Take a fresh look at your lifestyle.

మానవ జీవన సారాంశ దశ…

మానవ జీవితంలో విలువైనది, కీలకమైనది వృద్ధాప్యం. పరిణతతొ సాగే జీవన సారాంశదశ అని కూడా చెప్ప్చ్చ్నొ. జీవితంలోని అనేకానేక అనుభవాలను సమీక్షించుకంటూనే ఎదురయ్యే సమస్యలను మరింత పటుత్వంతో పరిష్కరించే శక్తిని పెంపొందించుకోవాలంటూ వృద్ధోపనిషత్ను కవితాత్మకంగా ఆవిష్కరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, విఖ్యాత కవి ఆచార్య ఎన్‌ ‌గోపి. వృద్ధుడంటే ఆయన దృష్టిలో జ్ఞానవృద్ధికి తోడ్పడుతూ మార్గదర్శనం చేసేవాడని అర్థం.

జీవితమంటే నిందించకుంటూ కూర్చునేది కాదని, నిరాశను దగ్గరకు రానీయకుండా అన్నింటిని లోకానుభవంతో సహజంగా స్వీకరిస్తూ తాత్త్వికంగా సాగిపోవాలన్నది కవిగా ఆయన సూచన. జీవితమంతా గడిపింది గొప్ప కాదురా, వృద్ధాప్యం గడిపిందే గొప్ప అని వాళ్లమ్మ అన్న మాటలే  పునాది రాళ్లుగా వృద్ధోపనిషత్‌ ‌కవితలు ప్రాణం పోసుకున్నాయి. వృద్ధుడంటే ముసలివాడు కాదనీ, వృద్ధిపొందిన వాడని ఒక మజిలీగా వృద్ధాప్యాన్ని మలచుకొని ఆశావాహ దృక్పథంతో జీవించాలంటారు.

శిథిలమయ్యేది శరీరమే
కాని అది సాధించింది
తక్కువేమీ కాదు
చెట్టు పొందిన
సాఫల్యం లాంటిదే ఇది కూడా
ఇదొక ధిషణా పటుత్వం
జీవితం ఒడిసి పట్టుకున్న తత్వం

అంటూ వయస్సు మీరటంలో కాదు మనస్సు పెరగటంలో వృద్ధాప్యాన్ని గోపి  ఎత్తి చూపుతారు. వృద్ధాప్యమంటే మరణ సామీప్రమే కాదు జీవన రహస్య విలోకనమంటారు. వృద్ధులను తలచుకోవడమంటే మసకబారిన వెలుగులో కొత్త ప్రకాశాలను మొలిపించడమే అని తెలిపారు.
వృద్ధుడు మన ఇంటిలో
ఒక వరం లాంటి వాడు
అనుభవాల దారంతో
త్రికాలాలకు వేసిన ముడిలాంటి వాడు
వృద్ధుడు రద్దయిన పద్దు కాదు
మన కృతజ్ఞతకు హద్దు

అనడంలొ సుగంధాని దగ్గని సుదీర్ఘ  గంధం వృద్ధాప్యం అని నిర్వచిస్తారు. శక్తి తగ్గొచ్చు కాని కాలానికి తలొగ్గని సూక్తి ముక్తావళి లాంటి వాడు వృద్ధుడు అంటారు గోపి.మనసులోకి చేదవేసి లాగే గతగతాల మధ్య యాంత్రికత, లుప్తమౌతున్న మానవతలు వృద్ధాప్యాన్ని ఎండుటాకులుగా మారుస్తుంటే పెరిగిన విచలితత్వాన్ని చూసి వేదన చెందుతారు. వయసు మళ్లిన పాటలో మారిన లోకం పోకడలు, తగ్గిన ప్రాధాన్యతలను బేరీజువేస్తారు. ముంచుకొస్తున్న వయస్సును ఆకాశంలో ముసురుకున్న మబ్బుకు ప్రతీకగా చెబుతారు. ఒంటరి తనమంటే చుట్టూ ఎవరూ లేకపోవడం కాదు ఉన్నా లేనట్టు అనిపించడమంటారు.

మనిషి శిలాజం, మాటలో డొల్లతనం, కన్నీటి చుక్కలు హృదయానికి గుచ్చుకోవడం వంటి చెబుతూ ఒంటరితనం వృద్ధాప్యానికి పూచే పిచ్చి పువ్వు ఒక మననని తట్టిలేపుతారు. వయసు మళ్లిన జీవితంఓల  సొగసుకు తావుండదు… నడక మందగించింది అది నీ పరుగులకు కొంతైనా కళ్లెం కావచ్చు అని హెచ్చరిస్తారు. రుణంరా అని అనుబంధాన్ని గుర్తు చేస్తారు. పూనిక ఒక పురోవాటిక కావాలంటారు. నడక వారసత్వం కవితలో తాతను మర్రిచెట్టు కొమ్మలుగా భావించి ఆయన చేతులు చాపి ఆలింగనం చేసుకున్న అనుభూతిని గుర్తు చేస్తారు.

ఆ కళ్ళ కింద ఒక లోతైన దిగులు కనిపించినా వెలుగు తగ్గని అతనికి ధైర్యం నూరిపోస్టానంటారు. శరీరం కేవలం ఎముకల సంచికాదు సంచిత ఐతిహాసిక ప్రకాశమని, మరణం ఒక భూతం కాదని వొట్టి గాలి సరుకని విశదరుస్తానని చెబుతారు. డెబ్బయి సంవత్సరాలు కవితలో జ్ఞాపకాల నిధులతో నేనిప్పుడు కోటీశ్వరుడిని అంటారు. అట్టపెట్టెలో కుక్కిన పాత ఫోటోలు ఎప్పటికీ పాతబడిన శోభిత కోటీరాలు అన్నప్పుడు జ్ఞాపకాల తడి తగులుతుంది. కొత్త వంతెనలు నిర్మిస్తూ మనుష్యుల్ని కలిపే  శుభ్రసుందర వాటిక వృద్ధాప్యం అని విశ్లేషిస్తారు. నాయనమ్మ ముఖం ముడతల్లోంచి కన్నీరై జారిన సంఘటనలను క్రోడీకరిస్తారు. నోరు తెరచుకునే మొసలి లాంటి కాలం నోరు మృత్యువుతో మూతబడుతుందా అని ప్రశ్నిస్తారు.

శత్రువులెప్పుడూ లేరు
ఇప్పుడు మొసలి తనమే ఓ దుష్మన్‌
ఎవరిపైనా షికాయత్‌ ‌లేదు
ఉంటే  దేవునపైన
కాని అతడేదీ వినడు

అంటూ వృద్ధాశ్రమం  కవితలో గోపి ఆ దశలోని ఆలోచన సాంద్రతని విప్పిచెబుతారు. వృద్ధాశ్రమంలో మంచాలు పాతవే వచ్చిపోయ్యే వాళ్లే మారుతుంటారు అన్న వాక్యాలు గుండెల్ని కదిలిస్తాయి. హాస్పిటల్లో  జీవనకాంక్ష ఒక మలిన మహాసాగరమవుతుందంటారు. కళ్లలో  నీళ్ళు సిద్ధంగా వుంటాయి పైకి కనబడవు అందుకే ముదిమిని అంగీకరించడం అంత సులభం కాదు అంటూ సంధ్యాకాలం అందమైందే కాని అది రాత్రికి ఇవతలి అంచుగా చెబుతారు. చెలామణి అయ్యే అనర్ఘరత్నాలు అనుభవాలనడం, సత్యం కొత్త పూర్ణకుంభమైతే దాని ముందు మౌవనం ఉనికి ఎంత అని ప్రశ్నించడం ఆలోచనలను మేల్కొల్పుతుంది.  శిథిలం కూడా కొంత వరకు పదిలమేనని మనసుకు వయసు లేదని చెబుతారు. నాణ్యతలు మారిపోతున్నప్పుడల్లా ఊహ బతికిస్తుందని తేలుస్తారు. జ్ఞాపకాల మైలురాళ్లను నాటే  జ్ఞాని మమకారాల చెట్టుకు కొత్తపులు పూయిస్తాడంటారు. తొంభై మైళ్లు దాటి గమ్యం పదే మిగిలినా ఆశకు ఆస్కారం వెతుక్కునే వాడే జ్ఞాని అని చెబుతారు. మలుపుల్లోనలిగిన వృద్ధాప్యాన్ని అక్షరాల్లో పోతపోస్తూ మరణం కన్నా ఎక్కువ భయపెట్టేది జీవితమేనని రాస్తారు. ఈ మూటలు వెంటరావని తెలుసు, చావు ఇంతందంగా వుంటుందా అనుకోవాలి అంటూ ముఖాముఖీని మృత్యువుతో సాగిస్తారు. లోకాన్ని కదిలించే అతను చావునేమ చంపేశాడని మరణంలేని మరణం కవితలో అంటారు. మునిమనుమరాలితో తొంభయ్యో పడిలో తాత ముచ్చటలాడుతూ మరణమంటే ఫికరులేదు, కవిత్వం రాయడం మానొద్దు అని ధైర్యాన్ని నూరిపోస్టారు. జీవించే కళ, అతను మరణించటానికి వీల్లేదు, శేషజీవితం, మజిలి, చిరకీర్తి వ్యక్తి చచ్చిపోయినా మనిషిగా మాత్రం గుర్తుండి పోతాడన్న ధృడ సంకల్ప సందేశాన్ని గోపి వినిపిచారు. చివరగా ఫల శ్రుతిలో మమకారాలు, జ్ఞాపకాలు వదలి అంతర్ముఖీన ప్రయాణమైన మనిషిగా వృద్ధుడిని మరణం నీకు మరో ఆవరణం జీవన మంటపానికి తోరణం అంటూ నీకు మరో ఆవరణం జీవన మంటపానికి తోరణం అంటూ ముగిస్తారు. వృద్ధాప్యపు విలువల పరిమళం ఈ కవిత్వం.
– డా. తిరునగరి శ్రీనివాస్‌
8466053933

Leave a Reply