14న ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్ : తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈనెల 14న పోలింగ్ జరుగనుండటంతో ఎన్నికల నియమావళి ప్రకారం 48 గంటల ముందు అభ్యర్థుల ప్రచార పర్వానికి తెరపడింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌తో పాటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో విజయం సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులు సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వరరెడ్డి గెలిపించడమే లక్ష్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్విరామంగా ప్రచారం నిర్వహించగా, బీజేపీ అభ్యర్థులు ప్రేమేందర్‌రెడ్డి, రాంచందర్‌రావు పక్షాన పార్టీ రాష్ట్ర నేతలు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పక్షాన ఆ పార్టీ అగ్ర నేతలు ప్రచారం నిర్వహించారు.
టీజేఎస్ నేత ప్రొ.కోదండరామ్ కూడా తన గెలుపు కోసం ఉధృతంగా ప్రచారం నిర్వహించారు. మరోవైపు, ఈ రెండు నియోజకవర్గాలలో ఎన్నికల బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులు సైతం ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రచారం నిర్వహించి వోటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాగా, ఈనెల 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. పోలింగ్ సందర్భంగా మద్యం షాపులపై ఆంక్షలు అమలులోకి వచ్చాయి, మళ్లీ వోట్ల లెక్కింపు రోజయిన ఈనెల 17న సైతం మద్యం షాపులు మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈరెండు నియోజకవర్గాలలో భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉండటంతో అందుకు తగినట్లుగానే అధికారులు బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తున్నారు.