ధాన్యాన్ని విక్రయించగా 220 బస్తాలుగా రశీదు ఇచ్చారు. 88 క్వింటాళ్లకు రూ.1లక్ష 66వేల 144 రూపాయాలు రావాల్సి ఉంటుంది. కానీ రూ.1లక్ష 56వేల 326 అందించారు. మిగతా 5.2 క్వింటాళ్ల ధాన్యాన్ని తీయడంతో తీవ్ర నష్టానికి గురయ్యాం

మొదట ఇచ్చిన రశీదు ప్రకారమే డబ్బులు అందించాలి…:విజయ్‌రావు, గుండెపల్లి దౌల్తాబాద్‌ ‌మండలం బాలంపేట్‌ ఐకేపీ కొనుగోలు కేంద్రంలో 40 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని విక్రయించాం. 42 కిలోల 500 గ్రాములు ఒక బస్తాకు తరుగు పేరుతో తీశారు. మొత్తం 328 బస్తాలు వరి ధాన్యం వేయగా 123 క్వింటాళ్ల 60 కిలోలకు రూ.2లక్షల 25వేల 848 మాతమ్రే అందించారు. రూ.7,552 తక్కువ వేశారు. మిగతా 4 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని నష్టపోయాం. అధికారులు మిగతా డబ్బులు అందే విధంగా చర్యలు తీసుకోవాలి.

కోత విధించకుండా డబ్బులు అందించాలి…: పెరుమాళ్లు, రైతు
204 బస్తాలకు 184 బస్తాలుగా రశీదు ఇచ్చారు. 75 క్వింటాళ్ల 20 కిలోలకు రూ.1లక్ష 41వేల 97 అందించాల్సి ఉండగా రూ.1లక్ష 37వేల 257 మాత్రమే అందించారు. మిగతా 2.5 క్వింటాళ్ల ధాన్యానికి సంబంధించిన డబ్బులను వెంటనే అందించాలి.

Leave a Reply