Take a fresh look at your lifestyle.

కొత్త జోనల్‌ ‌విధానంలోనే ఉద్యోగుల విభజన పక్రియ

  • యాసంగిలో వరి ధాన్యం కొనుగోళ్లు ఉండవు
  • కేంద్ర ప్రభుత్వ విధానాలను క్షేత్ర స్థాయిలో వివరించాలి
  • దళిత బంధుకు త్వరలోనే మరిన్ని నిధులు మంజూరు
  • కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర ప్రతినిధి : రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొత్త జోనల్‌ ‌విధానం అమలులోనికి వచ్చిన నేపథ్యంలో అందుకు అనుగుణంగానే ఉద్యోగుల విభజన పక్రియను చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ‌జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.ఉద్యోగుల విభజన పక్రియ పూర్తయితే అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాల్లోనూ పరిపాలన సజావుగా సాగుతుందని స్పష్టం చేశారు. శనివారం సీఎం కేసీఆర్‌ ‌ప్రగతి భవన్‌లో జిల్లాల కలెక్టర్లు, సీనియర్‌ అధికారులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ పథకాల అమలు, ధాన్యం సేకరణ, ఉద్యోగుల విభజన అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగుల విభజన, కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి పక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో దీనిపై సీఎం కేసీఆర్‌ ‌సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉద్యోగుల విభజన పక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసినట్లయితే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో పాలన సజావుగా సాగేందుకు వీలు కలుగుతుందన్నారు. దీంతో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభించే వెసులుబాటు కూడా కలుగుతుందని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా విభజన పక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించి నాలుగైదు రోజుల్లో నివేదిక అందజేయాలని ఆదేశించారు. వెనుకబడిన మారుమూల జిల్లాలలో పాలన అందరికీ చేరాలనే ఉద్దేశ్యంతోనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు.

భార్యాభర్తలు ఉద్యోగులైతే వారిద్దరినీ, ఒకే చోట పనిచేసే విధంగా వెసులుబాటు కల్పించాలని సీఎం ఆదేశించారు. కొత్త జోనల్‌ ‌వ్యవస్థతో ప్రభుత్వ పాలన క్షేత్రస్థాయిలో అమలవుతుందని సీఎం పేర్కొన్నారు.కాగా, రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లపై నిర్వహించిన సమీక్ష సందర్బంగా యాసంగిలో ఒక్క గింజ కూడా వడ్లను కొనుగోలు చేసేది లేదని స్పష్టం చేశారు. గతంలో ప్రకటించిన విధంగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవన్నారు. యాసంగిలో వడ్లను కొనేది లేదని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో రాష్ట్ర రైతాంగాన్ని కాపాడేందుకు ధాన్యం కొనుగోలు చేయవద్దని నిర్ణయించామన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో వివరించాలని ఆదేశించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే దిశగా రాష్ట్రం అమలు చేస్తున్న విధానాలను దేశంలోని మరే రాష్ట్రమూ అమలు చేయడం లేదనీ, చెప్పారు. రాబోయే వానాకాలం పంటల సాగుపై రైతులు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని ప్రత్యామ్నాయ, లాభసాటి పంటల సాగుదిశగా రైతులను సమాయత్తం చేయాలని ఆదేశించారు. అలాగే, హుజురాబాద్‌ ఉప ఎన్నికల సందర్భంగా ప్రకటించిన విధంగా దళిత బంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఈ పథకానికి మరిన్ని నిధులు త్వరలోనే మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు.దళిత బంధు పథకంపై విపక్షాలు ప్రభుత్వంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయనీ, ఈ విషయాన్ని క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ‌కలెక్టర్లను ఆదేశించారు.

Leave a Reply