Take a fresh look at your lifestyle.

వ్యాక్సిన్‌ ‌సమర్థత 80 శాతం వరకు మాత్రమే..! ‌వేయించుకున్నా జాగ్రత్తలు అవసరమే

‌వ్యాక్సిన్‌ ‌వేసుకున్నా జాగ్రత్తలు పాటించకుంటే కొరోనా బారిన పడక తప్పదని కేసులను బట్టి వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్‌ ‌వేసుకున్నాక నిర్లక్ష్యంగా ఉన్నవారిలో కూడా మళ్లీమళ్లీ కొరోనా సోకుతుందని అంటున్నారు. వ్యాక్సిన్‌ ‌సమర్థత 80 శాతం వరకు మాత్రమే ఉంటుందని గుర్తించాలని హెచ్చరిస్తున్నారు. మశూచి లేదా పిల్లలకు వేసే టీకాల్లో కొందరిలో మళ్లీమళ్లీ మశూచి సోకడం కూడా ఇదే కారణమని అంటుననారు. టీకా వేయించుకున్న వంద మందిలో 80 మందికి పనిచేస్తే మరో 20 మందిలో పనిచేయకపోవచ్చు. వంద మందిలో 50 మందికి బాగైనా ఉపయోగకరంగానే భావిస్తారు. కొరోనా వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్‌ ‌తీవ్రతను మాత్రమే వ్యాక్సిన్‌ ‌తగ్గిస్తుంది. కొందరిలో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఏ మందు,వ్యాక్సిన్‌ ‌సంజీవని కాదు, అమృతం అంతకన్నా కాదని అంటున్నారు. కానీ.. వ్యాక్సిన్‌ ‌తీసుకున్న వెయ్యి మందిలో అయిదారుగురు మాత్రమే ఐసీయూ వరకు వెళతారనేది వాస్తవం.

అదే వ్యాక్సిన్‌ ‌తీసుకోని వెయ్యి మందిలో 100 నుంచి 150 మంది వరకు ఐసీయూ దాకా వెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పక వ్యాక్సిన్‌ ‌తీసుకోవాలి. రెండు డోసుల టీకా వేయించుకున్న ఆరోగ్య కార్యకర్తల్లో జాగ్రత్తలు తీసుకున్న వారిలో ఒక్కరు కూడా కొవిడ్‌తో చనిపోలేదని వైద్యులు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 269 మంది రిజిస్టర్డ్ ‌వైద్యులు సెకండ్‌వేవ్‌లో కొరోనాతో చనిపోయారని భారత వైద్య సమాఖ్య (ఐఎంఏ) మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అత్యధికంగా బిహార్‌లో 78 మంది, ఉత్తరప్రదేశ్‌లో 37 మంది, ఢిల్లీలో 29 మంది వైద్యులు చనిపోయినట్టు ఐఎంఏ వెల్లడించింది.

అపోలో హాస్పిటల్స్‌ల్లో రెండు డోసులూ వేయించుకున్న 3600 మంది వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తల్లో కేవలం 2.6 శాతం మంది మాత్రమే సెకండ్‌ ‌వేవ్‌లో వైరస్‌ ‌వల్ల ఇన్ఫెక్షన్‌ ‌బారిన పడ్డారని.. వారిలో ఒక్కరు కూడా చనిపోలేదని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ ‌వేసుకున్న వారిలో పదిమందికి రెండు నెలల తర్వాత వైరస్‌ ‌సోకింది. కానీ, వారంతా అయిదు రోజులకే కోలుకున్నారు. ఎవరికీ ఎలాంటి అపాయం కలగలేదు. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, ఊపిరితిత్తుల జబ్బులు, హృద్రోగాలు, స్థూలకాయం, కాలేయ, మూత్రపిండ వ్యాధులు ఉన్నవారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటివారు టీకా వేయించుకున్నా కొత్త వేరియంట్ల బారిన పడితే ఇబ్బందులు ఎదురవుతాయి. ఇటీవలి మరణాల్లో ఎక్కువ శాతం మంది ఇలాంటి జబ్బులతోనే మరణిస్తున్నారు.

Leave a Reply