Take a fresh look at your lifestyle.

భూమి మనిషికి మాత్రమే సొంతం కాదు

మనుషుల స్వార్థానికి అరణ్యాలకు ఆపద ఏర్పడుతోంది. అరణ్యాలనే ఆవాసం చేసుకున్న అసంఖ్యాకమైన వన్యప్రాణుల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. మనుషుల స్వార్థం ఫలితంగానే దాదాపు పది లక్షలకు పైగా జాతులకు చెందిన వన్యప్రాణులు అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్నాయని ఐక్యరాజ్యసమితి సమితి సహా పలు అంతర్జాతీయ సంస్థలు హెచ్చరికలు చేస్తున్నాయి. వన్యప్రాణులు ఒక్కొక్కటే అంతరించిపోతూ పోతే, చివరకు మనిషి మనుగడకే ముప్పు తప్పదని కూడా చెబుతున్నాయి. ప్రపంచంలో జీవవైవిధ్యం సజావుగా ఉంటేనే భూమ్మీద మనుషుల మనుగడ సజావుగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మన భారత దేశంలోనూ వన్యప్రాణుల పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. పర్యావరణంలో వృక్షజాలం మరియు జంతుజాలం యొక్క సహకారాన్ని మరియు భూమిపై జీవన ఉనికికి వాటి అవసరాన్ని గుర్తించి, ఐక్యరాజ్యసమితి 1973 మార్చి 3 న సి ఐ టి ఇ ఎస్‌. CITES (CITES- Convention on International Trade in Endangered Species ను ఏర్పాటు చేసింది. దీనికి గుర్తుగా మార్చి 3 వ తేదీన ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని జరుపుకుంటారు.

భారత దేశంలో దాదాపు 551 వన్యప్రాణుల అభయారణ్యాలు, 18 జీవ వైవిధ్య అభయారణ్యాలు, 104 నేషనల్‌ ‌పార్కులు ఉన్నాయి. వన్యప్రాణులను, జీవవైవిధ్యాన్ని కాపాడటానికి ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసింది. స్థూలంగా చూసుకుంటే దేశంలోని 5.1 శాతం భూభాగాన్ని%–% 1.65 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని మన ప్రభుత్వం వన్యప్రాణుల రక్షణ కోసం ఉపయోగిస్తోంది. మన దేశంలోని పడమటి కనుమలు, తూర్పు హిమాలయ ప్రాంతం, భారత్‌%–%‌బర్మా సరిహద్దు ప్రాంతాలు మూడూ ప్రపంచంలోనే గొప్ప జీవవైవిధ్యానికి నిలయంగా నిలుస్తున్న ముప్పయి నాలుగు ప్రాంతాల్లో కీలకమైనవి.

ప్రపంచంలోని స్తన్యజీవుల్లో 7.6 శాతం, ఉభయచరాల్లో 14.7 శాతం, 6 శాతం పక్షి జాతులు, 6.2 శాతం సరీసృపాలు, 6 శాతం పూలు పూసే వృక్షజాతులు భారత భూభాగంలో ఉన్నాయి. ఇన్ని విశేషాలు ఉన్నా, ప్రపంచంలో చాలా చోట్ల మాదిరిగానే మన దేశంలోనూ వన్యప్రాణుల మనుగడకు పూర్తి భరోసా ఇచ్చే పరిస్థితులేమీ లేవు. మనుషులు అడవులను అడ్డగోలుగా ఆక్రమించుకోవడం, ఎన్ని నిషేధాజ్ఞలు అమలులో ఉన్నా వన్యప్రాణులను యథేచ్ఛగా వేటాడటం, ఖనిజ తైల ఇంధనాలను, రసాయనిక ఎరువులు, పురుగుమందులను యథేచ్ఛగా వాడటం వంటి చర్యలతో ప్రకృతి సమతుల్యత గతి తప్పి వన్యప్రాణుల మనుగడకు ప్రమాదం కలుగుతోంది.

మన దేశంలో దాదాపు 132 జీవజాతులు అంతరించిపోయే పరిస్థితులకు చేరువగా ఉన్నాయని, వీటిలో 49 వృక్షజాతులు కూడా ఉన్నాయని ‘ఇంటర్నేషనల్‌ ‌యూనియన్‌ ‌ఫర్‌ ‌కన్జర్వేషన్‌ ఆఫ్‌ ‌నేచర్‌’ (ఐయూసీఎన్‌) ‌గత ఏడాది సెప్టెంబర్లో విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది. మన జాతీయ జంతువైన పెద్దపులి మొదలుకొని పలు చిన్నా చితకా జంతువులు, రాబందులు మొదలుకొని పిచ్చుకల వరకు గల పక్షుల సంఖ్య గడచిన శతాబ్దకాలంలో గణనీయంగా తగ్గిపోయింది. మన ఆర్థిక వ్యవస్థలు, మన జీవనోపాధి, ఆహార భద్రత, ఆరోగ్యం, జీవన నాణ్యతలకు సంబంధించిన పునాదులకు మనమే హాని చేసుకుంటున్నాం’ అని శాస్త్రవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘మితిమీరిన చేపల వేట, ప్లాస్టిక్‌ ‌వ్యర్థాలు, ఆమ్లీకరణ వంటి వాటితో చివరకు సముద్రాలను కూడా నాశనం చేస్తున్నాం’ విశ్లేషకుల అభిప్రాయం. నవ సహస్రాబ్దిలో ఐక్యరాజ్య సమితి నిర్దేశించుకున్న ప్రపంచ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలంటే 2030 నాటికి భూమ్మీద మనుగడ సాగిస్తున్న వాటిలో ప్రమాదం అంచుల్లో ఉన్న 30 శాతం జీవ జాతులను కాపాడుకోవాలని, 2050 నాటికి అంతరించిపోయే స్థితిలో ఉన్నవాటిలో 50 శాతం జీవజాతులను రక్షించుకోవాలని పారిస్‌ ‌సదస్సులో పాల్గొన్న ‘నేషనల్‌ ‌జాగ్రఫిక్‌ ‌సొసైటీ’ ఉపాధ్యక్షుడు జొనాథన్‌ ‌బెయిలీ పిలుపునిచ్చారు.

వన్యప్రాణులకు చేటు తెచ్చి పెడుతున్న కారణాలు చాలానే ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఖనిజ ఇంధనాల వినియోగం వల్ల మితిమీరి పెరుగుతున్న కాలుష్యం, దాని ఫలితంగా పెరుగుతున్న భూతాపం, యథేచ్ఛగా సాగుతున్న అడవుల నరికివేత, విశృంఖలమైన వేట, వ్యవసాయ పద్ధతుల్లో మార్పుల వల్ల పెరిగిన పురుగు మందులు, రసాయనిక ఎరువుల వినియోగం వంటివి వన్యప్రాణుల మనుగడకు తీవ్రస్థాయిలో ముప్పు తెచ్చిపెడుతున్నాయి. ఇవన్నీ మానవ తప్పిదాలు. వీటిని నియంత్రించకుంటే మన కళ్ల ముందే చాలా జీవజాతులు అంతరించిపోయే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు కూడా వన్యప్రాణులు అంతరించిపోవడానికి కారణమవుతుంటాయి. గ్రహశకలాలు భూమిని తాకడం, భూకంపాలు, కార్చిచ్చులు వంటి ఉత్పాతాలు జీవరాశికి చేటు తెచ్చిపెడుతుంటాయి.

దాదాపు ఆరున్నర కోట్ల ఏళ్ల కిందట గ్రహశకలాలు భూమిని తాకిన ఫలితంగా అప్పటి వరకు భూమ్మీద మనుగడ సాగించిన భారీ జీవులైన డైనోసార్లు పూర్తిగా అంతరించిపోయాయి. అడవుల నరికివేత, కార్చిచ్చుల కారణంగా వన్యప్రాణులు ఆవాసం కోల్పోయి అంతరించిపోయే పరిస్థితులకు చేరుకుంటున్నాయి. జన్యు వైవిధ్యం కొరవడటం కారణంగా కొన్ని ప్రాణులు కనుమరుగయ్యే స్థితికి చేరుకుంటున్నాయి. ఆఫ్రికన్‌ ‌చిరుతలు జన్యు వైవిధ్యం కొరవడటం కారణంగానే త్వరగా అంతరించిపోతున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆహారం కొరవడటం వల్ల మరికొన్ని జీవజాతులు నశిస్తున్నాయి. దోమలను ఆహారంగా తీసుకుంటూ మనుగడ సాగించే కొన్ని రకాల కప్పలు, గబ్బిలాల సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా తగ్గముఖం పడుతోంది. ప్లాస్టిక్‌, ‌ప్రమాదకరమైన రసాయనాలు సముద్రాల్లో కలుస్తుండటంతో పలు జాతులకు చెందిన సముద్రజీవులు, పగడపు దీవులు వేగంగా నశిస్తున్నాయి.

ఇటీవలి కాలంలో ప్రభుత్వం రాబందుల పరిరక్షణ కోసం, ఖడ్గమృగాల పరిరక్షణ కోసం కూడా ప్రత్యేక ప్రాజెక్టులను ప్రారంభించింది. ప్రభుత్వాలు వన్యప్రాణుల పరిరక్షణ కోసం ఎన్ని కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుని, అమలులోకి తెచ్చినా, ఖనిజ ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గించకుండా జీవవైవిధ్యాన్ని దీర్ఘకాలంలో కాపాడుకోవడం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఖనిజ ఇంధనాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకోవడమే కాకుండా, విరివిగా అడవుల పెంపకం, రసాయన వ్యర్థాలను నదులు, సముద్రాల్లో కలపకుండా జాగ్రత్త పడటం, ప్లాస్టిక్‌ ‌వినియోగాన్ని తగ్గించుకోవడం వంటి చర్యలను చిత్తశుద్ధితో చేపడితే తప్ప జీవజాతులను కాపాడుకోలేమని వారు చెబుతున్నారు.

md quaza
డాక్టర్‌ ఎం ‌డి ఖ్వాజా మొయినొద్దీన్‌
‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌ అం‌డ్‌ ‌ఫైనాన్స్
‌తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
తెలంగాణ సాహిత్య రత్న అవార్డ్ ‌గ్రహిత
యంగ్‌ ‌సైంటిస్ట్ అవార్డ్ ‌గ్రహిత.
బెస్ట్ ‌రిసెర్చర్‌ అవార్డ్ ‌గ్రహిత
9492791387

Leave a Reply