Take a fresh look at your lifestyle.

పుర పోరుపై ఎన్నికల సంఘం పునరాలోచన

  • ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపు
  • వాయిదా వేయాలంటున్న రాజకీయ పార్టీలు
  • విధులు నిర్వర్తించలేమంటున్న ఉపాధ్యాయ సంఘాలు

రాష్ట్రంలో త్వరలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం పునరాలోచనలో పడింది. ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంటూనే ఏం చేయాలో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని సలహా కోరింది. రాష్ట్రంలో కొరోనా రోజురోజుకూ విజృంభిస్తుండటం ఇటీవల జరిగిన నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ ‌మొత్తం కుటుంబం కోవిడ్‌ ‌బారిన పడటంతో పాటు దాదాపు 160 మందికి వైరస్‌ ‌సోకింది. తాజాగా, స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా కొరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన కొరోనా బారిన పడటానికి కూడా నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి పక్షాన నిర్వహించిన ప్రచారమే కారణమని బలంగా ప్రచారం జరుగుతుంది. మరోవైపు, రాష్ట్రంలో కొరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం మంగళవారం నుంచి రాత్రి పూట కర్ఫ్యూ విధించింది.

రాత్రి కర్ఫ్యూ మే 1 వరకు కొనసాగుతుందని ప్రకటించింది. దీంతో పాటు కోవిడ్‌ ‌నిబంధనలు కచ్చితంగా పాటించాలనీ, ప్రజలు గుంపులు గుంపులుగా ఉండవద్దనీ, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులలో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఈ పరిస్థితులలో మున్సిపల్‌ ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రచార సమయాన్ని తగ్గించడమే కాకుండా పరిమితులు కూడా విధించింది. ఈ సమయంలో పురపాలన ఎన్నికలపై ఏ విధంగా ముందుకు వెళ్లాలో చెప్పాలని ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి గురువారం సమాధానం అందే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అధికారులు భావిస్తున్నారు.

కాగా, ఈనెల 30న పురపాలక సంఘాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ప్రచారం మరో వారం రోజుల్లో ముగియనుంది. ఎన్నికల పక్రియ దాదాపు సగం వరకూ పూర్తయిన ప్రస్తుత దశలో వాయిదా వేయడం సాధ్యం కాదనీ, అయితే, మరిన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తూ ఈ పక్రియను పూర్తి చేయాలని ఎన్నికల సంఘం అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, మున్సిపల్‌ ఎన్నికలు వాయిదా వేయాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. రాష్ట్రంలో కొరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రోజూ వేలాది కేసులు నమోదవుతూ పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న సమయంలో మున్సిపల్‌ ఎన్నికలు అవసరం లేదనీ, ప్రజల ప్రాణాల కంటే ఏవీ ముఖ్యం కాదని ప్రభుత్వం గ్రహించాలని పేర్కొంది.

ఈ పరిస్థితుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికల విధులు నిర్వర్తించలేమనీ, దీనిపై పునరాలోచించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మరోవైపు, రాజకీయ పార్టీలు కూడా రాష్ట్రంలో కొరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంగా మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై పునరాలోచించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాయి. ఈమేరకు టీ పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్‌ ‌మర్రి శశిధర్‌రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పార్థసారధికి మున్సిపల్‌ ఎన్నికలను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉన్నందున ఎన్నికలలో పాల్గొనడం రాజకీయ నాయకులు, వోటర్లు, కార్మికులు, ఎన్నికల సిబ్బందికి చాలా కష్టమనీ, ఎన్నికల విధులలో పాల్గొనడానికి సిబ్బంది,ఉపాధ్యాయులు కూడా విముఖత చూపిస్తున్న ప్రస్తుత సమయంలో ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగుల ప్రాణాల దృష్ట్యా ఎన్నికల వాయిదా వేయడమే మంచిదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Leave a Reply